Amaravati: ప్రభుత్వానికి భంగపాటు

అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అన్ని వర్గాలూ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం రాజధాని ప్రాంత స్వరూపాన్ని మార్చేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది.

Updated : 08 Nov 2022 09:39 IST

అమరావతి పురపాలక సంఘం ఏర్పాటుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత
ప్రభుత్వానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నివేదిక

ఈనాడు, అమరావతి: అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అన్ని వర్గాలూ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయి. అయినా ప్రభుత్వం రాజధాని ప్రాంత స్వరూపాన్ని మార్చేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర ప్రారంభించినప్పుడే... అమరావతి కేంద్రంగా పురపాలక సంఘం ఏర్పాటుకు అదే నెల 12 నుంచి 16 వరకు గ్రామసభలు నిర్వహించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామ పంచాయతీల్లో అధికారులు సభలు ఏర్పాటుచేశారు. పాదయాత్రలో పాల్గొనగా.. గ్రామాల్లో మిగిలిన ప్రజలు, రైతులు గ్రామసభలకు హాజరై అమరావతి పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ పంచాయతీల్లో తీర్మానాలు చేయించారు. ఈ పరిణామాలతో 22 పంచాయతీల్లోనూ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదనలపై గ్రామసభల్లో ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని... ఇందుకు సంబంధించిన తీర్మానాలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. సభలు నిర్వహించిన అన్నిచోట్లా ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైన విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక పంపిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలి

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌) ప్రకారం అమరావతిని స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయాలని 22 గ్రామసభల్లో ప్రజలు కోరారు. బృహత్తర ప్రణాళికను మార్చి, రాజధాని ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా పురపాలక సంఘం ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.

నగరపాలక సంస్థ ఏర్పాటు సందర్భంలోనూ చుక్కెదురు

రాజధాని అమరావతిలో కీలకమైన 19 పంచాయతీలను కలిపి ‘అమరావతి క్యాపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ పేరుతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో చేసిన ప్రయత్నాన్నీ ప్రజలు తిప్పికొట్టారు. తుళ్లూరు మండలంలో 16, మంగళగిరి మండలంలో 3 పంచాయతీల్లో జనవరి 5-12 మధ్య నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను ప్రజలు వ్యతిరేకించారు. రాజధాని అమరావతి ప్రాంతం 29 గ్రామాలతో ఏర్పడింది. విభజించు, పాలించు తరహాలో ఇందులో 19 పంచాయతీలతో ప్రత్యేక నగరపాలక సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానాలు చేశారు. సీఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక ప్రకారం రాజధాని అమరావతి ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని ప్రజలు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని