Rushikonda: ‘కొండ’కావరం

రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారన్న ఆరోపణపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని... ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు.

Updated : 12 Nov 2022 07:23 IST

రుషికొండలో నిబంధనల ఉల్లంఘనల పర్వం
అతిక్రమణలు లేవంటూ తొలుత బుకాయింపు
3.86 ఎకరాలు అదనంగా తవ్వేశామంటూ ఆనక ఒప్పుకోలు
ఎన్ని ఎకరాలైనా ఆక్రమిస్తామనేలా రాష్ట్ర ప్రభుత్వం తీరు
కేంద్ర బృందానికి ఏమి చూపించనుందో మరి!

ఈనాడు, విశాఖపట్నం, అమరావతి: రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నారన్న ఆరోపణపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని... ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇప్పటికిప్పుడు రోడ్డు విస్తరించాల్సిన అవసరం లేకపోయినా... ఆ పేరుతో సామాన్యుల ఇళ్ల ప్రహరీలను నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు విపక్ష నేత అయ్యన్నపాత్రుడిపైనా... మరో ప్రతిపక్ష పార్టీ సమావేశానికి స్థలం ఇచ్చారన్న కారణంతో కక్షగట్టి సామాన్యుల ఇళ్ల ప్రహరీలపైనా ప్రతాపం చూపిన ప్రభుత్వం... తాను మాత్రం విశాఖలోని రుషికొండపై ఆక్రమణలకు, ఉల్లంఘనలకు, ప్రకృతి హననానికి పాల్పడుతోంది. నిబంధనలకు పాతరేసి... అడ్డగోలుగా ఎకరాలకు ఎకరాలు అక్రమంగా తవ్వేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 9.88 ఎకరాలకు అనుమతిస్తే... అదనంగా 3.86 ఎకరాలు తవ్వేశామని ప్రభుత్వమే స్వయంగా కోర్టుకి చెప్పింది..! దీన్ని ఏమనాలి? లెక్కలేనితనమా? ఏం చేసినా... విశాఖ ప్రజలు భరిస్తారన్న తెంపరితనమా? ప్రభుత్వం రుషికొండపై రిసార్టుల పునరుద్ధరణ పేరుతో చేపట్టిన ఈ ‘రహస్య ప్రాజెక్టు’లో అన్నీ లొసుగులే. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఇంతగా నిబంధనలు ఉల్లంఘించిన, ఆరోపణలు ముప్పిరిగొన్న ప్రాజెక్టు మరొకటి లేదు. తప్పుడు సమాచారంతో అనుమతులు పొందడం, పరిమితుల్ని దాటి అక్రమ తవ్వకాలు చేయడం, పర్యావరణ ప్రాజెక్టని చెప్పి.... దానికి ఏమాత్రం పొంతనలేని ఆకృతులను ప్లాన్‌ కోసం సమర్పించడం, స్థానిక సంస్థలకు ఫీజు చెల్లించకపోవడం... ఇలా అన్నీ ఉల్లంఘనలే..!

రుషికొండపై జరిగిన అవకతవకలకు సంబంధించి లోతైన దర్యాప్తు జరిగితే కనీసం ఐదారుగురు ఐఏఎస్‌ అధికారులు, 15-20 మంది దిగువస్థాయి అధికారులు ఇరుక్కోవడం ఖాయం. అబద్ధాల పునాదుల మీద ఆ ప్రాజెక్టుని నిర్మిస్తూ... ఇన్నాళ్లూ ఎలాంటి తప్పూ జరగలేదని బుకాయిస్తూ వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం ఈ నెల 3న హైకోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో మాత్రం జరిగిన తప్పును అంగీకరించింది. 3.86 ఎకరాల మేర మాత్రమే అదనంగా తవ్వామని కోర్టుకి చెప్పినా... వాస్తవానికి అక్కడ మరో 20 ఎకరాలకుపైగా కొండను తవ్వేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఆర్‌జడ్‌ (కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌)  నిబంధనల్నీ ప్రభుత్వం ఉల్లంఘించింది. రుషికొండపై ఎలాంటి అక్రమాలు జరిగాయో నిగ్గు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అధికారి నేతృత్వంలో నిపుణుల బృందం సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ బృందం త్వరలో క్షేత్రస్థాయి పరిశీలనకు రాబోతోంది. రుషికొండపై జరిగిన ఉల్లంఘనలు, అక్రమాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇప్పటి వరకు... అదేదో దేశ భద్రతకు సంబంధించిన రక్షణరంగ ప్రాజెక్టు అన్నట్టుగా అత్యంత రహస్యంగా ఉంచింది. ప్రతిపక్ష నాయకుల్ని, మీడియా ప్రతినిధుల్ని ఆ ఛాయలకు కూడా రాకుండా ఆంక్షలు విధించింది. ఇప్పుడు కేంద్ర బృందం వస్తున్న నేపథ్యంలో... ఇప్పటి వరకు రుషికొండ ప్రాజెక్టుకి సంబంధించి ఏం జరిగిందో, ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో చూద్దాం...!

9.88 ఎకరాలకు కేంద్రం అనుమతి... 65 ఎకరాల్లో ప్రాజెక్టు

రుషికొండపై 65 ఎకరాల్లో విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా రూ.230 కోట్లతో ‘సమీకృత పర్యాటక సముదాయం’ నిర్మిస్తామని ఏపీటీడీసీ మొదట చెప్పింది. తొలిదశలో రూ.92 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తిగల సంస్థలు ప్రతిపాదనలతో ముందుకు రావాలని 2021 జనవరిలో రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) విడుదల చేసింది. ఎవరూ ఆసక్తి చూపలేదంటూ ఫిబ్రవరిలో దాన్ని ఉపసంహరించుకుంది. అనంతరం 2021 జులైలో రుషికొండపై రిసార్టు పునరుద్ధరణ (రీడెవలప్‌మెంట్‌ ఆఫ్‌ రిసార్టు ఎట్‌ రుషికొండ) ప్రాజెక్టు పేరుతో మొదటి, రెండో దశ పనులకు ఏపీటీడీసీ టెండర్లు పిలిచింది. ‘డీఈసీ’ అనే నిర్మాణ సంస్థ ఈ పనులు దక్కించుకుంది. ఆ సంస్థలో వైకాపా పెద్దలకు భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీటీడీసీ 9.88 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుని, 65 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతామంటూ జీవీఎంసీని ప్లాన్‌కి అనుమతులు కోరింది. జీవీఎంసీ కూడా 65 ఎకరాలకు అనుమతులిచ్చేసింది.

అనుమతులు తీసుకోవాలని గుర్తులేదా?

రుషికొండపై అప్పటికే ఉన్న భవనాలను కూల్చేసి, జీవీఎంసీ అనుమతి లేకుండానే నిర్మాణాలు ప్రారంభించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌కి పైకప్పు కూడా వేశాక... ప్రతిపక్షాలు కోర్టుకి వెళ్లడంతో, అప్పుడు అనుమతి కోసం జీవీఎంసీకి ఏపీటీడీసీ దరఖాస్తు చేసింది.

పర్యాటక ప్రాజెక్టు కడుతున్నామని చెబుతూ...  జీవీఎంసీకి కార్యాలయ భవనాలను పోలిన ఆకృతుల్ని ఏపీటీడీసీ సమర్పించింది. తాను జారీ చేసిన అనుమతుల్లోనూ జీవీఎంసీ వాటిని పరిపాలన భవనాలుగానే పేర్కొంది.

ఏ నిర్మాణం చేపట్టాలన్నా అన్ని అనుమతి పత్రాలు సమర్పిస్తేనే జీవీఎంసీ ప్లాన్‌ మంజూరు చేస్తుంది. రుషికొండ ప్రాజెక్టుకి మాత్రం... ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం సమర్పించే నాటికి పెండింగ్‌ పత్రాలు, ఫీజులు చెల్లిస్తే చాలంది. 65 ఎకరాల్లో భవనాల నిర్మాణ అనుమతులకు సంబంధించి రూ.19 కోట్ల ఫీజుని ఐదేళ్లలో విడతల వారీగా చెల్లించేలా వెసులుబాటు ఇచ్చింది.

రుషికొండపై ఏపీటీడీసీకి ఎంత భూమి ఉందన్న విషయంలోనూ స్పష్టత లేదు. ‘మీభూమి’ గ్రామ రికార్డు ప్రకారం సర్వే నంబరు 19లో 85.2 ఎకరాలు ఉన్నాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమర్పించిన వివరాల్లో 61 ఎకరాలుగా పేర్కొన్నారు. ఏపీటీడీసీ దస్త్రాల్లో 65 ఎకరాలుగా తెలిపారు.

యథేచ్ఛగా తవ్వకాలు

9.88 ఎకరాల్లో ప్రాజెక్టుకి ఏపీటీడీసీ అనుమతి తీసుకుంది. క్షేత్రస్థాయిలో దీనికి రెండింతల తవ్వకాలు జరిగినట్లు కనిపిస్తోంది.

తవ్విన మట్టిని అక్కడే ఉంచాలి. లేకుంటే మరేచోట నిల్వ చేసి మళ్లీ ఇక్కడి అవసరాలకు వినియోగించాలి. అందుకు విరుద్ధంగా గ్రావెల్‌ను బీచ్‌ రోడ్డులోని ఏపీటీడీసీకి చెందిన స్థలాలను చదును చేయడానికి వినియోగించారు. వేల టన్నుల మట్టిని బీచ్‌లో డంపు చేయడంతో అక్కడ సహజ వాతావరణం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సీఆర్‌జడ్‌కు చేసిన దరఖాస్తులో కొత్త మాస్టర్‌ప్లాన్‌ నిబంధనల ప్రకారం అనుమతి కోరారు. కానీ అప్పటికి అది అమల్లోకి రాలేదు.

గతంలో హైకోర్టు ఆదేశాలు, సీఆర్‌జడ్‌ నిబంధనల ప్రకారం ఆ ఏరియాలో భూగర్భ జలవనరులను వినియోగించకూడదు. ఇప్పటికే ఉన్న బోర్లనూ వాడరాదు. ప్రస్తుతం అక్కడ భూగర్భ జలాలను ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. సీఆర్‌జడ్‌ పరిధిలో గుత్తేదారు లేబర్‌ క్యాంపు నిర్వహించడమూ నిబంధనలకు విరుద్ధమే.

పాత భవనాలున్న చోట మాత్రమే కొత్తవి నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి. గతంలో   నిర్మాణాలు లేనిచోట నాలుగు భవనాలను శరవేగంగా నిర్మిస్తున్నారు.

ష్‌... అంతా రహస్యమే

ప్రాజెక్టు దగ్గరకు ఎవరూ వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పోలీసు అవుట్‌ పోస్టునూ ఏర్పాటు చేసింది. అక్టోబరు 28న ప్రధాన ప్రతిపక్షం తెదేపా... రుషికొండ పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించగా 2000 మంది పోలీసులతో విశాఖలో నిఘా పెట్టి... కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేసింది. మూడు నెలల క్రితం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ రుషికొండ పర్యటనను కూడా ప్రభుత్వం అడ్డుకుంది. నారాయణను అనుమతించాలని హైకోర్టు ఆదేశించినా... ప్రభుత్వం పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలు వచ్చిన 70 రోజుల తర్వాత నారాయణకు అనుమతిస్తూ లేఖ రాసింది. అప్పటికి ఆయన విదేశాల్లో ఉన్నారు.


ముఖ్యమంత్రి కోసమేనంటున్న మంత్రులు

రుషికొండపై చేపట్టింది పర్యాటక ప్రాజెక్టని ఏపీటీడీసీ బయటకు చెబుతున్నా... సీఎం క్యాంప్‌ కార్యాలయం కోసమే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మొదటి నుంచీ వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే... అది నిజమేనని రూఢీ అవుతోంది. ‘ముఖ్యమంత్రి కోసమే రుషికొండ ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో తప్పేంటి. రాష్ట ప్రజల ప్రతినిధిగా సీఎం ఎక్కడైనా ఉంటారు’ అని మరో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అక్టోబరు 27న విలేకరుల సమావేశంలో లోగుట్టు బయటపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని