Andhra News: మహిళలపై మట్టిపోసి హత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో తమ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రాక్టరుతో కంకరమట్టి పోయించడం సంచలనమైంది.

Updated : 08 Nov 2022 05:24 IST

శ్రీకాకుళం జిల్లాలో అమానుషం
వైకాపా అండతోనే వేధిస్తున్నారని బాధితుల ఆవేదన

హరిపురం (మందస), న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదంలో తమ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రాక్టరుతో కంకరమట్టి పోయించడం సంచలనమైంది. బాధితుల కథనం ప్రకారం... కుటుంబానికి చెందిన ఆస్తుల్లో తమకు న్యాయబద్ధంగా వాటా ఇవ్వాలని హరిపురానికి చెందిన కొట్ర దాలమ్మ, ఆమె కుమార్తె మజ్జి సావిత్రి పోరాడుతున్నారు. ఈ క్రమంలో స్థానిక హెచ్‌బీ కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉమ్మడి ఆస్తి ఇంటి స్థలంలో దాలమ్మ భర్త నారాయణ అన్న కుమారుడు కొట్ర రామారావు కొద్ది రోజుల నుంచి ట్రాక్టర్లతో కంకరమట్టి తోలిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందంటూ తల్లీకుమార్తె సోమవారం అక్కడికి వెళ్లారు. ట్రాక్టరుతో కంకరమట్టి వేస్తుండగా అభ్యంతరం తెలిపారు. మట్టి పోయకూడదంటూ ట్రాక్టరు వెనుక వైపునకు వెళ్లి కింద కూర్చున్నారు. అయినా పట్టించుకోకుండా వారిపై మట్టిని అన్‌లోడ్‌ చేశారు. మట్టిలో కూరుకుపోయిన తల్లీకుమార్తె విలవిల్లాడారు. కాపాడాలని కేకలు వేస్తూ రోదిస్తుండటంతో సమీపంలో ఉన్న కొందరు యువకులు వారిని బయటకు తీశారు. కుటుంబానికి చెందిన ఆస్తిలో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా అడుగుతున్నామని, కక్షగట్టి కొట్ర రామారావు, కొట్ర ఆనందరావు, కొట్ర ప్రకాశరావు (వీరు దాలమ్మ భర్త నారాయణ సోదరులు సీతారాం, లక్ష్మీనారాయణ కుమారులు) తమపై మట్టి కప్పించి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు మందస పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొట్ర రామారావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు.

భర్త కొట్ర నారాయణ మృతి చెందడంతో భార్య దాలమ్మ, ఆమె కుమార్తె  సావిత్రి ఉమ్మడి ఆస్తుల్లో వాటా కోసం 2019 నుంచి పోరాడుతున్నారు. నారాయణ ఇద్దరు అన్నదమ్ములు సీతారాం, లక్ష్మీనారాయణతో సమానంగా తమకూ ఆస్తి ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇందుకోసం గతంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే హోదాలో సీదిరి అప్పలరాజు కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. దాలమ్మ బావ సీతారాం కుమారుడైన వైకాపా గ్రామ నాయకుడు కొట్ర రామారావు అదే గ్రామంలోని ఓ స్థలంలో కొద్ది రోజులుగా భవన నిర్మాణానికి పునాదులు తీసి అందులో కంకరమట్టి వేయిస్తున్నారు. ఆ స్థలంలో తమకూ వాటా ఉందని దాలమ్మ, సావిత్రి  అడ్డుకోగా ఈ ఘటన చోటుచేసుకుంది.


వైకాపా ప్రభుత్వానికి ఆ మట్టితోనే సమాధి కడతాం: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: హరిపురంలో మహిళలపై వైకాపా నాయకులు మట్టి పోయించడంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై ఇంత దారుణానికి తెగిస్తారా? అని మండిపడ్డారు. ‘అహంకారంతో విర్రవీగుతున్న వైకాపా ప్రభుత్వ సమాధికి వాడబోయేది ఈ మట్టే అని గుర్తుంచుకోవాలి’ అని ఓ ప్రకటనలో హెచ్చరించారు.

‘వైకాపా నేతలు ట్రాక్టర్‌తో మహిళలపై మట్టిని పోయించి చంపాలని చూడటం దారుణం. వారు పశువుల మంత్రి అనుచరులు కావడంతో పోలీసులు ఈ దాష్టీకంపై స్పందించడం లేదు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘మేం చచ్చిపోతున్నాం.. మమ్మల్ని కాపాడండి’ అంటూ మహిళలు ఆర్తనాదాలు చేస్తుంటే.. ‘చచ్చిపో పర్లేదు’ అని వైకాపా నాయకుడు అంటున్న వీడియోను ట్వీట్‌కు జతచేశారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని