Polavaram project: పోలవరంలో అధనపు ఎత్తిపోత!

పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట, డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో ఇప్పటికీ ఎలాంటి పనులూ చేసే పరిస్థితులు లేవు.

Updated : 13 Nov 2022 06:13 IST

2 టీఎంసీలకుపైగా నీళ్లను ఖాళీ చేయాలి
పెద్ద ఎత్తున పంపులు, మోటార్లు అవసరం
దిగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేయకపోవడమే కారణం
మరో 2 నెలలు కీలక పనులకు ఇబ్బందులే..

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట, డయాఫ్రం వాల్‌ ప్రాంతంలో ఇప్పటికీ ఎలాంటి పనులూ చేసే పరిస్థితులు లేవు. వర్షాలు తగ్గి, వరద ప్రవాహం మందగించినా ఆ ప్రాంతమంతా వరద నీటితో నిండి ఉంది. అదనంగా ఖర్చు పెట్టి ఆ నీళ్లన్నీ బయటికి ఎత్తిపోస్తే గానీ పనులు చేపట్టే అవకాశమే లేదు. మేఘా సంస్థ, ఏపీ జల వనరులశాఖలు సకాలంలో దిగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేయలేకపోవడంతోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. 2020 భారీ వరదలు, కోత సమస్యలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్దేశించిన గడువులోపు కూడా దిగువ కాఫర్‌ డ్యాంను పూర్తి చేయలేదని పోలవరం అథారిటీ సైతం తప్పు పట్టింది. 2022 మే నుంచి  జులై లోపు అనేకసార్లు తాము సమీక్షించి, హెచ్చరించినా పని పూర్తి చేయలేదని, ఆ ప్రభావం రాబోయే రోజుల్లో ప్రాజెక్టు భవితవ్యంపై కూడా పడుతుందని అథారిటీ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఆ పరిణామాలు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. 2022 జులై నాటికి దిగువ కాఫర్‌ డ్యాం పూర్తి చేయలేకపోగా కనీసం రక్షిత స్థాయికి తీసుకురాలేకపోయారు. ఫలితంగా వరద నీరు దిగువ వైపు నుంచి వెనక్కు మళ్లి ఎగువ కాఫర్‌ డ్యాం వరకు ముంచెత్తింది. దిగువ కాఫర్‌ డ్యాం సకాలంలో నిర్మించి ఉంటే ఆ ప్రాంతంలో వరద నీరు చేరేది కాదు. గోదావరి వరదల సమయంలోనూ పనులు చేసేందుకు వీలుండేది. ఇప్పుడు వర్షాకాలం దాటినా పనులకు అవకాశం లేకుండా పోయింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఉన్న నీటిని ఎత్తిపోయడానికి నెల రోజులు పడుతుందని అధికారులే చెబుతున్నారు. రెండు నెలలు పట్టవచ్చనేది అనధికారిక సమాచారం.

2 టీఎంసీలకు పైగా నీళ్లు

పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం నిపుణులు గత వారం సందర్శించారు. ఆ సమయంలో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య 2.2 టీఎంసీల నీరు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పుడు ఆ నీటిని ఎత్తిపోయడానికి అదనంగా ఖర్చవుతుంది. ఇందుకు దాదాపు 80 హెచ్‌పీ విద్యుత్తు మోటార్లు, పంపులు వినియోగించాల్సి ఉందని అంచనాలు వేశారు. దాదాపు 70 నుంచి 80 విద్యుత్తు మోటార్లు వినియోగించి ఆ నీటిని ఎత్తి పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నీరంతా ఎత్తిపోస్తే తప్ప కీలక పనుల్లో అడుగు ముందుకు పడే పరిస్థితి లేదు.

2019 నవంబరులో పనులు చేపట్టినా..

రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గుత్తేదారును మార్చి మేఘా సంస్థకు అప్పగించారు. దిగువ కాఫర్‌ డ్యాం నిర్మాణంలో మొత్తం 25.46 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పని చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే పనులు ప్రారంభించి, 3.37 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర చేశారు. మిగిలిన 22.09 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిని నవంబర్‌లో ప్రారంభించిన గుత్తేదారు మూడేళ్లవుతున్నా పూర్తి చేయలేదు.

తప్పు పట్టిన పోలవరం అథారిటీ

పోలవరం ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంను 2020 నవంబరులో ప్రారంభించి 2021 జులై నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. 2020లో వరదలకు భారీ కోత ఏర్పడటంతో ఆ గడువు లోపు పూర్తి కాలేదనుకున్నా.. 2022 జులై నాటికి పెంచిన గడువులోపు పూర్తి చేయలేకపోయారని పోలవరం అథారిటీ తప్పు పట్టింది. తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ హెచ్చరించినా పనులు ప్రణాళికాబద్ధంగా చేయలేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని