Amaravati: మా ప్రమేయం లేకుండా మార్పులేంటి?: సీఆర్‌డీఏ అధికారులను నిలదీసిన రైతులు

కొత్త జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేకాధికారులకు ఏం అధికారాలున్నాయని ప్రతిపాదిస్తారని, వాటికి ప్రభుత్వం ఎలా ఆమోద ముద్ర వేస్తుందని రాజధాని రైతులు, మహిళలు.. సీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు.

Updated : 17 Nov 2022 07:44 IST

ఈనాడు, అమరావతి: కొత్త జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేకాధికారులకు ఏం అధికారాలున్నాయని ప్రతిపాదిస్తారని, వాటికి ప్రభుత్వం ఎలా ఆమోద ముద్ర వేస్తుందని రాజధాని రైతులు, మహిళలు.. సీఆర్‌డీఏ అధికారులను నిలదీశారు. మాస్టర్‌ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయాలన్నా రైతుల అభిప్రాయాలు తప్పనిసరని చెప్పారు. తమ ప్రమేయం లేకుండా ఇష్టానుసారం సవరణలు చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పటికే గ్రామసభల ద్వారా ఆర్‌-5 జోన్‌ ఏర్పాటును వ్యతిరేకించామని, అయినా దీనిపై ఇంకా నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. బృహత్‌ ప్రణాళికలో మార్పులపై అభ్యంతరాలు సమర్పించిన రైతుల అభిప్రాయాలను వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు అధికారులు సభలను నిర్వహిస్తున్నారు. విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో మూడో రోజు బుధవారం ఇవి కొనసాగాయి. నోటీసులు అందుకున్న రాజధాని గ్రామాల్లోని రైతులు, మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూ సమీకరణ పూర్తి కాకుండానే ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, న్యాయస్థానం అనుమతి లేకుండా ప్రణాళికలో మార్పు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ‘రాజధానిలో సమీకరించిన భూముల్లో 5 శాతం పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కేటాయించారు. అందులో మిగిలిన భూమిని రాజధానిలో నివాసం ఉండేందుకు వచ్చే నిరుపేదలకు గృహాలు కట్టించి ఇచ్చేందుకు రిజర్వు చేశారు. దీనికి వ్యతిరేకంగా చట్ట సవరణలు చేయడం రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే’ అని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లోనే ఉందని, ఈ నేపథ్యంలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయం చెల్లదన్నారు. దీనికి ప్రతిపాదించిన ప్రాంతాన్ని కాలుష్య రహిత పరిశ్రమల కోసం ఉద్దేశించారని రైతులు గుర్తు చేశారు. అక్కడ నివాసం ఉండేందుకు పనికిరాదని, ఇష్టారీతిన మార్చడంవల్ల పరిశ్రమలు రాకుండా పోతే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని