Uddanam: ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు?

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 35,000 మంది కిడ్నీ రోగులు ఉన్నారు. ఇప్పటికే 4,500 మంది మరణించారు. సీరం క్రియాటిన్‌ స్థాయి 1.4 దాటిందంటే మందులు వేసుకోవాల్సిందే.

Updated : 26 Oct 2022 08:20 IST

కిడ్నీ సమస్యలతో ఉద్దానంలో 35,000 మంది విలవిల

డయాలసిస్‌ బాధితులకే పింఛన్లు

రోగులకు నిర్ధారణ పరీక్షలు, మందులూ కరవే 

కొన్ని మంచినీటి శుద్ధి ప్లాంట్ల మూసివేత!

నాటి మాటలు..
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 35,000 మంది కిడ్నీ రోగులు ఉన్నారు. ఇప్పటికే 4,500 మంది మరణించారు. సీరం క్రియాటిన్‌ స్థాయి 1.4 దాటిందంటే మందులు వేసుకోవాల్సిందే. నెలకు రూ.4-8 వేల వరకూ ఖర్చవుతుంది. అలాంటి వారందరికీ నెలకు రూ. 10,000 చొప్పున పింఛను అందిస్తాం. డయాలసిస్‌కు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా చేస్తాం. కిడ్నీ రోగులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో పీహెచ్‌సీల్లోనే డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి తెస్తాం!

- ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో భాగంగా 2017 మే 20న శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జగతి గ్రామంలో కిడ్నీ రోగులకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ

నేటి పరిస్థితి..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాధితులకు కిడ్నీ పరీక్షలు జరగడంలేదు. మందులు ఇవ్వడంలేదు. నెఫ్రాలజిస్టులు రావడంలేదు. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి రూ. 10,000, సీరం క్రియాటిన్‌ 5 పాయింట్లు దాటి, కిడ్నీ సైజు 8 సెం.మీ కంటే తక్కువ (స్టేజ్‌- 3, 4) ఉన్నవారికి నెలకు రూ. 5,000 చొప్పున పింఛన్‌ ఇస్తున్నా.. వారి సంఖ్య వెయ్యి లోపే. ఈ పింఛన్‌ పొందాలంటే శ్రీకాకుళం బోధనాసుపత్రికి వెళ్లి రెండు దశల్లో పరీక్షలు చేయించుకోవాలి. మొత్తం రోగుల సంఖ్య 50,000 పైచిలుకు ఉంది. వీరిలో మందులు వాడే వారు సగానికి పైగా ఉన్నా పింఛను రావడంలేదు. గ్రామాల్లో ఎక్కడా డయాలసిస్‌కు ఏర్పాట్లు జరగలేదు.

ఈనాడు-అమరావతి-ఈనాడు డిజిటల్‌-శ్రీకాకుళం, సోంపేట, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానాన్ని కిడ్నీ వ్యాధులు కబళించాయి. ఏడు మండలాల్లోని వేలమందిని దెబ్బతిస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారమే 1,118 మంది మృత్యువాతపడ్డారు. అనధికారిక మరణాలులెన్నో! అత్యంత దుర్లభమైన పరిస్థితుల్లో ఉన్న ఉద్దానం కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సాంత్వన లభించడంలేదు. వ్యాధి నిర్ధారణ పరీక్షలూ సక్రమంగా జరగడంలేదు. మందులు అందడంలేదు. అవసరాలకు తగ్గట్లు నెఫ్రాలజిస్టులు లేరు. 19 పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పరిధిలోని 23 ఎనలైజర్లలో 6 మాత్రమే పనిచేస్తున్నాయి. డ[యాలసిస్‌కి రోగులు ఎక్కువ దూరం వెళ్లనవసరం లేకుండా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోనే డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తామని సీఎం జగన్‌ ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. ఉమ్మడి జిల్లాలో ఏడు డయాలసిస్‌ కేంద్రాలుండగా అందులో ఆరింటిని గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటుచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020లో మందస మండలం హరిపురంలో మాత్రమే ఒకటి పెట్టారు.

వేలల్లో రోగులు.. 787 మందికే పింఛను
ప్రభుత్వపరంగా 114 హైరిస్క్‌ గ్రామాల్లో 19,502 మంది కిడ్నీ రోగులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో మందులు వినియోగించే ప్రతి బాధితుడికి రూ. 10,000 పింఛన్‌ ఇస్తామన్నారు. కానీ.. డయాలసిస్‌ చేసుకునేవారికే రూ.10,000 ఇస్తున్నారు. ఆ పింఛన్‌ పొందాలన్నా శ్రీకాకుళం వెళ్లాల్సిందే. చాలామంది దూర ప్రాంతాల నుంచి తిరగలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. మందులు వాడే రోగులకు పింఛను, మందులు అందడం లేదు. ప్రస్తుతానికి 787 మందికే పింఛను అందుతోంది.

ఇంజక్షన్లు బయట కొనుక్కోవలసిందే  
‘వారానికి రెండు, మూడుసార్లు ఎరిత్రోపాయిటిన్‌ ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉండగా సక్రమంగా ఇవ్వడం లేదని సోంపేట మండలం జింఖీభద్ర గ్రామానికి చెందిన డయాలసిస్‌ రోగి రాయల నరసింహమూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఇంజక్షన్‌ బయట కొనుక్కోవాల్సి వస్తోందని, మందులు, ఇతర పరీక్షలకు అంతా కలిపి రూ. 12,000 వరకూ ఖర్చవుతోందని పేర్కొన్నారు.

మందులు ఎక్కడ?
2017 నుంచి సామాజిక ఆసుపత్రుల పరిధిలో 23 రకాల మందులను ఉచితంగా ఇచ్చేవారు. వీటి కోసం అదనపు బడ్జెట్ కేటాయించేవారు. రెండేళ్లుగా ఈ బడ్జెట్ నిలిపేశారు. ఐరన్‌, కాల్షియం మాత్రలనే కిడ్నీ రోగులకు అందిస్తున్నారు. గతంలో నెఫ్రాలజిస్టులు వారానికి ఒకసారైనా ఒక సీహెచ్‌సీలకు వచ్చేవారు. ఇప్పుడు నెలల తరబడి రావడంలేదు.

ఖర్చు భారంగా ఉంది..
పలాస మండలం గొల్లమాకినపల్లికి చెందిన రాపాక చిన్న అప్పలస్వామి, అతని భార్య ఇద్దరూ వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇందుకోసం మందస మండలం హరిపురం వెళ్లాల్సి వస్తోంది. రవాణా ఖర్చులే నెలకు రూ.6,000 అవుతున్నాయి. మందులకు ఇద్దరికీ నెలకు రూ.15-20 వేలు ఖర్చవుతున్నాయని చెబుతున్నారు. ఇద్దరికీ పింఛను వస్తున్నా రవాణా, మందులు, ఇంజక్షన్ల ఖర్చుకు సరిపోవడం లేదన్నారు.


పరిశోధనకు నిధులేవీ!

కిడ్నీ వ్యాధిపై పరిశోధనలకు 2017లో అప్పటి ప్రభుత్వం ‘జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వారు సర్వే చేసి 2,419 మందిని గుర్తించారు. ఏడాది విరామంతో వరుసగా మూడుసార్లు పరీక్షలు (బేస్‌లైన్‌, మిడ్‌లైన్‌, ఎడింగ్‌ లైన్‌) చేయాలని నిర్ణయించారు. ఇప్పటివరకు బేస్‌లైన్‌, మిడ్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మిడిల్‌ లైన్‌ పరీక్షల నాటికి రూ. 5.73 కోట్లు చెల్లించాలి. రూ. 1.30 కోట్ల వరకే ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. ఆ సంస్థ పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదు. గుర్తించిన 2,419 మందిలో 133 మంది మరణించారు. ప్రస్తుతం ఐసీఎంఆర్‌ నుంచి అందుతున్న ప్రత్యేక ఫండ్‌తో పరిశోధన మందకొడిగా సాగుతోంది.


సుజల పంపిణీ ఏదీ?

కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో శుద్ధజల కేంద్రాల ద్వారా తాగునీరు అందించేందుకు 2018లో గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ సుజల పథకం అమలుచేసింది. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లో 167 మినీ శుద్ధజల కేంద్రాలు నిర్మించి తాగునీరు సరఫరా చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక వివిధ కారణాలతో 35% ప్లాంట్లు మూతపడ్డాయి.


పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లే ఆధారం

వ్యాధి తీవ్రత గుర్తించేందుకు 2017లో 29 ప్రభుత్వాసుపత్రులకు రక్తపరీక్ష యంత్రాలు పంపారు. గతంలో గ్రామస్థాయిలో పరీక్షలు చేసేవారు. ఉద్దానం సామాజిక ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేవారు. 2020లో కొవిడ్‌ ఆరంభం నుంచి ఈ ప్రాజెక్టు నిర్వహణ మందగించింది. ముఖ్యమైన మందుల సరఫరా ఆపేశారు. రక్త పరీక్ష యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలించడం, పాడైనవాటిని బాగుచేయక రక్త పరీక్షలు దాదాపుగా నిలిచిపోయాయి. రోగులు ప్రైవేటు ల్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. వారికి గతంలో ఎరిత్రోపాయిటిన్‌ ఇంజక్షన్‌ ఇచ్చేవారు. వాటి ఖరీదు దాదాపు రూ. 750. ఇప్పుడు ఇవ్వడంలేదు.


మూడేళ్లయినా పూర్తికాని పనులు

పలాసలో రూ. 50 కోట్ల అంచనాతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రానికి 2019 సెప్టెంబరు 6న సీఎం శంకుస్థాపన చేశారు. రూ. 36.88 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణాల్లో 70 శాతమే పూర్తయ్యాయి. రక్షిత తాగునీరు అందించేందుకు రూ. 700 కోట్ల అంచనాతో మెగా తాగునీటి పథకం పనులు 2020 ఆగస్టులో ప్రారంభమయ్యాయి. 807 గ్రామాలకు చెందిన 5.57 లక్షలమంది ప్రజలకు ఈ నీటిని అందించాలనేది ప్రాజెక్టు లక్ష్యం. అవి కూడా ఇంకా పూర్తి కాలేదు.


రూ.57 లక్షలతో కొత్త ఎనలైజర్లు, మందులు

పాత ఎనలైజర్లు పనిచేయకపోవడంతో కొత్తవి కొంటున్నాం. వాటితో పాటు డయాలసిస్‌ యంత్రాలు, మందుల కోసం అత్యవసరంగా రూ.57 లక్షలకు ప్రతిపాదనలు వచ్చాయి. నెల రోజుల్లో వీటిని అందుబాటులో తెస్తాం.

-శ్రీకేశ్‌ బి లఠ్కర్‌, శ్రీకాకుళం కలెక్టర్‌


‘భరోసా’ లేదు!

జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హామీ ఇచ్చినట్లుగా మందులు ఇవ్వడం లేదు. పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా మందులకే రూ. 10 వేలు అవుతుండటంతో అప్పులు చేస్తున్నా. మరోవైపు ఫిట్స్‌, గుండెవ్యాధుల బారినపడ్డా. పింఛను రావడంలేదు.

-కవిటి మండలం జగతిలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన కిడ్నీ వ్యాధిగ్రస్థుల భరోసా సభలో ఆయనతో మాట్లాడిన బాధితుడి ఆవేదన


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని