Dharmana Prasada Rao: అ‘ధర్మాన’ పర్వం
మంత్రి ధర్మాన ప్రసాదరావు గంగిగోవులా కనిపిస్తారు.. ప్రవచనకారులను మరిపించేలా ప్రసంగిస్తారు.. ఆయన ప్రసంగాల్లో వల్లించే నీతివాక్యాలు, చెప్పే సుద్దులు వింటే.. ఇలాంటి వారి వల్లే కదా.. ఇంకా ఈ భూమ్మీద కాస్తో కూస్తో ధర్మం మిగిలి ఉందనిపిస్తుంది! విశాఖలో ఆయన భూములు కొట్టేసిన తీరు, దానికి ఆయన వేసిన స్కెచ్‌లు, పన్నిన పన్నాగాలు చూస్తే మాత్రం...ఆయన ఎంత గుండెలు తీసిన బంటో అర్థమవుతుంది.
నాటి విశాఖ భూ కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి అంతా రెవెన్యూ మంత్రే
రికార్డుల ట్యాంపరింగ్.. ఎమ్మార్వోల సంతకాలూ ఫోర్జరీ
డీ ఫాం పట్టాల జారీ తీరుపైనా అనుమానాలే
కొందరు సైనికోద్యోగులు ఉద్యోగాల్లో ఉండగానే పట్టాలు
ముందే పట్టాలు ఇచ్చారా, ఆనక రికార్డులు మార్చారా?
రెవెన్యూ ఉన్నతాధికారులు తప్పన్నా మంత్రి స్వయంగా సిఫార్సు
ఇష్టారాజ్యంగా కలెక్టర్ల నిర్ణయాలు
ఈనాడు - అమరావతి
మంత్రి ధర్మాన ప్రసాదరావు గంగిగోవులా కనిపిస్తారు.. ప్రవచనకారులను మరిపించేలా ప్రసంగిస్తారు.. ఆయన ప్రసంగాల్లో వల్లించే నీతివాక్యాలు, చెప్పే సుద్దులు వింటే.. ఇలాంటి వారి వల్లే కదా.. ఇంకా ఈ భూమ్మీద కాస్తో కూస్తో ధర్మం మిగిలి ఉందనిపిస్తుంది! విశాఖలో ఆయన భూములు కొట్టేసిన తీరు, దానికి ఆయన వేసిన స్కెచ్‌లు, పన్నిన పన్నాగాలు చూస్తే మాత్రం... ఆయన ఎంత గుండెలు తీసిన బంటో అర్థమవుతుంది. విశాఖలోని భూ అక్రమాలపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయన అసలు రూపాన్ని అరటిపండు ఒలిచి పెట్టినంత చక్కగా విడమరిచి చూపింది. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులుగా, అధికార పార్టీలో కీలక నేతలుగా ఉన్న కొందరు... గతంలో విశాఖలో భూముల్ని ఎలా స్వాహా చేశారో, వాటికి ధరలు పెంచుకోవడానికి ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి పాట ఎలా అందుకున్నారో చెప్పడానికి ధర్మానే తిరుగులేని నిదర్శనం!
ఒకటా రెండా... ఏకంగా 71 ఎకరాల అత్యంత విలువైన భూముల్ని ఆయన చాకచక్యంగా మడతపెట్టేసిన తీరు నభూతో!
విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన ఎసైన్డ్ భూములకు నిరభ్యంతర పత్రాలివ్వాలని రెవెన్యూ మంత్రిగా తానే సిఫారసు చేసి, కలెక్టర్లు, జేసీలపై ఒత్తిడి తెచ్చి ఎన్వోసీలు ఇప్పించి..మళ్లీ ఆ భూముల్ని తన మనుషులతోనే కొనిపించి... చివరకు అవి తన భార్య, కుమారుడు, సోదరుడు, సన్నిహితులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల స్వాధీనంలోకి తేవడంలో ఆయన ప్రదర్శించిన ‘అసాధారణ ప్రతిభ’ అందరికీ సాధ్యం కాదు!
సిట్‌లో సభ్యులు ఎంతో శోధించి విశాఖ భూబాగోతాలపై రాసిన వందల పేజీల నివేదికలో ‘ధర్మాన పర్వమే’ అతి పెద్దది!
అంతా.. అ‘ధర్మానే’
విశాఖ భూకుంభకోణానికి అన్నీ అమాత్యుడే
ఈనాడు - అమరావతి
కర్త, కర్మ, క్రియ సర్వం ధర్మానే.
విశాఖ భూ కుంభకోణం వ్యూహకర్తా ఆయనే.
భూములు కొల్లగొట్టడంలో సూత్రధారీ
వాటిని తనవారికి కట్టబెట్టడంలో అసలైన పాత్రధారీ ధర్మానే..
విశాఖ భూ కుంభకోణంపై సిట్ నివేదిక ఆసాంతం పరిశీలిస్తే.. ఈ వ్యవహారాలన్నింటి వెనుక అప్పటి, ఇప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చురుగ్గా పని చేసిన వైనం విస్తుగొలుపుతుంది. ఎక్కడ భూమిని ఎలా ఏమార్చి తన మనుషులకు చేర్చవచ్చో పక్కా స్కెచ్ రూపొందించి మరీ అడుగులు వేసినట్లు అవగతమవుతోంది. పేద ప్రజలు అంటూ పదే పదే సూత్రాలు వల్లించే ధర్మాన.. ఆ పేదలకు ఇచ్చే ఎసైన్డు భూములనే కాజేయడం కాకతాళీయమేమీ కాదు. పేదల పేరుతో పట్టాలు పుట్టించి రూ.వందల కోట్ల భూములను హస్తగతం చేసుకున్నారు.. సాక్షాత్తూ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల కమిటీ లోతైన దర్యాప్తు చేసి తేల్చిన నిజాలివీ. ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను, భూములు రిజిస్టర్ చేయించుకున్న వారిని సిట్ ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందాలు విచారించాయి. ‘మాకేం తెలియదు.. అంతా ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లే చేశాం’ అని భూములు కొన్నవారు సిట్‌కు స్పష్టంగా చెప్పారు. వారంతా ధర్మానకు సన్నిహితులు, వారి బంధువులే కావడం గమనార్హం. ‘ఈ ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు సామాన్యుడు దరఖాస్తు చేస్తే అధికారులు అనుమతిచ్చి ఉండేవారు కాదు. మాజీ సైనికోద్యోగుల నుంచి వాటిని కొంటున్నది సాక్షాత్తూ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబసభ్యులు, స్నేహితులు కావడం వల్లే అధికారులు అనుమతులు మంజూరు చేశారు’ అని సిట్ తేల్చింది. అంటే సూత్రధారి, పాత్రధారే కాదు.. లబ్ధిదారు కూడా ధర్మానే అని స్పష్టంగా తేలిపోయింది.
విశాఖ గ్రామీణ మండలం మధురవాడ సర్వే నంబరు 355/4లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమి ధర్మాన కుటుంబం సొంతమయింది. మాజీ సైనికోద్యోగి మాదాబత్తుల అప్పారావు పేరున ఇచ్చిన డీ ఫాం భూమి అమ్ముకునేందుకు నిరభ్యంతర పత్రం వచ్చేలా చేసి ఆ భూములు కొన్నారు. ఈ భూమి ధర్మాన కుటుంబపరం కావడానికి ముందు గుబ్బల గోపాలకృష్ణ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఆయన ధర్మాన కుటుంబ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న ఐబీ కుమార్‌కు మామ. ధర్మాన ప్రసాదరావు చెప్పడం వల్లే తాను భూమిని కొన్నానని గుబ్బల గోపాలకృష్ణ సిట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందాను. నా రెండో కుమార్తెను ఐబీ కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేశాను. ఆయన ధర్మాన ప్రసాదరావుకు అత్యంత సన్నిహితుడైన కుటుంబ స్నేహితుడు. ఆయన ద్వారా నాకు కూడా ధర్మాన పరిచయమే.
* 2005 నవంబరులో ఒక రోజు ఐబీ కుమార్ ధర్మాన ప్రసాదరావు సోదరుడు రామదాస్, ఆయన బంధువు జోగినాయుడులను నా దగ్గరకు తీసుకొచ్చారు. వారిద్దరూ నా పేరిట మధురవాడలో కొంత భూమి కొంటామని చెబితే నేను ఒప్పుకోలేదు. దీంతో వారు ఫోన్ చేసి ధర్మానతో మాట్లాడించారు. ఆ భూమి మీ పేరుతో కొన్నాళ్లే ఉంటుందని ఆయన నచ్చజెప్పడంతో అలా కొనేందుకు అంగీకరించాను. జోగినాయుడు దగ్గరుండి నా పేరుతో జీపీఏ కం సేల్ అగ్రిమెంట్ చేయించారు. పలు కాగితాలపై నాతో సంతకాలు పెట్టించుకున్నారు. దీనిలో నేను ఒక్క రూపాయి చెల్లించలేదు. ఒక్క రూపాయి లబ్ధి పొందలేదు. ధర్మాన ఓ రోజు నా దగ్గరకు వైకుంఠరావు అనే ట్యాక్స్ కన్సల్టెంట్‌ను పంపించారు. లాభాల్లో వాటా పంచుకున్నట్లు నా పేరిట ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు పేరిట డీడీలు రూపొందించారు. 2006, 2007లో మరోసారి ధర్మాన ప్రసాదరావు సూచనతో లంకెలపాలెంలో నా పేరిట కొంత భూమి రిజిస్టరయింది. తర్వాత దాన్ని ధర్మాన కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడుకు చెందిన ఓంకాన్ కంపెనీకి బదిలీ చేశా. ఆ సమయంలో 700 చదరపు గజాల స్థలం ధర్మాన ప్రసాదరావు భార్య లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ రోజు ఆమె కుమారుడితో కలిసి కార్యాలయానికి వచ్చారు.
స్వయంగా మంత్రే సిఫార్సు
మాజీ సైనికోద్యోగుల పేరుతో ఉన్న డీ ఫాం భూములకు నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) ఇవ్వాలని అప్పటి రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావే స్వయంగా సిఫార్సు లేఖలు రాశారు. జిల్లా కలెక్టరుకు తానే సంతకాలు చేసి పంపించారు. అందువల్లే వీటికి నిరభ్యంతర పత్రాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయింది. మాజీ సైనికోద్యోగి పల్లా సింహాచలం తన డీ ఫాం భూమిని అమ్ముకునేందుకు ఎన్వోసీ కోసం చేసుకున్న దరఖాస్తును సిఫార్సు చేస్తూ స్వయంగా మంత్రి ధర్మాన 2008 మే 28న నాటి జిల్లా కలెక్టర్‌కు పంపారు. కింతాడ అప్పారావుతో పాటు మరో నలుగురు మాజీ సైనికోద్యోగులూ తమ భూములు అమ్ముకునేందుకు వీలుగా ఎన్వోసీ మంజూరు చేయాలనే ఫైళ్లను ఒకే రోజున మంత్రి ధర్మాన జిల్లా అధికారులకు పంపారు. అవన్నీ ఒకే ప్రొఫార్మాలో ఉన్నాయని, వీటికి నిరభ్యంతర పత్రాలు మంజూరు చేయాలంటూ 2008 నవంబరు 12న ధర్మాన తన లెటర్‌హెడ్‌పై జిల్లా కలెక్టర్‌కు ఎండార్స్ చేశారని సిట్ తేల్చింది.
డీ ఫాం పట్టాల జారీపైనా అనుమానాలే!
మాజీ సైనికోద్యోగుల పేరుతో ఉన్న కొన్ని డీ ఫాం పట్టాలపైనా, వాటి కేటాయింపుల్లో నిబంధనలు ఎంత వరకు పాటించారనే విషయంలోనూ సిట్ సందేహాలు వ్యక్తం చేసింది. ఈ భూములు అమ్మిన మాజీ సైనికోద్యోగుల్లో కొందరు ఎక్కడున్నారో కూడా సిట్‌కు ఆచూకీ దొరకలేదు. విశాఖ జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో మాజీ సైనికోద్యోగులు ఏఎస్‌ఆర్‌కేకే కుమార్, ఆర్.రామచంద్రరావు, ఎన్.చంద్రరావుల పేర్లతో సర్వే నంబరు 360/3లో 3.14 ఎకరాలు, 361/2లో 3.85 ఎకరాలు, 367/1లో 2.82 ఎకరాలు.. మొత్తం 9 ఎకరాల 81 సెంట్లు భూమికి పట్టాలు ఇచ్చారు. ఈ మాజీ సైనికోద్యోగుల్లో ఇద్దరు ఎక్కడున్నారో సిట్ గుర్తించలేకపోయింది.
ఉద్యోగంలో ఉండగానే మాజీ సైనికుల కోటాలో భూమి
విశాఖపట్నానికి చెందిన వాసుపల్లి సత్తయ్య అనే మాజీ సైనికోద్యోగికి విశాఖ గ్రామీణ మండల పరిధిలోని పరదేశిపాలెంలోని బోరవానిపాలెం సర్వే నంబరు 187/1లో 4.89 ఎకరాలను 1978లో కేటాయించారు. ఈ కేటాయింపులపైనా సిట్ సందేహాలు వ్యక్తం చేసింది. సత్తయ్య సైనికోద్యోగిగా 01-12-1983న పదవీ విరమణ చేశారని, ఆయనకు మాజీ సైనికోద్యోగి కోటాలో 5-6-1978న భూమిని ఎసైన్ చేసినట్లు పేర్కొనడంలోనే డీఆర్ దస్త్రం తప్పని తేలింది. ఈ భూమి అమ్ముకునేందుకు కేవలం రెండు నెలల్లోనే అధికారులు నిరభ్యంతర పత్రం జారీ చేయడమూ అనుమానాలకు తావిచ్చింది. ఈ భూమి చివరకు మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడి పేరున రిజిస్టర్ కావడం గమనార్హం. మంత్రి ధర్మాన ప్రసాదరావు సన్నిహితులకు భూమిని అప్పగించేందుకు వీలుగా రెవెన్యూ అధికారులు సత్తయ్య భార్య వాసుపల్లి కుర్లమ్మ పేరిట నకిలీ డీఆర్ దస్త్రం, డి-పట్టా తయారు చేసి ఉండొచ్చని, వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో కొన్ని ఎంట్రీలను స్వలాభం కోసం నమోదు చేశారని సిట్ అభిప్రాయపడింది. తర్వాత ఎన్వోసీ కోసం దరఖాస్తు చేయించి, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి ఆ భూమిని 22ఏ నుంచి తొలగించేలా చూశారని దర్యాప్తులో తేల్చింది.
అర్హత లేకున్నా భూ కేటాయింపులు
విశాఖ జిల్లా పరవాడ మండలంలోని దేశపాత్రునిపాలెంలో సైనికోద్యోగులకు చెందిన 34.56 ఎకరాల భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ధర్మాన అండ్ కో కొట్టేసింది. ఈ భూములు పొందిన వారిలో కొందరు మాజీ సైనికోద్యోగులు అనేందుకు ఆధారాల్లేవని సిట్ తేల్చింది. అర్హత లేకపోయినా జూనియర్ కమిషన్డ్ స్థాయి సైనికాధికారికీ ప్రభుత్వ భూమిని కేటాయించారనీ సిట్ తేల్చింది. ఈ ఎసైనీలు ఎవరి దగ్గరా అసలైన డీ ఫాం పట్టాలు దొరకలేదు.
సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లోనూ అక్రమాలు
ఈ అక్రమాలు జరిగిన రోజుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకూ ధర్మానే మంత్రి. అప్పట్లో విశాఖ శివార్లలో నకిలీ డీ ఫాం పట్టాలు పుట్టుకొచ్చాయని, వాటిని అమ్ముకునేందుకు అనుమతులు తెచ్చుకుని భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని, జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అనేక కేసుల్లో కలెక్టర్ నుంచి సదరు భూమి అమ్ముకునేందుకు ఎన్వోసీ రాక ముందే సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. దేశపాత్రునిపాలెంలో మాజీ సైనికోద్యోగులు ఏఎస్‌ఆర్‌కేకే కుమార్, ఆర్.రామచంద్రరావు, ఎన్.చంద్రరావుల పేర్లతో సర్వే నంబరు 360/3లో 3.14 ఎకరాలు, 361/2లో 3.85 ఎకరాలు, 367/1లో 2.82 ఎకరాలు.. మొత్తం 9 ఎకరాల 81 సెంట్ల భూమికి ఎన్వోసీ రాకముందే ఇలా క్రయ విక్రయాలు జరిగిపోయాయి.
అధికారం అండగా.. అడుగడుగునా అక్రమాలు
8 అంశాల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్రపై సిట్ లోతైన దర్యాప్తు చేసి నిగ్గు తేల్చిన నిజాలివీ..
1. మంత్రి చెప్పారు.. కలెక్టర్ శ్యామలరావు చేశారు
విశాఖ జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ సర్వే నంబరు 437/1లో 5.14 ఎకరాలకు మాజీ సైనికోద్యోగి పల్లా సింహాచలం పేరిట ఉన్న డీ ఫాం భూమిని అమ్ముకునేందుకు నిబంధనలు పాటించకుండానే అనుమతి పత్రాలిచ్చేశారు. ఆ భూములను 22ఏ జాబితా నుంచి నిబంధనలకు విరుద్ధంగా కలెక్టర్ తొలగించారని సిట్ తేల్చింది. ఈ భూములు తొలుత కోరమాండల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జి.ప్రసన్న కొన్నారు. ఆమె ధర్మాన సన్నిహితుడైన ఐబీ కుమార్ భార్య. తర్వాత అందులో కొంత భూమిని ధర్మాన ప్రసాదరావు స్నేహితులు గోవింద సత్యసాయి, జాస్తి భాస్కరరావు, మరో బంధువు కొనుగోలు చేశారు. ఈ భూమికి నిరభ్యంతర పత్రాలు జారీ చేసే క్రమంలో అంతకుముందు జరిగిన అక్రమాలను పరిగణనలోకి తీసుకోలేదని సిట్ తేల్చింది. డి.పట్టా దరఖాస్తు, ఒరిజినల్ డీ ఫాం పట్టాలు కూడా దర్యాప్తు బృందం చేజిక్కించుకోలేకపోయింది. ఎసైన్‌మెంట్ రిజిస్టర్‌లో అనేక లోటుపాట్లున్నా ఆ భూమిని అమ్ముకోవడానికి కలెక్టర్ శ్యామలరావు అనుమతులు ఇచ్చేశారు. రెవెన్యూ మంత్రి ప్రమేయమే దీనికి కారణమని సిట్ తేల్చి చెప్పింది.
2. ధర్మాన అండ్‌కో దోచింది 34.56 ఎకరాలు
పరవాడ మండలంలోని దేశపాత్రునిపాలెంలో మంత్రి ధర్మాన అండ్ కో 11 మంది విశ్రాంత సైనికోద్యోగులకు చెందిన 34.56 ఎకరాల భూముల్ని నిబంధనలకు విరుద్ధంగా చేజిక్కించుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీలు ఇప్పించి చివరకు.. ధర్మాన సోదరుడు రామదాస్, ఐబీ కుమార్ వంటి సన్నిహితులు డైరెక్టర్లుగా ఉన్న ఓంకాన్ రియల్టర్స్, కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ సంస్థలు కొట్టేశాయి. అప్పట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.సత్యనారాయణ ఇన్‌ఛార్జి జేసీగా ఉన్న కొద్ది కాలంలోనే 9 భూములకు నిరభ్యంతరపత్రాలు ఇచ్చేశారు. తర్వాత జేసీగా వచ్చిన ఎం.వీరబ్రహ్మయ్య మరో రెండు ఎన్వోసీలు ఇచ్చారు. ఆ భూములన్నీ చివరకు ధర్మాన సోదరుడు, సన్నిహితుల కంపెనీలే కొనేశాయి. ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందని సిట్ తేల్చింది. ‘పాత రికార్డులు లేకున్నా, డీ ఫాం భూముల కేటాయింపుల్లో తప్పులున్నా ఆ భూములు అమ్మేసేందుకు పరవాడ తహశీల్దార్, విశాఖ ఆర్డీవో కళ్లు మూసుకుని అనుమతులిచ్చేశారు. ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ హోదాలో డీఆర్వో, తర్వాత వచ్చిన జేసీలు ఎన్వోసీలు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది’ అని స్పష్టం చేసింది. 2006లో మొత్తం 15 భూములకు నిరభ్యంతర పత్రాల కోసం సబ్బవరం సబ్‌రిజిస్ట్రార్ రెవెన్యూ అధికారులకు లేఖలు రాశారు. అందులో 11కి మాత్రమే అనుమతులు వచ్చాయి. ధర్మాన సంబంధీకులు లబ్ధి పొందటం వల్లే వీటికి అనుమతులు వచ్చాయని, మిగతా నాలుగు వేరేవాళ్లు కొనుక్కోవడం వల్లే క్లియరెన్స్ రాలేదని సిట్ అభిప్రాయపడింది.
3. ముందు తమ్ముడికి.. తర్వాత కుమారుడికి..
విశాఖ గ్రామీణ మండలం పరదేశిపాలెంలోని బోరవానిపాలెం సర్వే నంబర్ 187/1లో 4.89 ఎకరాలను ప్రభుత్వం 1978లో వాసుపల్లి సత్తయ్యకు మాజీ సైనికోద్యోగుల కోటాలో కేటాయించింది. దీన్ని అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇవ్వాలంటూ సత్తయ్య భార్య కుర్లమ్మ 2011 మార్చి 16న విశాఖపట్నం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు హడావుడిగా ఫైళ్లు నడిపించి 2 నెలలు తిరక్కుండానే మే 15న ఎన్వోసీ ఇచ్చేశారు. తర్వాత 15 రోజుల్లోనే వీటిలో 3 ఎకరాలు ధర్మాన రామదాస్ కంపెనీ కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ పేరున రిజిస్టరయింది. 2015లో అదే భూమిని కోరమాండల్ కంపెనీ నుంచి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్‌నాయుడుకు చెందిన వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొని, తాకట్టు పెట్టి రూ.5 కోట్ల రుణం పొందింది. తన భర్త 2002కు ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడే వాయిదాల పద్ధతిలో రూ.కోటి చెల్లించే ఒప్పందంపై కోరమాండల్ కంపెనీకి అమ్మేశామని కుర్లమ్మ వెల్లడించారు.
కుర్లమ్మ నుంచి మీరు కొనండని చెప్పారు
- ధర్మాన సన్నిహితుడైన ఐబీ కుమార్ సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీతారామ్ 2011 ఏప్రిల్‌లో నన్ను కలిసి కుర్లమ్మ భూమి గురించి చెప్పారు. 4.89 ఎకరాల్లో 1.89 ఎకరాలు తాను కొంటానని, మిగతా 3 ఎకరాలు ధర్మాన రామ్‌మనోహర్ నాయుడుకు చెందిన వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అక్కడ మైనింగ్ స్టాక్ యార్డు ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోందని, అనుమతులకు సమయం పడుతుంది కనుక తొలుత కుర్లమ్మ నుంచి ఆ భూమిని కోరమాండల్ ద్వారా కొనాలని సూచించారు. తర్వాత కోరమాండల్ నుంచి వర్జిన్ రాక్ కొంటుందని వివరించారు. ఆ భూమికి ఎన్వోసీ లేదని నేను సీతారామ్‌తో చెప్పాను. 2011 మే నెలలో ఆ భూమికి ఎన్వోసీ వచ్చింది. ఆపై ఆ భూమికి కుర్లమ్మ నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ), అమ్మకం ఒప్పందం చేసుకున్నాం. తర్వాత వర్జిన్ రాక్‌కు ఇచ్చేలా పొందుపరిచాం. 2015లో ఆ భూమిని వర్జిన్‌రాక్ మా నుంచి కొనేసింది.
4. భూములు అమ్మినవారు కనబడలేదు!
ఏఎస్‌ఆర్‌కేకే కుమార్, రౌతు రామచంద్రరావు, నక్కా చంద్రరావుల పేరిట మాజీ సైనికోద్యోగుల కోటాలో దేశపాత్రునిపాలెం సర్వే నంబర్ 360/3లో 3.14 ఎకరాలు, 361/2లో 3.85 ఎకరాలు, 367/1లో 2.82 ఎకరాల చొప్పున మొత్తం 9.81 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించింది. మంత్రి ధర్మాన ప్రమేయంతోనే ఉన్నతాధికారులు నిరభ్యంతర పత్రాలు జారీ చేసేశారు. ఆ పత్రాలు జారీ చేయకముందే రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. ఈ భూములమ్మిన వారిలో ఇద్దరు ఎక్కడ ఉన్నారో కూడా సిట్ పట్టుకోలేకపోయింది. వారికి డీ ఫాం భూములు కేటాయింపులోనూ అక్రమాలు జరిగాయని తేల్చింది. అసలు పట్టాలు కూడా దర్యాప్తులో బయటపడలేదు.
* ఏఎస్‌ఆర్‌కేకే కుమార్ తన పేరిట దేశపాత్రునిపాలెంలోని సర్వే నంబర్ 360/3లో కేటాయించిన 3.14 ఎకరాల భూమిపై హక్కును జనరల్ పవరాఫ్ అటార్నీ రూపంలో కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి, ఐబీ కుమార్ భార్య జి.ప్రసన్నకు 2008 అక్టోబరు 14న బదలాయించారు.
* రౌతు రామచంద్రరావు తనకు కేటాయించిన 3.85 ఎకరాల భూమిని తొలుత బండి సందీప్‌కు అమ్మారు. అతని నుంచి కోరమాండల్ ఎస్టేట్స్ ప్రాపర్టీస్ సంస్థ 2008 జులై 25న కొనుగోలు చేసింది. కోరమాండల్ కంపెనీ డైరెక్టర్లు ధర్మాన ప్రసాదరావుకు అత్యంత సన్నిహితులు.
* నక్కా చంద్రరావు పేరిట ఉన్న 2.82 ఎకరాల భూమి తొలుత జి.ప్రసన్న పేరిట బదిలీ అయ్యింది. తర్వాత ఓంకాన్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి, ధర్మానకు అత్యంత సన్నిహితుడైన ఎస్.రవికుమార్‌కు అమ్మారు.
అప్పటి విశాఖపట్నం జేసీ ఎం.వీరభద్రయ్య, పరవాడ తహసీల్దార్ ధర్మారావు, సబ్‌రిజిస్ట్రార్ కొనుగోలుదారులతో కుమ్మక్కయ్యారని సిట్ తేల్చింది. వీరిపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది.
5. పేరుకే వారు.. చిరునామా వేరు
మాజీ సైనికోద్యోగుల కోటా కింద మాదాబత్తుల అప్పారావుకు 1979లో విశాఖ గ్రామీణ మండలం మధురవాడలోని సర్వే నంబర్ 355/4లో రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలు కేటాయించింది. దాన్ని నిషేధిత జాబితా (22ఏ) నుంచి తొలగించి, విక్రయానికి అనుమతివ్వాలంటూ 2005 జులై 15, సెప్టెంబరు 4న అప్పారావు పేరిట విశాఖ కలెక్టర్‌కు వినతిపత్రాలు అందాయి. దరఖాస్తుదారుగా అప్పారావు పేరున్నప్పటికీ, అందులో పేర్కొన్న చిరునామా మాత్రం ధర్మాన సన్నిహితుడైన ఐబీ కుమార్‌ది. ఆ వినతిపత్రంతో పాటు మంత్రి హోదాలో ధర్మాన ప్రసాదరావు ఎండార్స్‌మెంట్ ఉంది. రెండు నెలలు కూడా తిరక్కుండానే అక్టోబరు 24న ఆ భూమి అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. 2005 నవంబరు 8న జీవో నంబర్ 1873 జారీ చేసింది.
10 రోజుల్లోనే.. వారి చేతుల్లోకి
మాదాబత్తుల అప్పారావు భూమిని అమ్ముకునేందుకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన 10 రోజుల్లోనే గుబ్బల గోపాలకృష్ణ పేరిట రిజిస్ట్రేషన్ అయిపోయింది. గోపాలకృష్ణ.. ఐబీ కుమార్‌కు బిడ్డనిచ్చిన మామ. ఏడాది తిరిగేసరికి (2006 నవంబరు 14న) ఆ భూమిని గోపాలకృష్ణ ఓంకాన్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించారు. ఈ సంస్థలో డైరెక్టర్లైన ధర్మాన రామదాసు మంత్రి ధర్మానకు సోదరుడు. ఏవీకే జోగినాయుడు, రవి సన్నిహిత అనుచరులు. వారు అందులో లేఅవుట్ వేసి విక్రయించారు. అప్పట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ప్రమేయం వల్లే ఈ భూమికి సంబంధించి ఎన్వోసీ జారీ దస్త్రం అత్యంత వేగంగా కదిలిందని సిట్ తేల్చింది. ఈ క్రయవిక్రయాల్లో ఐబీ కుమార్, ధర్మాన ప్రసాదరావుల ప్రమేయం.. గుబ్బల గోపాలకృష్ణ వాంగ్మూలం ద్వారా స్పష్టమైందని వెల్లడించింది. దీనిలో ధర్మాన ప్రసాదరావు ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సిఫార్సు చేసింది.
6. ఫోర్జరీతో భూ కుంభకోణం
మాజీ సైనికోద్యోగి వడ్డాది సన్యాసిరావు పేరుతో 1992లో పెదముషిడివాడ సర్వే నంబరు 441/1లో 4.65 ఎకరాల భూమి కేటాయించారు. రికార్డులను పట్టించుకోకుండానే ఆ భూమికి పట్టాదారు పాసుపుస్తకాన్ని సృష్టించి, నిరభ్యంతరపత్రం జారీ చేశారు. ఈ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి ముందే మంత్రి సోదరుడు ధర్మాన రామదాసు భాగస్వామిగా ఉన్న కోరమాండల్ ఎస్టేట్స్, ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనేసింది. తర్వాత ఆ భూములు ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడి కంపెనీలోని ఇద్దరు మనుషులకు, కొంత భూమి ధర్మాన బంధువుకు విక్రయించారని సిట్ విచారణలో తేల్చింది. కలెక్టర్ ఈ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి 5 నెలల ముందే చేతులు మారిపోయాయి. ఈ భూములకు సన్యాసిరావు పేరుతో 1996 జూన్‌లో ఎమ్మార్వో సుబ్బారావు సంతకంతో పాసుపుస్తకం జారీ చేశారు. ఆ సమయంలో తాను అక్కడ ఎమ్మార్వోగా లేనని, ఆ సంతకం తనది కాదని సుబ్బారావు సిట్‌కు చెప్పారు. సన్యాసిరావుకు పేదవారి కోటాలో పట్టా ఇచ్చానే తప్ప.. పాసుపుస్తకం ఇవ్వలేదని 1991-94 మధ్య ఎమ్మార్వోగా పని చేసిన ప్రసాదరావు వాంగ్మూలం ఇచ్చారు.
సన్యాసిరావుకు పట్టా ఇచ్చే సమయానికి సైనిక విధుల్లోనే ఉన్నారని, అలాంటప్పుడు పట్టా ఇచ్చేందుకు ఆస్కారం లేదని సైనిక సంక్షేమ అధికారుల సమాచారం ఆధారంగా సిట్ పేర్కొంది. ఈ వ్యవహారంలోమంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్రపై దృష్టి సారించాలని సిఫార్సు చేసింది. 22ఏ రికార్డుల నుంచి సంబంధిత భూమిని తొలగించాలని సిఫార్సు చేసే ముందు వాస్తవాలను జిల్లా యంత్రాంగం ముందుంచడంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అప్పటి పరవాడ ఎమ్మార్వో బండి వెంకటేష్, విశాఖపట్నం ఆర్డీవోలు కె.ప్రభాకర్‌రావు, డి.వెంకటరెడ్డిలపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. భూమిని 22ఏ రికార్డుల నుంచి తొలగించకముందే రిజిస్టర్ చేసినందుకు అప్పటి లంకెలపాలెం సబ్‌రిజిస్ట్రార్‌పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంది.
మంత్రి కాబట్టి మాట్లాడలేకపోయాం
- సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో సన్యాసిరావు భార్య ఉమామహేశ్వరి
నా భర్తకు ఉన్న 4.56 ఎకరాల డీ పట్టా భూమిని 2008లో మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరికి అమ్మారు. అదేంటని నేను నా భర్తను అడిగితే తాగిన మైకంలో ఇచ్చేశానన్నాడు. అవతలి వాళ్లు మంత్రి, ఉన్నతవర్గాల వాళ్లు కాబట్టి వాళ్లపై తర్వాత మాట్లాడలేకపోయాం.
7. ఉన్నతాధికారులు వద్దన్నా మంత్రి వత్తాసు
విశాఖ జిల్లా లంకెలపాలేనికి చెందిన కింతాడ అప్పారావుకు మాజీ సైనికోద్యోగి కోటాలో పరవాడ మండలం ముషిడివాడలో 3.29 ఎకరాలు కేటాయించారు. సైన్యంలో పని చేస్తుండగా ఇలా కేటాయించేందుకు ఆస్కారం లేకున్నా అధికారులు ఆ పని చేశారు. తర్వాత ఆ భూములకు ఎన్వోసీ ఇప్పించి, మంత్రి ధర్మాన సోదరుడు ధర్మాన రామదాస్‌తోపాటు ఆయన సన్నిహితుడైన ఐబీ కుమార్, అతని భార్య జి.ప్రసన్నకు చెందిన కోరమాండల్ ప్రాపర్టీస్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ చేజిక్కించుకున్నారు. ఎన్వోసీ జారీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రమేయం ఉన్నట్లు సిట్ నివేదికలో పేర్కొంది.
భూమి అమ్ముకోవడానికి ఎన్వోసీ ఇచ్చేందుకు తహసీల్దార్, ఆర్డీవోలు సిఫారసు చేశారు. దీనిపై 2009 నవంబరు 21న జిల్లా కలెక్టర్.. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. కింతాడ అప్పారావు, వి.సన్యాసిరావులు సర్వీసులో ఉండగా ఎసైన్డు భూమి పొందారని, అలా పొందడానికి అర్హులు కారని పేర్కొన్నారు. ఎసైన్‌మెంట్ చేసిన పదేళ్ల తర్వాత మాజీ సైనికోద్యోగులైతే తమ భూములను అమ్ముకునే స్వేచ్ఛ ఉంటుందని ప్రభుత్వం ఆయనకు తెలిపింది. దీంతో ఈ దస్త్ర్రాన్ని ధర్మాన ప్రసాదరావుకు పంపారు. అప్పటి రెవెన్యూ మంత్రి హోదాలో దానిపై ధర్మానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‘పట్టా ఇచ్చి పదేళ్లయిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఎన్వోసీ ఇవ్వాలి. సైనికోద్యోగుల పదవీ విరమణ కాలాన్ని పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు’ అని మంత్రి సిఫార్సు చేయడం, తర్వాత ఆ భూములను ఆయన కుటుంబసభ్యులే చేజిక్కించుకోవడం గమనార్హం. రెవెన్యూ ఉన్నతాధికారులు నిబంధనలు అంగీకరించబోవని చెప్పినా.. ధర్మానే అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసి భూములు చేజిక్కించుకోవడం కీలకాంశం.
2017 నవంబరు 30న తహసీల్దారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ భూమికి సంబంధించి దరఖాస్తు రిజిస్టర్‌లో ఏమీ కనిపించలేదు. దరఖాస్తుదారు తాను మాజీ సైనికుడినని నిరూపించే ఆధారాలేవీ సమర్పించినట్లు కానీ, ఎసైన్‌మెంట్ భూమికి ఎప్పుడు దరఖాస్తు చేశారనే తేదీ కానీ దొరకలేదని సిట్ నివేదికలో పేర్కొంది. కింతాడ అప్పారావుకు ఎసైన్‌మెంట్ భూమి కేటాయింపు విషయంలో చెక్ మెమోపై తహసీల్దారు సంతకం లేదు. డీఆర్ దస్త్రంలో ఎసైన్‌మెంట్ కమిటీ ఆమోదమూ లేదు. అయాన్ కన్వర్షన్ చేయలేదు. ఈ విషయమై అప్పటి కలెక్టర్ జె.శ్యామలరావును సిట్ ప్రశ్నించగా.. ఎన్వోసీ ఇచ్చినప్పుడు డీ ఫాం పట్టా ఇచ్చేందుకు అతనికి అర్హత ఉందా లేదా అని పరిశీలించే ప్రక్రియ ఏదీ లేదని సమాధానం ఇచ్చారు.
ఈ అంశంలో రికార్డులు ట్యాంపరింగ్ జరిగిందని సిట్ నివేదికలో పేర్కొంది. 1996 సెప్టెంబరు 13న పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చినట్లు చూపిస్తున్నా.. ఆ సమయంలో తాను పరవాడ మండలంలో పనిచేయలేదని అప్పటి తహసీల్దార్ పేర్కొన్నారు. అంటే నకిలీపత్రాలేనని స్పష్టమవుతోంది. అప్పటి పరవాడ తహసీల్దార్లు బండి వెంకటేశ్, కె.ప్రభాకర్‌రావు, ఆర్డీవో డి.వెంకటరెడ్డి వాస్తవాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తేలేదని పేర్కొంది. తద్వారా 22ఏ జాబితా నుంచి భూములు తొలగించేందుకు సిఫార్సు చేశారని సిట్ వివరించింది. లంకెలపాలెం సబ్‌రిజిస్ట్రార్ 22ఏ జాబితా నుంచి భూముల్ని తొలగించేందుకు అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొంది. వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.
8. నడిపించిందంతా ఆయన మనుషులే
మాజీ సైనికోద్యోగుల కోటాలో సత్యాడ అప్పారావుకు పరవాడ మండలం పెదముషిడివాడ సర్వే నంబర్ 437/1లో 3.95 ఎకరాలను 1993లో ప్రభుత్వం కేటాయించింది. వాటిని అమ్ముకునేందుకు అనుమతివ్వాలని ఆయన దరఖాస్తు చేసుకోగా 2009 నవంబరు 11న ఎన్వోసీ జారీ అయింది. వెంటనే ఆ భూముల్ని కోరమాండల్ సంస్థకు అమ్మేశారు. 2010లో ధర్మాన ప్రసాదరావు స్నేహితులైన పి.నాగేంద్రబాబు ఎకరం, జాస్తి భాస్కరరావు 0.46 ఎకరాల భూమిని కోరమాండల్ సంస్థ నుంచి కొన్నట్లు సేల్ డీడ్ రిజిస్టర్ చేయించుకున్నారు. ‘భూమికి సంబంధించి ఎన్వోసీకి మాత్రమే దరఖాస్తు చేశా. దాని కోసం ప్రయత్నించలేదు. కొనుక్కున్నవారే ఎన్వోసీ మంజూరు చేయించుకుని సేల్‌డీడ్ రిజిస్టర్ చేయించుకున్నారు. ఎకరాకు రూ.8 లక్షలు చొప్పున నాకు ఇచ్చారు’ అని అప్పారావు సిట్‌కు వాంగ్మూలం ఇవ్వటం గమనార్హం. ఆయన నుంచి తొలుత ఈ భూమి కొన్న కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ధర్మాన సోదరుడు రామదాసు, సన్నిహితుడైన ఐబీ కుమార్, ఆయన భార్య ప్రసన్న భాగస్వాములు. తర్వాత ఈ భూములను ధర్మాన ప్రసాదరావు, జి.మధుసూదన్‌రావు, ధర్మాన ప్రసాదరావు కుమారుడైన రామ్‌మనోహర్‌నాయుడుకు చెందిన రూ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్ గుబ్బా ప్రసన్న కొన్నారు. చివరికి వీటిని ధర్మానకు సన్నిహితులైన భాస్కరరావు, ఈశ్వరరావు కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Health News
Diabetes patient: మధుమేహులు ఉపవాసం చేయొచ్చా..?
-
India News
Odisha Train Accident: ఏమిటీ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ..?
-
Sports News
WTC Final: ఇషాన్, భరత్.. తుది జట్టులో ఎవరు? అతడికే మాజీ వికెట్ కీపర్ మద్దతు!
-
Movies News
Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్