Visakhapatnam: కూల్చివేతల కలకలం
విశాఖలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మూడో పట్టణ పోలీసు స్టేషన్ మార్గంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల సమీపంలో పోలీసు బందోబస్తు మధ్య సాగిన విధ్వంసం వివాదాస్పదంగా మారింది. బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదు.
ఏడుపులు, కన్నీళ్ల మధ్య విశాఖలో నిర్మాణాల నేలమట్టం
ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే దారుణం
జీవీఎంసీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల నిర్వాకం
రోడ్డున పడిన బాధిత కుటుంబాలు
విశాఖలో చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేత కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత మూడో పట్టణ పోలీసు స్టేషన్ మార్గంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాల సమీపంలో పోలీసు బందోబస్తు మధ్య సాగిన విధ్వంసం వివాదాస్పదంగా మారింది. బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయలేదు. కనీసం ఆయా దుకాణాల్లోని సామగ్రిని భద్రపరచుకోవడానికైనా సమయం ఇవ్వలేదు. పొక్లెయిన్లు, జేసీబీలతో దుకాణాలను నేలమట్టం చేయడంతో సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయింది.
ఈనాడు, విశాఖపట్నం - న్యూస్‌టుడే, పెదవాల్తేరు, ఎంవీపీకాలనీ: విశాఖలో కూల్చివేతలతో దుకాణదారులు, చిరు వ్యాపారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆంధ్ర వర్సిటీ వసతి గృహాలకు దగ్గర్లో కారు షెడ్లు, కార్‌వాష్, టీ, చికెన్ కొట్లు, పాన్‌షాపులు కలిపి మొత్తం 16 దుకాణాలున్నాయి. వీటిలో 200 మంది వరకు నిత్యం పని చేస్తున్నారు. ఇక్కడే తమ భూములు ఉన్నాయని ఏయూ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇందులోని 1.02 ఎకరాలపై ఒకరికి అనుకూలంగా 13ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే... తమ భూములు ఆక్రమణకు గురయ్యాయని, చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ అధికారులకు విశ్వవిద్యాలయ అధికారులు ఫిర్యాదు చేశారు. వాటిని తొలగించడానికి జీవీఎంసీ అధికారులు ప్రధాని మోదీ పర్యటనను అవకాశంగా తీసుకున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లలో భాగంగా పార్కింగ్ తదితర అవసరాలకు వీలుగా అందుబాటులో ఉన్న అన్ని స్థలాలను చదును చేస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదులొచ్చిన చోటున్న దుకాణాలనూ తొలగించారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున తమ జోలికి రారనే భరోసాతో ఉన్న భూయజమాని వారసులు తొలగింపుల విషయం తెలుసుకుని విస్మయానికి గురయ్యారు.
అద్దెకున్న వారిపై ప్రతాపం
దుకాణదారుల్లో ఎక్కువ మంది స్థలాలను అద్దెకు తీసుకుని వ్యాపారాలు చేస్తున్నవారే. వీరు నెలనెలా భూయజమానులకు అద్దెలు చెల్లిస్తున్నారు. ఆయా స్థలాల స్వాధీనానికి మొదట యజమానులతో చెప్పించి, తర్వాతే తమను ఖాళీ చేయించాలిగానీ ఏకపక్షంగా దుకాణాలను ధ్వంసం చేశారని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దుకాణాలను మరో ప్రాంతానికి తరలించుకుని, వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ధ్వంసం చేయడం దారుణమని మండిపడుతున్నారు. తమ జీవితాలను మళ్లీ సున్నా నుంచి ప్రారంభించాల్సి వస్తుందని వాపోతున్నారు. తమ పిల్లలను ఎలా పెంచుకునేదంటూ ప్రశ్నిస్తున్నారు. బాధితులను తెదేపా, జనసేన నేతలు పరామర్శించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని 1.02 ఎకరాల భూమిలో దశాబ్దాలపాటు పశువుల్ని పెంచుకున్న కుంచం అప్పారావు సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాల్లోనూ కేసు గెలిచారు. అప్పారావు తన వాటాను 9 మంది పిల్లలకు పంచారు. వారిలో కొందరు స్థలాలను విక్రయించుకోగా, మరికొందరు నేటికీ వాటిపై వచ్చే అద్దెతోనే జీవిస్తున్నారు.
80 ఏళ్ల వయస్సులో గుండె ఆగిపోయేంత పనిచేశారు
మా తండ్రి అప్పారావు సుప్రీంకోర్టువరకు వెళ్లి పోరాడి భూమిని దక్కించుకున్నారు. నా వాటాగా 350 చదరపు గజాలు ఇచ్చారు. అందులో రెండు దుకాణాలు వేసుకున్నాను. నా కుమార్తె దగ్గర ఉంటూ ఆ దుకాణాల మీద వచ్చే అద్దెలతోనే జీవిస్తున్నా. ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్న భూమిని ఆక్రమణ అంటుంటే గుండెపోటు వచ్చినంత పనైంది.
- సూర్యకాంతం, బాధితురాలు
అవన్నీ విశ్వవిద్యాలయం భూములే
- ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, వీసీ, ఆంధ్ర వర్సిటీ
రికార్డుల ప్రకారం మా వర్సిటీ భూముల్లో ఉన్న ఆక్రమణలనే తొలగించాం. వాటిపై కొన్నేళ్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. నేను వీసీ కాకముందు పలువురు రిజిస్ట్రార్లు విన్నవిస్తూనే వచ్చారు. 1930 నుంచి ఆయా భూములన్నీ ఏయూవేనని నిరూపించే పత్రాలు, చిత్రపటాలతో సహా అన్నీ మావద్ద ఉన్నాయి.
విధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది?
- వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే, విశాఖ తూర్పు
ఆంధ్ర విశ్వవిద్యాలయ భూముల్లో ఆక్రమణలుంటే ముందుగా నోటీసులివ్వాలి. వారి సామగ్రిని తరలించుకోవడానికి అవకాశమివ్వాలి. అలా చేయకుండా దుకాణాలను ఏకపక్షంగా తొలగించారు. ఇది వ్యాపారులపై కక్షకట్టి చేసినట్లుగానే ఉంది. దుకాణాల్లోని సామగ్రి మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఇదెక్కడి న్యాయం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్