Jagananna Colony: భూములు తీసుకొని.. పరిహారం అడిగితే దాడి చేశారు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు జగనన్న కాలనీలో పరిహారం వివాదం రాజుకుంటోంది. పరిహారమిచ్చేంత వరకూ తామిచ్చిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టవద్దన్నందుకు రెవెన్యూ అధికారులు, వైకాపా నాయకులు దాడిచేశారని రైతులు తెలిపారు.

Updated : 06 Nov 2022 08:43 IST

శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు రైతుల వేదన

పలాస గ్రామీణం న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు జగనన్న కాలనీలో పరిహారం వివాదం రాజుకుంటోంది. పరిహారమిచ్చేంత వరకూ తామిచ్చిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టవద్దన్నందుకు రెవెన్యూ అధికారులు, వైకాపా నాయకులు దాడిచేశారని రైతులు తెలిపారు. ఇప్పుడు పరిహారమిచ్చినా తమ భూములివ్వబోమని తేల్చిచెప్పారు. బాధితుల కథనం ప్రకారం...బొడ్డపాడు రెవెన్యూ పరిధి సర్వేనంబరు 76లోని భూమిని సుమారు 40 ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్నారు. బొడ్డపాడు, మామిడిపల్లి గ్రామాలకు చెందిన 36 మందికి ఇక్కడ జగనన్న కాలనీ ఇళ్ల స్థలాలు కేటాయించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే ఆ స్థలంలో కొన్ని నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నెలల తరబడి పోరాడిన అన్నదాతలు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం నిర్మాణాలు ఆగిపోయాయి. గురువారం బొడ్డపాడు సర్పంచి తామాడ మదన్‌ అనుచరులతో కలిసి జగనన్న కాలనీ స్థలం వద్దకురాగా.. రైతులు కూడా వెళ్లారు. పరిహారం చెల్లించకుండా తమ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడతారంటూ రైతులు సర్పంచితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సర్పంచి తిరిగి తన అనుచరులతో వచ్చి భౌతిక దాడి చేశారని భూములిచ్చిన రైతులు ఆరోపిస్తున్నారు. సర్పంచి మదన్‌, ఎంపీటీసీ సభ్యుడు పాపారావు, క్షేత్ర సహాయకుడు పోతనపల్లి సరోజవర్మ, వాలంటీర్‌ విజయ్‌, వీఆర్వో ఎర్రయ్య, వరలక్ష్మితో పాటు పలువురు తమపై దాడిచేశారని బాధితులు చెబుతున్నారు. దాడిలో ఏడుగురికి గాయాలయ్యామని, పలాస మేజిస్ట్రేట్ని కలిసి వివరించామని, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందామని రైతులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని