Tammineni Sitaram: స్పీకర్‌ తమ్మినేనిని నిలదీసిన సర్పంచ్‌

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం జి.కె.వలస (గరిమెళ్లకొత్తవలస) గ్రామంలో చెక్‌పవర్‌ రద్దు విషయమై గ్రామ సర్పంచి సుగుణ (వైకాపా)తోపాటు ఆమె కుటుంబసభ్యులు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను నిలదీశారు.

Updated : 21 Oct 2022 09:12 IST

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం జి.కె.వలస (గరిమెళ్లకొత్తవలస) గ్రామంలో చెక్‌పవర్‌ రద్దు విషయమై గ్రామ సర్పంచి సుగుణ (వైకాపా)తోపాటు ఆమె కుటుంబసభ్యులు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను నిలదీశారు. గురువారం గ్రామంలో ఇంటింటికీ తాగునీటి పైపులైన్ల పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. కారు ఎక్కే ముందు స్పీకర్‌ను సర్పంచి సుగుణ, ఆమె కుటుంబసభ్యులు చుట్టుముట్టి నిలదీశారు. ‘చెక్‌పవర్‌ ఎందుకు రద్దు చేశారో చెప్పండి..’ అంటూ ప్రశ్నించగా స్పీకర్‌ స్పందిస్తూ ‘చెక్‌పవర్‌ కోసం చెబుతా.. సమావేశం వద్దకు రండి’ అంటూ సూచించారు. అయితే ‘ఇక్కడే చెప్పండి..’ అంటూ వారు డిమాండ్‌ చేయగా ఆయన సమాధానం చెప్పకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. అయితే ఇటీవల వైకాపాలో మరో వర్గానికి చెందిన పొందూరు మండల నాయకులు ఏర్పాటుచేసిన సమావేశానికి సర్పంచి కుటుంబీకులు వెళ్లడంతోనే చెక్‌పవర్‌ను రద్దయిందని వారి వర్గీయులు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని