Software Jobs: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలపై మాంద్యం నీడ!

ప్రాంగణ నియామకంలో ఓ ప్రముఖ కంపెనీకి ఎంపికయ్యాను. ఇప్పటి వరకు నియామక లేఖ రాలేదు. చాలామంది అభ్యర్థులకు తిరస్కరణ మెయిల్స్‌ వస్తున్నాయి. ఈ ఉద్యోగం కోసమని మంచి ఆఫర్లను వదిలేశాను. నా ఆన్‌ బోర్డింగ్‌ గురించి కొంచెం ఆ కంపెనీతో మాట్లాడండి.

Updated : 27 Oct 2022 07:17 IST

 గతేడాది ఎంపికైన అభ్యర్థులను చేర్చుకోవడంలో జాప్యం

దశలవారీ ఎంపికలకే ఐటీ కంపెనీల ప్రాధాన్యం  

ప్రాంగణ నియామకాల్లో 25% - 30% తగ్గే అవకాశం

ప్రాంగణ నియామకంలో ఓ ప్రముఖ కంపెనీకి ఎంపికయ్యాను. ఇప్పటి వరకు నియామక లేఖ రాలేదు. చాలామంది అభ్యర్థులకు తిరస్కరణ మెయిల్స్‌ వస్తున్నాయి. ఈ ఉద్యోగం కోసమని మంచి ఆఫర్లను వదిలేశాను. నా ఆన్‌ బోర్డింగ్‌ గురించి కొంచెం ఆ కంపెనీతో మాట్లాడండి.

- విజయవాడలోని ఒక ప్రముఖ కళాశాలకు విద్యార్థిని పంపిన లేఖ


మా అవసరాలను అనుసరించి 2023 జులై తర్వాత దశలవారీగా నియామకాలు చేపడతాం. ప్రసుతం ఎంపికైన అభ్యర్థులు ఈలోపు ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కోవచ్చు.

- ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు ప్రముఖ కంపెనీ పంపిన ఈ-మెయిల్‌


ఈనాడు, అమరావతి: ఆర్థిక మాంద్యం భయంతో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చేపట్టిన నియంత్రణ చర్యల ప్రభావం ప్రాంగణ నియామకాలపై పడింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు నియామకాలు చేపట్టిన ప్రముఖ కంపెనీలు ఇప్పుడు కొంతమందిని చేర్చుకోవడంపై వేచి చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం 2023 మార్చి తర్వాత పిలుస్తామని చెబుతున్నాయి. మరికొన్ని అభ్యర్థులకు సరైన సమాధానం చెప్పకుండా కళాశాలల ప్రాంగణ నియామక అధికారులను కలవాలని సూచిస్తున్నాయి. కానీ, ఆ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అమెరికా, ఐరోపాలలో మాంద్యం భయంతో ఇప్పటి నుంచే ఐటీ కంపెనీలు నియామకాల్లో జాగ్రత్త పడుతున్నాయి. ప్రస్తుత ప్రాంగణ నియామకాల్లోనూ 25% నుంచి 30% వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఈ మాంద్యం వచ్చే ఏడాది జులై వరకు ఉండొచ్చని ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో ఏప్రిల్‌, మే నెలల్లో బీటెక్‌ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌ పొందిన వారిని దాదాపుగా తీసుకున్నాయి. ఆతర్వాత మాంద్యం రావొచ్చనే అంచనాతో నియామకాలపై కంపెనీలు అచితూచి వ్యవహరిస్తున్నాయి.

దశలవారీ నియామకాలు..

సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇప్పుడు దశలవారీ నియామకాలు చేపడుతున్నాయి. మొదట స్వల్ప మొత్తంలో నియామకాలు చేసుకోవడం, ఆ తర్వాత పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకోవాలనే విధానాన్ని పాటిస్తున్నాయి. ఇప్పటివరకు ఒకేసారి ఎక్కువగా నియామకాలు చేపట్టి, ఆ తర్వాత మరింత అవసరమైతే తీసుకునేవి. గతంలో 500 మంది విద్యార్థులు ఎంపిక ప్రక్రియలో పాల్గొంటే కనీసం 200 మందిని ఎంపిక చేసుకునేవి. ఇప్పుడు ఇది వందలోపే ఉంటోంది. ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థులను చేర్చుకోవడాన్ని వాయిదా వేస్తున్నాయి. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా కంపెనీలు సూచించిన సర్టిఫికెట్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేశారు. సుమారు రెండు, మూడు నెలలుగా అభ్యర్థులు ఇంటి వద్దనే ఉంటున్నారు. నియామకాలపై కంపెనీలను సంప్రదించినా స్పష్టమైన సమాధానం లభించడం లేదని అభ్యర్థులు వెల్లడిస్తున్నారు.

ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బీటెక్‌ మూడో ఏడాది రెండో సెమిస్టర్‌ వారిని ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసుకుంది. ఇప్పటి వరకు కంపెనీలు అనుసరిస్తున్న విధానం ప్రకారం వీరికి నాలుగో ఏడాది రెండో సెమిస్టర్‌లో ఇంటర్న్‌షిప్‌ నిర్వహించాలి. కానీ, మొదటి సెమిస్టర్‌ పూర్తయ్యే సమయం వచ్చినా ఆ కంపెనీ నుంచి ఎలాంటి సంకేతాలూ రావడం లేదు. 2023 జులై తర్వాత తీసుకుంటామని పేర్కొంటోంది. అప్పటి వరకు ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చంటూ కళాశాలకు ఈ-మెయిల్‌ పంపింది. ప్యాకేజీ రూ.12 లక్షల వరకు ఇస్తామని మొదట చెప్పినా ఇప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వలేదు.


ఆచితూచి అడుగులేస్తున్న కంపెనీలు

‘‘ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్నాయి. నాలుగు నెలలు క్రితం ఉన్న నియామకాల జోరు ప్రస్తుతం కనపడటం లేదు. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు నియామకాలు, ఉద్యోగాల సంఖ్యపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక వేత్తల విశ్లేషణల ప్రకారం ఇది దీర్ఘకాలం ఉండబోదు. రెండు, మూడు త్రైమాసికాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత నియామకాలు వేగం పుంజుకుంటాయి. ఈ సమయంలో విద్యార్థులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి’’

-కోట సాయి కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని