Viveka Murder Case: దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన డి.శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పరచినప్పుడు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తన అనుచరులతోపాటు కోర్టు గదిలోకి ప్రవేశించి రిమాండు లాంఛనాలను పూర్తి చేస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది.

Updated : 20 Oct 2022 08:26 IST

వైఎస్‌ అవినాశ్‌రెడ్డి గురించి సుప్రీంకోర్టుకు వివరించిన సీబీఐ

ఈనాడు, దిల్లీ: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన డి.శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరు పరచినప్పుడు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి తన అనుచరులతోపాటు కోర్టు గదిలోకి ప్రవేశించి రిమాండు లాంఛనాలను పూర్తి చేస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు కడపలో సరిగా జరగనందున వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వైఎస్‌ సునీతారెడ్డి దాఖలు చేసిన కేసుకు స్పందనగా వేసిన అఫిడవిట్‌లో సీబీఐ ఈ విషయాన్ని పేర్కొంది. ‘2021 నవంబరు 18న డి.శివశంకర్‌రెడ్డిని పులివెందులలోని మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచినప్పుడు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి కోర్టు గదిలోకి ప్రవేశించారు. కేసు దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారు.

పెద్దఎత్తున అనుచరులను వెంటేసుకొని కోర్టు ప్రాంగణంలోకి వచ్చి ఎ-5 శివశంకర్‌రెడ్డికి మద్దతు పలికారు. శివశంకర్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశావంటూ దర్యాప్తు అధికారిని ప్రశ్నించారు. అక్కడే శివశంకర్‌రెడ్డితోనూ మాట్లాడారు. సీబీఐ బృందం కోర్టు నుంచి బయటికెళ్లే సమయంలో అవినాశ్‌రెడ్డి అనుచరులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు’ అని వివరించింది. ‘డి.శివశంకర్‌రెడ్డి జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగా మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండానే అతన్ని కడప సెంట్రల్‌ జైలు నుంచి రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. దాని గురించి 2021 నవంబరు 25న పులివెందుల జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ తీవ్రంగా స్పందించారు. జైలు అధికారుల తీరును తప్పుబట్టారు’ అని వెల్లడించింది. ‘కేసులో ఒక సాక్షి శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మరోసాక్షి గంగాధరరెడ్డి సైతం చనిపోగా... పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు’ అని సీబీఐ ప్రస్తావించింది. వీటితోపాటు హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ సీబీఐ 278 పేజీల అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది.


సీబీఐ అఫిడవిట్‌లోని ప్రధానాంశాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీత వేసిన కేసులో... సీబీఐ సుప్రీంకోర్టుకు 278 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. అందులో వివేకా హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ వివరించింది. అందులో పేర్కొన్న ప్రధానాంశాలు ఇవీ...

* శివశంకర్‌రెడ్డి జ్యుడిషియల్‌ కస్టడీలో భాగంగా కడప సెంట్రల్‌ జైలులో ఉంటూనే 2021 డిసెంబరులో పులివెందుల టౌన్‌లోని ప్రధాన కూడలిలో వైఎస్‌ అవినాశ్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్‌ రాజకీయ నాయకులతో ఉన్న ఫొటోలతోకూడిన భారీ బ్యానర్లు, బోర్డులు ఏర్పాటు చేయించారు.

* వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాల చెరిపివేత విషయంలో సాక్షిగా ఉన్న శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్‌రెడ్డికి నోటీసులు జారీచేసి వివిధ తేదీల్లో విచారించాం. చివరగా 2021 డిసెంబరు 27న అతని విచారణ జరిగింది. సరిగ్గా నెల రోజుల తర్వాత అతను సీబీఐ దర్యాప్తు అధికారి తనను వేధిస్తున్నాడంటూ కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత 2022 ఫిబ్రవరి 9న కడప స్పెషల్‌ మొబైల్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు తనను సీబీఐ అధికారి వేధిస్తున్నాడంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మేజిస్ట్రేట్‌ ఫిబ్రవరి 16న ఆదేశించారు. దాన్ని అనుసరించి అదేనెల 18న ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కడప రిమ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సీబీఐ దర్యాప్తు అధికారి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆ ఉత్తర్వులను సీబీఐ హైకోర్టులో సవాల్‌ చేయగా స్టే ఇచ్చింది.

* శివశంకర్‌రెడ్డి కుమారుడు డి.చైతన్యరెడ్డి కడపలో మే 26న ఆసుపత్రి ప్రారంభిస్తున్నారన్న కారణంగా ఆయనకు మే 19న కడప ఏడీజే కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఆ సమయంలో నిందితుడు శివశంకర్‌రెడ్డి తాను వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం, ఇతర సీనియర్‌ రాజకీయ నాయకులతో ఉన్న ఫోటోలతోకూడిన భారీ ఫ్లెక్సీలను పెద్దఎత్తున ఏర్పాటు చేయించుకున్నారు.

* మల్యాల సర్పంచి రవితోపాటు శివశంకర్‌రెడ్డికి చెందిన ఇతర అనుచరులు తనతో అనుచితంగా ప్రవర్తించడంతోపాటు తన సోదరుడిపైనా దాడి చేసినట్లు ఈ కేసులో అప్రూవర్‌గా ఉన్న షేక్‌ దస్తగిరి మే 30న కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామంలో రోజువారీ పనులు చేసుకోనీయకుండా తన జీవనోపాధిని దయనీయంగా మారుస్తున్నారని అందులో పేర్కొన్నారు. పైగా దస్తగిరి పోలీస్‌ స్టేషన్‌ప్రాంగణలోకి జొరబడి తనను దూషించినట్లు శివశంకర్‌రెడ్డి అనుచరుడైన మాన పెద్దగోపాల్‌తో తొండూరు పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు.

* నేరగాడు కె.గంగాధర్‌రెడ్డి ఈ కేసులో నిందితుడైన శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వాస్తవంగా అతనే సీబీఐని ఆశ్రయించి సీఆర్‌పీసీ 161 సెక్షన్‌ కింద 2021 అక్టోబరు 2న వాంగ్మూలం ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య తర్వాత 2019 ఆగస్టులో శివశంకర్‌రెడ్డిని కలిశానని, అప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితులైన వై.గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పేర్లు బయటపడకుండా... హత్యను తన నెత్తిన వేసుకొమ్మని కోరారని, అందుకు ప్రతిఫలంగా వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిలు రూ.10 కోట్లు ఇస్తారని చెప్పినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలాన్ని కోర్టు ముందు చెప్పడానికి అంగీకరిస్తూ 2021 నవంబరు 25న గంగాధర్‌రెడ్డి సీబీఐ అధికారులకు లిఖిత పూర్వక సమ్మతి ఇచ్చారు. అందుకు అనుగుణంగా సీబీఐ కడప సీజేఎం కోర్టు ముందు దరఖాస్తు చేసుకోగా, కోర్టు గంగాధర్‌రెడ్డి నుంచి 164 వాంగ్మూలం తీసుకొనే బాధ్యతలను జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌కు అప్పగించింది. అయితే నవంబరు 29న కె.గంగాధర్‌రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. అదేరోజు ఆయన తన వాంగ్మూలం కోసం సీబీఐ ఒత్తిడి చేస్తున్నట్లు మీడియా ముందు ప్రకటన చేశారు. అదే గంగాధర్‌రెడ్డి 2022 జూన్‌ 9న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.

* పలువురు సాక్షులను డి.శివశంకర్‌రెడ్డి, ఆయన అనుచరులు బెదిరించి, ప్రభావితం చేస్తున్నారు. అందులో గంగాధర్‌రెడ్డి, నాటి సీఐ జె.శంకరయ్య, వివేకానందరెడ్డి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఉన్నారు. వీరంతా ఇప్పటికే శివశంకర్‌రెడ్డి, ఇతర అనుమానితుల ప్రభావం మేరకు నడుచుకుంటున్నట్లు అనుమానముంది.

* వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు పులివెందుల సీఐగా ఉన్న జె.శంకరయ్య... ‘2019 మార్చి 15న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఉదయం 6.30 గంటల సమయంలో తనకు ఫోన్‌ చేసి వివేకానందరెడ్డి గుండెపోటు, తీవ్ర రక్తపు వాంతులతో చనిపోయాడు. అతని శవం బాత్‌రూంలో ఉంద’ని చెప్పినట్లు 161 స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వివేకానందరెడ్డి ఇంటివద్ద జనాలను అదుపు చేయడానికి నలుగురైదుగురు పోలీసులను తీసుకురావాలనీ సూచించారు. ఆ తర్వాత మరోసారి ఫోన్‌చేసి వెంటనే సంఘటనా స్థలానికి రావాలని డి.శివశంకర్‌రెడ్డి కోరారు. శంకరయ్య వచ్చి శవంపడి ఉన్న పరిస్థితులను చూసి.. ‘ఇది గుండెపోటు కాదు. శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి. బాత్‌రూం గోడలు, టైల్స్‌, బెడ్‌రూంలో చాలా రక్తం పోయింది’ అన్న విషయాన్ని శివశంకర్‌రెడ్డితో చెప్పారు. శివశంకర్‌రెడ్డి మాత్రం వివేకా గుండెపోటుతో మరణించినట్లుగానే చెప్పాలని శంకరయ్యకు సూచించారు. దీనిపై శంకరయ్య నచ్చజెప్పడానికి ప్రయత్నించగా శివశంకర్‌రెడ్డి అతన్ని నోరుమూసుకొని ఉండమని బెదిరించి, అన్ని విషయాలను నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. వివేకా శరీరంపై గాయాలు ఉన్నట్లు బయట ఎక్కడా చెప్పొద్దని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనీ శంకరయ్యను బెదిరించాడు. శివశంకర్‌రెడ్డి, వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిలు పోలీసు స్టేషన్‌కు వచ్చి శరీరంపై గాయాలు, బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తధారలు, కుడిచేయి, తలపై బలమైన గాయాలున్న విషయాన్ని ప్రస్తావించకుండా ఉదాశీనంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినట్లు సీఐ శంకరయ్య చెప్పారు. 2021 సెప్టెంబరు 28న ఆయన ఇదే స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్‌ ముందు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే తర్వాత కోర్టుకు రావడానికి నిరాకరించారు. ఉద్యోగ విషయంలో కర్నూలులో బిజీగా ఉన్నట్లు చెప్పారు. ఇలా వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించిన వారంలోపు అతనిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేసి మళ్లీ ఉద్యోగంలో చేర్చుకున్నారు.

* నోటీసులు ఇవ్వడానికి 2021 మార్చి 3న దస్తగిరి, ఇతరులను దిల్లీకి పిలిచాం. అయితే శివశంకర్‌రెడ్డి... భరత్‌ యాదవ్‌ అనే వ్యక్తి ద్వారా దస్తగిరిని బయ్యపురెడ్డి అనే వ్యక్తి ఇంటికి పిలిపించి ‘సీబీఐ ముందు మా పేర్లు చెప్పొద్దు, నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తామ’ని చెప్పారు. 2021 మార్చిలో ఓ రోజు ఉదయం ఆరున్నర గంటలకు శివశంకర్‌రెడ్డి తన ఇంటికి వచ్చి దస్తగిరితో మాట్లాడినట్లు బయ్యపురెడ్డి చెప్పారు. తర్వాత శివశంకర్‌రెడ్డి ఆదేశాల మేరకు భరత్‌ యాదవ్‌ సీబీఐ విచారణలో ఏం అడిగిందో తెలుసుకోవడానికి షేక్‌ దస్తగిరితో కలిసి దిల్లీకి వచ్చారు.

* హత్య తర్వాత వాచ్‌మన్‌ రంగన్నను ఈ కేసులో ప్రధాన నిందితుడైన టి.గంగిరెడ్డి బెదిరించారు. భరత్‌ యాదవ్‌ ద్వారా శివశంకర్‌రెడ్డి షేక్‌ దస్తగిరిని బెదిరించారు. పైగా శివశంకర్‌రెడ్డి ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన బి.రంగన్న కార్యకలాపాలపై సూక్ష్మంగా దృష్టి సారించినట్లు ఆయన ఫోన్‌లో లభ్యమైన వీడియో క్లిప్పుల ద్వారా తెలుస్తోంది. వారికున్న ముప్పును దృష్టిలో ఉంచుకొని తగిన భద్రత కల్పించాలని సీబీఐ జిల్లా పోలీసులను కోరింది. దాని ప్రకారం ఇద్దరు సాక్షులకు భద్రత కల్పించారు. ఆ భద్రతను ఇలాగే కొనసాగించాలని దస్తగిరి, రంగన్నలు సీబీఐకి దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత సీబీఐ విజ్ఞప్తి మేరకు కడప సాక్షుల రక్షణ కమిటీ ఈ ఇద్దరికీ రక్షణ కొనసాగిస్తోంది.

* శివశంకర్‌రెడ్డి మొబైల్‌లో సాక్షి రంగన్నకు చెందిన ఏడు వీడియో ఫైల్స్‌, సీబీఐ వివేకా ఇంట్లో ఉన్నప్పటి మూడు వీడియో ఫైల్స్‌, పులివెందుల ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌కు దస్తగిరి వస్తున్నప్పటి వీడియో క్లిప్పింగ్‌లు, వై.సునీల్‌యాదవ్‌ కుటుంబం ఇంటర్వ్యూకి సంబంధించిన 23 వీడియో ఫైళ్లు దొరికాయి. అరెస్టుకు ముందు శివశంకర్‌రెడ్డి ముఖ్యమైన సాక్షులు, నిందితులతోపాటు, సీబీఐ దర్యాప్తు బృందం కదలికలపై దృష్టి సారించినట్లు వీటిని బట్టి తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని