Andhra News: ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం

ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం నెలకొంది. ఈ ఏడాది నిర్వహిస్తారా? లేదా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది బదిలీలు నిర్వహిస్తామని విద్యా సంవత్సరం మొదట్లో పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

Updated : 09 Oct 2022 07:50 IST

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం నెలకొంది. ఈ ఏడాది నిర్వహిస్తారా? లేదా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది బదిలీలు నిర్వహిస్తామని విద్యా సంవత్సరం మొదట్లో పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పోస్టుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు నిర్వహించి, ఆగస్టులో బదిలీలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ సైతం వెల్లడించారు. ఉపాధ్యాయులు ఒకే స్టేషన్‌లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటే తప్పనిసరి బదిలీ ఉంటుందని చెప్పారు. గతంలో ఇది ఎనిమిదేళ్లు ఉండగా.. ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు ఐదేళ్లకు తగ్గించినట్లు అప్పట్లో పేర్కొన్నారు. అయినా ఇంతవరకు వీటికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. బదిలీల దస్త్రం మంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లింది. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. బదిలీలకు షెడ్యూల్‌ ప్రకటిస్తే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు సుమారు నెల రోజులు పడుతుంది. ఇప్పుడు షెడ్యూల్‌ ఇచ్చినా నవంబరు నెల చివరికిగాని పూర్తికావు. ఈ సమయంలో బదిలీలు చేస్తే పైతరగతుల విద్యార్థుల అభ్యసనకు ఇబ్బందులు ఏర్పడతాయని కొందరు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గత రెండేళ్లుగా ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించలేదు. దీంతో దూర, మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న వారు బదిలీలు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రస్తుతం జిల్లాల వారీగా పదోన్నతులు ఇస్తున్నారు. పదోన్నతి పొందిన వారికి బదిలీ సమయంలోనే కొత్త పోస్టింగ్‌ ఇస్తామని జిల్లా విద్యాధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని