Yogi Vemana University: అందరికీ కనిపించాలనే ఆ విగ్రహాన్ని మార్చాం: వీసీ

విలువలు, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించుకోవడంలో యోగి వేమన విశ్వవిద్యాలయం నిబద్ధతతో ఉందని ఉపకులపతి సూర్యకళావతి తెలిపారు.

Updated : 11 Nov 2022 12:04 IST

యోవేవి (కడప), న్యూస్‌టుడే: విలువలు, సంప్రదాయాలు, సంస్కృతిని పరిరక్షించుకోవడంలో యోగి వేమన విశ్వవిద్యాలయం నిబద్ధతతో ఉందని ఉపకులపతి సూర్యకళావతి తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలోని ప్రధాన పరిపాలన భవనం ముందున్న యోగి వేమన విగ్రహాన్ని తొలగించి ఆ ప్రదేశంలో వైయస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారని గురువారం పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆమె స్పందించారు. వేమన విగ్రహం అందరికీ కనిపించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఆర్చివద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఇది ఆచార్యులు, సిబ్బంది సమష్టి నిర్ణయమని వెల్లడించారు. వేమన ప్రాముఖ్యతను కించపరిచే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. వేమన పీఠం ఎత్తు పెంచాలని వివిధ సంఘాలు ఇస్తున్న వినతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.


దిగ్భ్రాంతి కలిగించింది
మండలి బుద్ధప్రసాద్‌

అవనిగడ్డ, న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహాన్ని తొలగించి రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వేమన పేరుతో వర్సిటీని ఏర్పాటు చేసి, వేమన విగ్రహాన్ని నెలకొల్పారని చెప్పారు. నేడు ఆ విగ్రహాన్ని తొలగించి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అదే స్థానంలో ఏర్పాటు చేయడం తెలుగు జాతిని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. వేమన వంటి మహనీయులకు ఈ దుస్థితి కలుగుతుందని ఎన్నడూ ఊహించలేదని.. కొత్త విగ్రహాలు నెలకొల్పకపోగా ఉన్న వాటిని తొలగించడం బాధాకరమని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని