Amaravati Maha Padayatra: పాదయాత్రపై పగ.. రైతులపై రాళ్లు

రాజధాని రైతుల మహాపాదయాత్ర రణరంగాన్ని తలపించింది. ఇప్పటివరకు దారి పొడవునా కవ్వింపు చర్యలకే పరిమితమైన అధికార వైకాపా నేతలు.. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం ఆజాద్‌చౌక్‌లో ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు.

Updated : 19 Oct 2022 10:48 IST

ఎంపీ మార్గాని భరత్‌ దర్శకత్వం.. వైకాపా మూకల అరాచకం

చెప్పులు, డీజిల్‌ ప్యాకెట్లతో దాడి

దుర్భాషలతో మహిళా రైతుల కన్నీరు

చోద్యం చూసిన పోలీసులు

రోడ్డుపై అమరావతి ఐకాస బైఠాయింపు

ఈనాడు-రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే- టి.నగర్‌, దానవాయిపేట, కడియం, వీఎల్‌పురం: రాజధాని రైతుల మహాపాదయాత్ర రణరంగాన్ని తలపించింది. ఇప్పటివరకు దారి పొడవునా కవ్వింపు చర్యలకే పరిమితమైన అధికార వైకాపా నేతలు.. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం ఆజాద్‌చౌక్‌లో ప్రత్యక్ష దాడులకు తెగబడ్డారు. మహాపాదయాత్ర మార్గంలో భారీగా మోహరించి యాత్రకు అడ్డుతగిలారు. అమరావతికి వ్యతిరేకంగా నినదిస్తూ యాత్రలో పాల్గొన్న మహిళలను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్న వారిపై రాళ్లు, డీజిల్‌ ప్యాకెట్లు, నీటి సీసాలు, నీళ్ల ప్యాకెట్లు, జెండా కర్రలు, మురుగుతో నింపిన బాటిళ్లు విసురుతూ దాడికి తెగబడ్డారు. అవి మహిళలకు, రైతులకు తగిలి స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులూ గాయపడ్డారు.

మార్గాని దర్శకత్వం.. వైకాపా మూకల అరాచకం

అమరావతి-అరసవల్లి యాత్ర 37వ రోజు మంగళవారం రాజమహేంద్రవరం గ్రామీణ పరిధి మల్లయ్యపేటలో మొదలై మోరంపూడికి చేరాల్సి ఉంది. యాత్ర.. సీతంపేట-ఆర్యాపురం-గోకవరం బస్టాండ్‌-దేవీచౌక్‌ మీదుగా ఉదయం 11.20కి ఆజాద్‌చౌక్‌కు చేరింది. ఆ కూడలిలో ఉదయం 8.30నుంచే నిరీక్షిస్తున్న వైకాపా శ్రేణులు ఒక్కసారిగా అమరావతి వ్యతిరేక నినాదాలతో విరుచుకుపడ్డాయి. ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, రుడా ఛైర్మన్‌ మేడపాటి షర్మిలరెడ్డి, నగర పార్టీ నాయకులు నల్లబెలూన్లు, ప్లకార్డులతో ముందుగానే ఆ ప్రాంగణానికి చేరుకుని శ్రేణులను ఉసిగొల్పారు. యాత్ర వైపు వైకాపా శ్రేణులు దూసుకురాకుండా మూడు వరుసల్లో బారికేడ్లు, రోప్‌ పార్టీని పోలీసులు ఏర్పాటుచేశారు. యాత్రకు ముందు భాగంలో మద్దతు పలుకుతున్న రాజకీయ పక్షాల నాయకులున్నారు. వైకాపా నాయకులు ‘అమరావతి వద్దు.. మూడు రాజధానులు ముద్దు..’,  అమరావతి రైతులు గోబ్యాక్‌ అంటూ నినదించారు. ప్రతిగా యాత్రకు మద్దతు పలుకుతున్న పార్టీలూ స్పందించాయి. దీంతో ఆ ప్రాంతం పరస్పర నినాదాలతో హోరెత్తింది. ఓ వైపు వైకాపా ఎంపీ భరత్‌ను కార్యకర్తలు పైకెత్తి అమరావతికి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ప్రతిగా రాజమహేంద్రవరం తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు వాహనంపైకి ఎక్కి అమరావతికి అనుకూలంగా, వైకాపా తీరుకు వ్యతిరేకంగా కార్యకర్తలతోపాటు నినదించారు. దీంతో పరిస్థితి వేడెక్కింది.

కన్నీరు పెట్టుకున్న రైతులు

రాజధాని కోసం భూములిచ్చి దగాపడ్డ రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే వైకాపా నాయకులు అడుగడుగునా అడ్డు పడుతున్నారని, మహిళలని చూడకుండా దుర్భాషలాడుతూ విరుచుకుపడుతున్నారని మహిళా రైతులు కన్నీరుపెట్టారు. మీ ఇంట్లో ఆడబిడ్డలనూ ఇలాగే చెప్పులతో కొట్టి గౌరవిస్తారా? అంటూ నిలదీశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వైకాపా శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో అమరావతి ఐకాస కోకన్వీనర్‌ గద్దె తిరుపతిరావు, రైతులు ఆజాద్‌చౌక్‌లో రోడ్డుపై బైఠాయించారు. సీఎంకు వ్యతిరేకంగా నినదించారు. వైకాపా రౌడీలకు డీజీపీ రక్షణ కల్పిస్తున్నారంటూ ఆరోపించారు. దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. అప్పటికే ముందుకు కదిలినవారు సైతం వెనక్కి వచ్చి రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఐకాస సభ్యులను బతిమాలి అక్కడినుంచి పంపించారు.

పోలీసుల అనుమతి లేకుండానే హడావుడి

రాజమహేంద్రవరంలో యాత్రకు ఆటంకాలు కల్పించాలన్న ఉద్దేశంతో రైల్‌కం రోడ్డు వంతెనను మూసేయించిన ఎంపీ.. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు పోలీసుల అనుమతి లేకుండానే మంగళవారం భారీ సభకు ఏర్పాట్లుచేశారు. వేకువజామున రైతులు వెళ్లే మార్గంలో అడ్డంగా స్టేజి నిర్మాణానికి ఎంపీ అనుయాయులు ప్రయత్నిస్తుండగా పోలీసులు అభ్యంతరం చెప్పారు. కలెక్టర్‌ అనుమతితోనే పనులు చేస్తున్నామంటూ పోలీసులను దబాయించేందుకు ఎంపీ ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆజాద్‌ సెంటర్‌లోనే దిశ పోలీసుస్టేషన్‌ వెళ్లే వైపు భారీ వేదిక ఏర్పాటుచేశారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గినా, ముందస్తుగా మూడు దశల్లో బారికేడ్లు ఏర్పాటుచేయడంతోనే ఆందోళన సమయంలో పెద్ద ప్రమాదం తప్పిందనే అభిప్రాయాలున్నాయి. సభ ఏర్పాటుచేసిన వైకాపా నాయకులు తమనుంచి ఎలాంటి అనుమతి కోరలేదని సెంట్రల్‌జోన్‌ డీఎస్పీ సంతోష్‌, అధికారులు తెలిపారు.


అప్పుడు పోలీసులతో తన్నించారు... ఇప్పుడు పెట్రోల్‌ బాటిళ్లతో కొట్టిస్తున్నారు
- నందపునేని పద్మావతి, తుళ్లూరు

రాష్ట్ర భవిష్యత్తు కోసం రోడ్డెక్కాం. అప్పుడు పోలీసులతో తన్నించారు. ఇప్పుడు పెట్రోల్‌ సీసాలతో కొట్టిస్తున్నారు.నాకూ గాయాలయ్యాయి. యాత్ర చేస్తుంటే ఇంత అరాచకమేంటి?


ఎంపీ వీధిరౌడీలా ప్రవర్తించారు
- ఐకాస కోకన్వీనర్‌ తిరుపతిరావు

‘మామీద రాళ్లు వేసినా, బాంబులు విసిరినా, కత్తులతో పొడిచినా మా పాదయాత్ర ఆపబోం’ అని అమరావతి ఐకాస కోకన్వీనర్‌ గద్దె తిరుపతిరావు అన్నారు. రాజమహేంద్రవరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతులపై దాడిని తీవ్రంగా ఖండించారు. దేవుడి రథం ముందుకెళ్తుంటే వైకాపా శ్రేణులు చెప్పులు, పెట్రోలు, మంచినీళ్ల సీసాలు వేశారని.. ఇదంతా ఎంపీ భరత్‌ సమక్షంలో, పోలీసు రక్షణలో జరిగిందని పేర్కొన్నారు. గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి వీధిరౌడీలా తమపై దాడి చేయించారని విమర్శించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సంస్కారం ఏమైందని ప్రశ్నించారు. ఈ సంఘటనపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేస్తామని, చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానానికి వెళ్తామని అన్నారు. వైకాపాదొంగలకు రక్షకభటుల్లా ఉంటున్న పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తానని హెచ్చరించారు.


రైతులపై చెప్పులు, రాళ్లు, నీళ్ల సీసాలతో దాడి

రైతులు, అఖిలపక్ష నేతలపై వైకాపా శ్రేణులు చెప్పులు, రాళ్లు, కిరోసిన్‌ ప్యాకెట్లు, నీటి సీసాలతో దాడికి తెగబడ్డారు. శాంతియుతంగా వెళుతున్న వారిలో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా దాడి చేశారు. ప్రతిఘటించే క్రమంలో పాదయాత్ర మద్దతుదారులు సైతం వైకాపా శ్రేణులపై నీటి సీసాలు, నీటి ప్యాకెట్లు విసిరారు. దీంతో అరగంటపాటు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకానొక దశలో వైకాపా ఎంపీ భరత్‌ బారికేడ్లు తోసుకుని పాదయాత్ర వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుపడ్డారు. వైకాపా వీరంగంతో పాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళలు ఇబ్బందిపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు వైకాపా శ్రేణులను కట్టడి చేసేందుకు ప్రయత్నించలేదు. ఎంపీ ఉసిగొల్పడంతో కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. యాత్రలో గోవింద నామస్మరణలతో వెళ్తున్న వెంకటేశ్వర స్వామి రథంపైనా నీళ్ల సీసాలు విసురుతూ వైకాపావారు దాష్టీకాన్ని చాటారు.


రాజమహేంద్రిలో అడుగడుగునా నీరాజనం

హరిదాసుల కీర్తనలు.. కోలాటాల సందళ్లు.. గంగిరెద్దుల ఆటలు.. గుర్రపు సవారీలు.. థింసా, కొమ్ము నృత్యాలు.. ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ప్రదర్శనలు.. గోవింద నామస్మరణలు. ఇలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబరాలతో అమరావతి యాత్ర ఉత్సాహంగా సాగింది. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం గ్రామీణ మండలం మల్లయ్యపేట నుంచి ప్రారంభమై మున్సిపల్‌ స్టేడియం వద్ద భోజన విరామం అనంతరం మోరంపూడి వరకు సాగింది. ఉదయం మండుటెండలో, సాయంత్రం జోరువానలో రైతులు, స్థానికులు నడిచారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్‌ ప్రాంతానికి చెందిన నిండు గర్భిణి పొడలి ఆశ తన కుమార్తె తనూజ చేయి పట్టుకుని పాదయాత్రలో ముందుకు సాగింది. తెదేపా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి భవానీ, ఎన్‌.చినరాజప్ప, మాజీ మంత్రులు దేవినేని ఉమ, జవహర్‌, జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్‌, పంతం నానాజీ, ముత్తా శశిధర్‌, పితాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు