PM modi: మీతో అనుబంధం.. రాజకీయాలకు అతీతం

‘కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో (ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి) మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం.

Updated : 13 Nov 2022 06:23 IST

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు.. ఉండదు... ఉండబోదు
ప్రధాని మోదీని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలు

ఈనాడు- విశాఖపట్నం, అమరావతి: ‘కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో (ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి) మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకు అతీతం. మా రాష్ట్ర ప్రయోజనాలుతప్ప మాకు మరో ఎజెండా లేదు. ఉండదు. ఉండబోదు సార్‌’ అని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఎనిమిదేళ్ల కిందట తగిలిన అతి పెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. ఆ గాయాలు మానేలా.. విశాల హృదయంతో మీరు చేసే ప్రతి సాయమూ, ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థా, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయీ మా రాష్ట్ర పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడతాయి. మా రాష్ట్రం, మా ప్రజల కోసం మీరు చేసే ఏ మంచినైనా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను గుర్తు పెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు... మీరు మాపై పెద్ద మనసు చూపితే దానినీ గుర్తుపెట్టుకుంటారు’ అని విన్నవించారు. విశాఖపట్నం సభలో శనివారం ఆయన ప్రసంగించారు. విభజన హామీలు, పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్‌ తదితర అంశాలపై ఇప్పుడు, ఇంతకుముందూ వివిధ సందర్భాల్లో ఇచ్చిన వినతులను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటన్నింటినీ పరిష్కరించాలని ప్రధాన మంత్రిని జగన్‌ కోరారు. ‘రూ.10,740 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున నిండు మనసుతో కృతజ్ఞతలు చెబుతున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ రెండు చేతులు పైకెత్తి ప్రధానికి నమస్కరించారు.

వికేంద్రీకరణ ప్రాధాన్యంగా అడుగులు వేశాం

‘మూడున్నరేళ్లలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత, గడప వద్దకే పరిపాలన, పిల్లల చదువులు, ప్రజలందరికీ వైద్యం, ఆరోగ్యం, రైతులు, మహిళల సంక్షేమం, సామాజిక న్యాయం వంటివి ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకోవడం అంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి... ఇంటింటా ఆత్మవిశ్వాసం నింపాం. మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయినీ సద్వినియోగం చేశాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తి మేరకు మేము చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు, సహృదయులైన మీరు (మోదిని ఉద్దేశించి) మీ సహాయ, సహకారాలను మరింతగా అందించి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా. మంచి చేసే మా ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు (మోదీ వైపు తిరిగి నమస్కరిస్తూ) ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా’ అని జగన్‌ పేర్కొన్నారు.

కెరటాలకు మించి జనకెరటం

‘చారిత్రక ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం కనిపిస్తున్నాయి. కార్తిక పౌర్ణమివేళ ఎగిసిపడిన కెరటాలకు మించి ఈ రోజు జన కెరటం ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కనిపిస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే ప్రజా కవి, గాయకుడు వంగపండు పాడిన ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ పాట గుర్తుకొస్తొంది. ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదలివచ్చారు. ఇదే నేలపై నడయాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే.. ‘వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌.. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్‌’ అంటూ కదలివచ్చిన లక్షల జన సందోహం మన ఎదుట కనిపిస్తోంది. ‘దేశమంటే మట్టి కాదోయ్‌... దేశమంటే మనుషులోయ్‌’ అన్న గురజాడ మాటలు మనందరికీ కర్తవ్యబోధ చేస్తున్నాయి. ప్రజాభిమానంతోపాటు వారి ఆకాంక్షలకు ఇక్కడకు వచ్చిన జన సాగరం అద్దం పడుతోంది’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

సాంతం సాగిలపడుతూ...

విశాఖ సభలో సీఎం జగన్‌ ప్రసంగం సాంతం ప్రధాన మంత్రికి సాగిలపడుతూ సాగింది. ఆయన ప్రసంగంలో పదేపదే ప్రధాని మోదీని ఉద్దేశించి ‘సార్‌.... సార్‌ .. సార్‌’ అంటూ సంబోధించారు. పెద్ద మనసుతో, విశాల హృదయంతో తమ సమస్యలు, వినతులు పరిష్కరించాలంటూ వేడుకున్నారు. ప్రసంగంలో మోదీకి రెండు సార్లు చేతులెత్తి నమస్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు