Andhra News: పంచాయతీలకు మళ్లీ షాక్‌

పంచాయతీల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలని రోడ్లపైకి వచ్చి సర్పంచులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు.

Updated : 08 Oct 2022 08:32 IST

పీడీ ఖాతాల్లోకే ఆర్థిక సంఘం నిధులు

విద్యుత్తు ఛార్జీల కింద రూ.379.34 కోట్లు మళ్లించుకునేందుకు ఏర్పాట్లు

మరో రూ.569 కోట్లు కేటాయించిన కేంద్రం.. వాటి వినియోగంపైనా సందేహాలు

ఈనాడు, అమరావతి: పంచాయతీల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలని రోడ్లపైకి వచ్చి సర్పంచులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. నిధుల్లేక గ్రామాల్లో ఎలాంటి పనులూ చేయలేకపోతున్నామని గగ్గోలు పెడుతున్నా, భిక్షాటనలు చేస్తున్నా కనికరించలేదు. పంచాయతీ, జిల్లా, మండల పరిషత్తుల పర్సనల్‌ డిపాజిట్‌ (పీడీ) ఖాతాల్లోనే యథావిధిగా మళ్లీ ఆర్థిక సంఘం నిధులు జమ అయ్యేలా ఆదేశాలిచ్చింది. రూ.379.34 కోట్ల నిధులకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ పేరుతో గత నెల 28న విడుదలైన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పంచాయతీ, జిల్లా, మండల పరిషత్తుల వారీగా కేటాయించిన నిధులన్నీ పీడీ ఖాతాల్లో జమ అయ్యేలా బిల్లులను జిల్లా ఖజానా అధికారి (డీటీవో) ద్వారా డీపీవోలు ఆమోదింపజేయాలని కమిషనర్‌ ఆదేశించారు. పీడీ ఖాతాల్లో నిధులు వేయడం ద్వారా వీటిని పంచాయతీ విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద మరోసారి మళ్లించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కినట్లయింది. గత ఆగస్టులో రూ.379.34 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తర్వాత మరో 15 రోజుల్లో ఇంకో విడతగా రూ.569 కోట్లనూ విడుదల చేసింది. ఆ నిధులు ఇప్పుడు ఏమవుతాయన్నది ప్రశ్నార్థకంగా ఉంది. వీటిని ఆయా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో వేయాలా? పీడీ ఖాతాల్లోనే జమ చేయాలా? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

బ్యాంకు ఖాతాలు తెరిపించి ఏం లాభం?
కేంద్ర ప్రభుత్వం గత రెండు నెలల్లో రెండు విడతలుగా మొత్తం రూ.948.34 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసింది. ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా జమ అయ్యేలా బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం తెరిపించింది. ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీలకు 70%, మండలపరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు తలో 15% చొప్పున ఇవ్వాలి. కానీ, ఈ నిధులన్నీ మళ్లీ రాష్ట్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు అనుసంధానించిన గ్రామ పంచాయతీల పీడీ ఖాతాలకు జమ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేయడంతో సర్పంచులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పంచాయతీల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక సంఘం నిధులు జమ చేయాలని వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా ఒక విడత విడుదలైన రూ.379.34 కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఆయా పీడీ ఖాతాల్లో జమ అయ్యేలా పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ పేరుతో గత నెల 28న ఉత్తర్వులు వెలువడ్డాయి. అక్టోబరు 1 నుంచి 14 వరకు రెండు వారాలపాటు వ్యక్తిగత కారణాలతో శశిధర్‌ సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌కి పీఆర్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ 28నే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని