Andhra News: బూటు దెబ్బలు పడతాయ్‌: ఉద్యోగిపై కానిస్టేబుల్‌ దుర్భాషలు

అనంతపురం జిల్లా రాప్తాడు పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల ఓ కానిస్టేబుల్‌... ప్రభుత్వ ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాప్తాడు మండలంలోని ఆకుతోటపల్లికి చెందిన అరవ వీరారెడ్డి ఎస్కేయూలో జూనియర్‌ అసిస్టెంట్‌.

Updated : 08 Nov 2022 07:31 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రాప్తాడు పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల ఓ కానిస్టేబుల్‌... ప్రభుత్వ ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. రాప్తాడు మండలంలోని ఆకుతోటపల్లికి చెందిన అరవ వీరారెడ్డి ఎస్కేయూలో జూనియర్‌ అసిస్టెంట్‌. రాప్తాడులోని 34 సెంట్ల విషయంలో వీరారెడ్డికి, చియ్యేడు గ్రామానికి చెందిన అప్పిరెడ్డి ఆదినారాయణరెడ్డికి వివాదం ఉంది. దీనిపై గత నెల 19న ‘స్పందన’లో ఎస్పీ ఫక్కీరప్పకు వీరారెడ్డి ఫిర్యాదు చేశారు

. ఎస్పీ ఆదేశాల మేరకు రాప్తాడు ఎస్సై రాఘవరెడ్డి... ఇరువురినీ పిలిపించి భూ రికార్డులను పరిశీలించారు. వీరారెడ్డికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండటంతో.. ఆ భూమిలోకి వెళ్లొద్దంటూ ఆదినారాయణరెడ్డిని హెచ్చరిస్తూ ఆయనతో పత్రం రాయించుకున్నారు. అక్కడే పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఆదినారాయణరెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకుని ఈ నెల 4న ఎస్సై పిలుస్తున్నారంటూ వీరారెడ్డికి ఫోన్‌ చేసి స్టేషనుకు రప్పించుకున్నారు.

‘నువ్వు భూమిలోకి పోవద్దు’ అని ఆ వీరారెడ్డిని కానిస్టేబుల్‌ హెచ్చరించారు. ‘ఎందుకు పోకూడదు’ అని ఆయన అనడంతో కానిస్టేబుల్‌ ఆవేశంతో ఊగిపోతూ ‘ఏయ్‌.. నీకు బూటు దెబ్బలు పడతాయ్‌.. లా అండ్‌ ఆర్డర్‌ అంటే ఏమనుకుంటున్నావ్‌’ అంటూ బాధితుడి సెల్‌ఫోన్‌ లాక్కొని బెదిరించారు. భయపెట్టి, బలవంతంగా కాగితంపై సంతకం పెట్టించుకున్నారు. భూమిపై సర్వహక్కులు కలిగిన తనతో కానిస్టేబుల్‌ అమానవీయంగా ప్రవర్తించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వీరారెడ్డి సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని