Andhra News: కూల్చేసేంత కక్ష

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. భౌతిక దాడులు, దౌర్జన్యాలతో రాజకీయ ప్రత్యర్థుల రక్తం కళ్లజూస్తున్న అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష పార్టీలకు ఏ రూపంలో మద్దతిచ్చేవారిపైనయినా వేధింపులకు దిగుతున్నారు.

Updated : 05 Nov 2022 08:20 IST

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ల కూల్చివేత
తెదేపా, జనసేన కార్యకర్తల నివాసాలే లక్ష్యంగా విధ్వంసం
జనసేన సభకు భూములిచ్చామనే కక్ష సాధిస్తున్నారన్న గ్రామస్థులు
రహదారి విస్తరణ కోసమేనన్న నగరపాలక అధికారులు
అడ్డుకున్న యజమానులను లాగిపడేసిన పోలీసులు
15వ తేదీ వరకు ఎలాంటి చర్యలొద్దని హైకోర్టు స్టే
తాడేపల్లి - న్యూస్‌టుడే

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. భౌతిక దాడులు, దౌర్జన్యాలతో రాజకీయ ప్రత్యర్థుల రక్తం కళ్లజూస్తున్న అధికార పార్టీ నేతలు.. ప్రతిపక్ష పార్టీలకు ఏ రూపంలో మద్దతిచ్చేవారిపైనయినా వేధింపులకు దిగుతున్నారు. పోలీసులు, అధికారుల సాయంతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే చిన్న గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తలకు చెందిన 53 ఇళ్లు, ప్రహరీలు కూల్చివేశారు. దీనికి నగరపాలక అధికారులు చెప్పిన కారణం.. రహదారి విస్తరణ. ఉదయమే జేసీబీలు, పోలీసు బలగాలతో గ్రామంలోకి దిగిన అధికారులు ఇళ్ల యజమానులు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. కాళ్లావేళ్లా పడినా కనికరించలేదు. గ్రామానికి వచ్చే దారులు ఇరుగ్గా ఉన్నా పట్టించుకోని అధికారులు ఆర్టీసీ బస్సు కూడా రాని ఊళ్లో దారిని విస్తరిస్తామంటూ.. ఇళ్లను కూల్చివేయడమేంటని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల జనసేన సభకు చోటు ఇవ్వకుండా అధికార పార్టీ అడ్డుపడుతుంటే తమ గ్రామంలో సభ పెట్టుకొమ్మని ముందుకు రావడమే తాము చేసిన పాపమా అని వారు వాపోతున్నారు. ఇప్పటికే 65 అడుగుల వెడల్పున్న రోడ్డును ఏకంగా 120 అడుగులకు విస్తరిస్తామని చెప్పటం, అందుకు అంగీకరించలేదని రహదారి పక్కన్న తెదేపా, జనసేన సానుభూతిపరులు, కార్యకర్తల ఇళ్లు కూల్చివేయడం రాజకీయ కక్ష సాధింపేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఉదంతంపై ఇళ్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 15 వరకు ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలంటూ స్టే ఉత్తర్వులిచ్చింది.

ఉదయమే జేసీబీలతో వచ్చి...

శుక్రవారం ఉదయమే మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం అధికారులు జేసీబీలతో మంగళగిరి మండలం ఇప్పటం గ్రామానికి వచ్చి ప్రధాన రహదారిలో కూల్చివేతలకు సిద్ధమయ్యారు. తమ ఇళ్లను కూల్చివేయడానికి ఏ అధికారంతో వచ్చారంటూ ఇళ్ల యజమానులు వారిని నిలదీశారు. రహదారి విస్తరణ కోసం నెల రోజుల క్రితం నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పారు. సీఆర్డీఏ అనుమతులు ఎలా వచ్చాయో తమకు తెలియదని, తమ దగ్గరున్న రికార్డు ప్రకారం మార్కింగ్‌ ఇచ్చామని, దానికి అనుగుణంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దీన్ని అడ్డుకునేందుకు ఇళ్ల యజమానులు ఎంత ప్రయత్నించినా అధికారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులు ఇళ్ల యజమానులను జేసీబీల ముందు నుంచి పక్కకు లాగేశారు. తన ఇంటిని కూల్చవద్దంటూ అడ్డుకున్న మహిళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగడంతో గ్రామంలో దాదాపు 5గంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులను భారీగా మోహరించిన అధికారులు.. 54 గృహాలకు గాను 53 ఇళ్లను తొలగించారు. మాజీ సర్పంచి పిచ్చియ్య కోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకోవడంతో ఆయన ఇంటిని కూల్చలేదు. నగరపాలక అధికారులు కూల్చివేతకు ఉపక్రమించిన ఇళ్లలో జనసేన, తెదేపా నాయకులు, కార్యకర్తలవే ఎక్కువగా ఉన్నాయి. ఇళ్ల కూల్చివేతపై మంగళగిరి, తాడేపల్లి నగరపాలక కమిషనర్‌ శారదాదేవిని వివరణ కోరగా రహదారి విస్తరణ కోసం ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొన్నారు. చట్టప్రకారం నోటీసులు జారీ చేశామని, అందులో పేర్కొన్న గడువు తీరాకే ఆక్రమణలు తొలగించామన్నారు.

అదుపులోకి తీసుకుని.. స్టేషన్లు మార్చుతూ..

ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ ఆందోళనకు దిగిన తెదేపా మండల అధ్యక్షుడు అమరా సుబ్బారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నామల నాగేశ్వరరావులతోపాటు మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత తాడేపల్లి స్టేషన్‌కు, అక్కడి నుంచి మంగళగిరి ఠాణాకు తరలించారు. కొద్దిసేపటికే అక్కడ నుంచి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు వారిని పరామర్శించారు. ఇళ్ల తొలగింపు పూర్తయ్యేవరకూ స్టేషన్లు మార్చుతూ తర్వాత విడిచిపెట్టారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చినందుకు కక్షతో తమ ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి వైకాపా తెర తీసిందని తెదేపా, జనసేన పార్టీ నాయకులు మండిపడ్డారు. జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘జనసేన సభకు అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. వాటితో పనులు చేపట్టాలని సంకల్పించగా ఆ నగదును సీఆర్డీఏకి జమ చేయాలని అధికారులు అడ్డుపడ్డారు. దీంతో ఇటీవల పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గ్రామంలో సమావేశం నిర్వహిస్తే విద్యుత్తు సరఫరా నిలిపేసి దానికీ ఆటంకం కల్పించాలని చూశారు. కొంతమంది పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీలను చించివేసి పేడ చల్లారు. ఈ ఘటనపై జనసేన మండల కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కక్షగట్టి జనసేన సభకు భూములిచ్చిన వారిని గుర్తించి వారి ఇళ్లను కూల్చివేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వైకాపా నేతల మాటలకు తలొగ్గి పోలీసుల అండతో విధ్వంసానికి పూనుకున్నారని, అడ్డుకున్న మహిళలనూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. 

రాజకీయ కోణమే కారణమా?

తాడేపల్లి మండలంలో అతి చిన్న గ్రామం ఇప్పటం. 600 ఇళ్లు, 2 వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో దాదాపుగా 65 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారి ఉంది. గతంలో ఈ రోడ్డుకు ఇరువైపులా మురుగుకాలువలు నిర్మించారు. దానికి వెనుక వైపు గ్రామస్థులు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. ఇప్పటికే విశాలంగా ఉన్నప్పటికీ ఈ రోడ్డులో పాఠశాలల బస్సులు మినహా పెద్దగా వాహనాల రాకపోకలేవీ ఉండవు. గ్రామానికి వచ్చే మూడు రోడ్లూ ఇరుగ్గానే ఉన్నా వాటి విస్తరణ ఊసెత్తకుండా.. గ్రామ నడిబొడ్డున విశాలంగా ఉన్న రహదారిని విస్తరించాలనే ఆలోచన వెనుక రాజకీయ కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.

గుంతలు పూడ్చలేని వారు..విస్తరణపేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారు: లోకేశ్‌

రహదారులపై గుంతలు పూడ్చలేని వైకాపా ప్రభుత్వం.. విస్తరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం విడ్డూరంగా ఉందని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో సీఎం జగన్‌ ఇంటి పక్కన ఉన్న పేదల ఇళ్లు కూల్చడంతో మొదలైన విధ్వంసం.. నేటికీ కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఇళ్లు కూల్చడం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వ్యసనంగా మారిందని ధ్వజమెత్తారు. ‘కనీసం సమాచారం ఇవ్వకుండా.. విస్తరణ పేరుతో గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నా ఇప్పటంలో ఇళ్లు కూల్చడం దుర్మార్గం’’ అని పేర్కొన్నారు.


సొంత స్థలాల్లో కట్టుకున్నా కూల్చేశారు

 హైకోర్టులో ఇప్పటం వాసుల పిటిషన్‌

ఈనాడు, అమరావతి: సొంత స్థలాల్లో 30-40 ఏళ్ల కిందట నిర్మించుకున్న తమ ఇళ్లు, ప్రహరీలను అధికారులు రహదారి విస్తరణ ముసుగులో కూల్చివేస్తున్నారని, దాన్ని నిలువరించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ ప్రజలు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కూల్చివేతల ప్రక్రియను ఈ నెల 15 వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఈ ఏడాది మే 21న జారీ చేసిన నోటీసు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌ కమిషనర్‌, ఇప్పటం పంచాయతీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఇప్పటం గ్రామంలోని ప్రధాన రహదారి విస్తరణ పేరుతో.. ఏళ్ల కిందట నిర్మించుకున్న తమ ఇళ్లు, ప్రహరీలను అధికారులు కూల్చివేస్తున్నారంటూ ఆ గ్రామానికి చెందిన రైతులు బెల్లంకొండ వెంకటనారాయణ మరో 13 మంది శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. కూల్చివేతకు అధికారులిచ్చిన నోటీసును రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.చిదంబరం వాదనలు వినిపించారు. పిటిషనర్లు సొంత స్థలాల్లో ఏళ్ల కిందట ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. గ్రామస్థులు ఎలాంటి విజ్ఞప్తి చేయకపోయినా.. ప్రస్తుత రహదారిని రెండింతలు విస్తరించడానికి అధికారులు ప్రతిపాదించారన్నారు. అందుకు పిటిషనర్లు అంగీకరించకపోవడంతో రహదారిని ఆక్రమించారని కట్టుకథ అల్లి, అవాస్తవాలతో నోటీసు ఇచ్చారన్నారు. రహదారి విస్తరణ కోసమైతే భూసేకరణ ప్రక్రియ చేపట్టి పిటిషనర్లకు పరిహారం ఇవ్వాలన్నారు. దానిని ఎగ్గొట్టడానికే ఆక్రమణ అంటూ హడావుడిగా కూల్చివేతకు చర్యలు చేపట్టారన్నారు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు. దీంతో న్యాయమూర్తి.. మే 21న అధికారులు ఇచ్చిన నోటీసు ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని