AP High Court: ఆ భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదు

రాజధాని అమరావతిలో నిర్దిష్ట అవసరాల కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 11 Nov 2022 09:36 IST

ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఒకటి కాదు
రాజధాని అమరావతి భూముల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు కేసు విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు
5% భూమిలోనే స్థలాలిస్తున్నామన్న అదనపు ఏజీ
విచారణ నేటికి వాయిదా

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో నిర్దిష్ట అవసరాల కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల మేరకు 5% భూమిలో ఇళ్ల నిర్మాణానికి వెసులుబాటు ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. రాజధాని అమరావతిలో... రాజధానేతర ప్రాంతవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని భూసమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం పానకాల రెడ్డి, రైతు ఎ.నందకిశోర్‌లు వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. వీటిపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘రాజధాని అమరావతి పరిధిలో ఇళ్ల స్థలాలిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. సీఆర్‌డీఏతో జరిగిన ఒప్పంద ప్రకారం భూములపై హక్కులను కోల్పోవడానికి రైతులు అంగీకరించారు. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని కోరే హక్కు మాత్రమే వారికి ఉంటుంది. రైతులకు ప్లాట్లు ఇచ్చాకే రాజధానిలో భూమిని ఇతర నిర్మాణాల కోసం వినియోగించాలంటే ఎలా? హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాలు ఇప్పటికే జరిగాయి. హ్యాపీనెస్ట్‌ పేరుతో ఉన్నత వర్గాల కోసం ఇళ్ల ప్రాజెక్టు తలపెట్టినప్పుడు ఏ ఒక్కరూ అభ్యంతరం తెలపలేదు’ అని గుర్తుచేశారు. ధర్మాసనం స్పందిస్తూ... ‘అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు సీఆర్‌డీఏకు చట్టబద్ధత కల్పించి, భూములను సమీకరించారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లు చేస్తున్న వాదనలకు మీరేం సమాధానం చెబుతారు? సీఆర్‌డీఏ, ప్రభుత్వం రెండూ వేర్వేరు. నిర్దిష్ట అవసరం కోసం రైతులు ఇచ్చిన భూమిని ఇతరులకు ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదు. పేదలకు ఇళ్లస్థలాలను ఇచ్చేందుకు భూమి కేటాయించాలని సీఆర్‌డీఏను ప్రభుత్వం ఎలా ఆదేశిస్తుంది? ఈ వ్యాజ్యాల్లో కౌంటర్‌ వేసేందుకు ఎంత సమయం కావాలి’ అని ఏఏజీని కోరింది. నాలుగు వారాలు సమయమివ్వాలని ఏఏజీ కోరగా... అప్పటివరకు ముందుకెళ్లకుండా ఉండగలరా? అని ప్రశ్నించింది. ఏఏజీ బదులిస్తూ... తాము చేపట్టే చర్యలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉండేలని ఆదేశాలిస్తే అభ్యంతరం లేదన్నారు. కోర్టు సమయం ముగియడంతో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు రైతుల తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ... ‘సీఆర్‌డీఏ ప్రధాన చట్టానికి తూట్లు పొడిచేలా సవరణ చట్టం చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ మార్చే అధికారం ప్రభుత్వానికి, సీఆర్‌డీఏలకు లేదు’ అని స్పష్టంచేశారు.


ఆ అధికారం మేజిస్ట్రేట్లకు ఎక్కడిది?
నిందితులపై పెట్టిన సెక్షన్లు వర్తించవని ఎలా అంటారని హైకోర్టు ప్రశ్న

ఈనాడు, అమరావతి: రిమాండ్‌ సమయంలో నిందితులపై నమోదు చేసిన ఫలాన సెక్షన్లు వర్తించవని చెప్పే అధికారం మేజిస్ట్రేట్లకు ఎక్కడ ఉందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామంది. నిందితుల తరఫు న్యాయవాదులు కౌంటర్లు వేసేందుకు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. నర్సీపట్నంలోని ఇంటి స్థలం వ్యవహారంలో ఫోర్జరీ ఎన్‌వోసీ సృష్టించారనే ఆరోపణతో సీఐడీ కేసు నమోదు చేసి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను అరెస్టు చేసింది. ఈనెల 3న విశాఖలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు జ్యుడిషియల్‌ రిమాండ్‌ నిమిత్తం హాజరు పరిచింది. ఐపీసీ సెక్షన్‌ 467 (వాల్యూబుల్‌ సెక్యూరిటీ ఫోర్జరీ) కింద కేసు నమోదు చేయడం తగదని మేజిస్ట్రేట్‌ ఆక్షేపించారు. మిగిలిన సెక్షన్ల విషయంలో 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేశారు. రిమాండును తిరస్కరించారు. దాంతో సీఐడీ హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. మరోవైపు రాజధానిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో పలువురి రిమాండును తిరస్కరిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపైనా సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. గురువారం జరిగిన విచారణలో తెదేపా నేత అయ్యన్న పాత్రుడు తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ... సెక్షన్‌ 467 వర్తించదంటూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. రాజధానిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారి తరఫు న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, ఎం.లక్ష్మీనారాయణ, సువ్వారి శ్రీనివాసరావు, కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... రిమాండ్‌ సమయంలో మేజిస్ట్రేట్‌లు యాంత్రికంగా వ్యవహరించకూడదన్నారు. వారి ముందున్న రికార్డులను పరిశీలించి రిమాండ్‌ తిరస్కరించాలా? లేదా? అనే వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఉంటుందని, ఇదే విషయాన్ని హైకోర్టు గతంలో ఓ తీర్పులో ప్రస్తావించిందని పేర్కొన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు