AP news: తరం..తరిగిపోతోంది!

రాష్ట్రంలో ప్రతి 1000 మంది జనాభాలో నాలుగేళ్లు, ఆ లోపు పిల్లల సంఖ్య 53 మాత్రమే. అదే బిహార్‌లో 110, ఉత్తరాఖండ్‌లో 101 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 14, ఆ లోపు వయసున్న బాలల సంఖ్య ప్రతి 1000 మంది జనాభాలో 190 మాత్రమే.

Updated : 20 Nov 2022 06:44 IST

చిన్నారులు, బాలల్లో దేశంలోనే అట్టడుగున ఆంధ్రప్రదేశ్‌  
దేశ సగటు కంటే తక్కువ  
2019తో పోలిస్తే 2020లో మరింత కిందకు  
ఉద్యోగాలు, ఉపాధి లేక.. వలసబాటలో యువత  
రాబోయే రోజుల్లో వృద్ధాంధ్రప్రదేశ్‌!

రాష్ట్రంలో ప్రతి 1000 మంది జనాభాలో నాలుగేళ్లు, ఆ లోపు పిల్లల సంఖ్య 53 మాత్రమే. అదే బిహార్‌లో 110, ఉత్తరాఖండ్‌లో 101 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 14, ఆ లోపు వయసున్న బాలల సంఖ్య ప్రతి 1000 మంది జనాభాలో 190 మాత్రమే. అదే బిహార్‌లో 330, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లలో 285 మంది చొప్పున ఉన్నారు. దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే బాలలు, చిన్నారుల శాతం తక్కువగా ఉంది. నేటి బాలలే లేకపోతే.. ఇక రేపటి పౌరులెక్కడ?

పల్లెలు, పట్టణాల్లో ఏవైనా వేడుకలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించినా 90% మంది వయసు మళ్లిన వారే కనిపిస్తున్నారు. యువకుల సంఖ్య 10% కూడా ఉండటం లేదు.

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో కొత్త తరం తరిగిపోతోంది. చిన్నారులు, బాలల శాతం ఏటికేడు పడిపోతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే బాలల శాతం అత్యంత తక్కువగా ఉండటం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.  నాలుగేళ్లు, అంతకంటే తక్కువ వయసున్న చిన్నారులు, 14 ఏళ్లు, ఆలోపు వయసున్న బాలల్లో దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలోనే  కొనసాగుతోంది. పెళ్లీడుకు వచ్చిన యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం పల్లెలు, పట్టణాలను విడిచిపోతుంటే.. ఇక పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? పరిశ్రమలే లేకుంటే ఉద్యోగాలు పెరిగే దెక్కడ? నిర్మాణరంగం కుదేలైతే ఉపాధి దొరికే దెక్కడ? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో కొంతమేర ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే అక్కడ ఫార్మారంగ పరిశ్రమలు ఉండటమే కారణం. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో వృద్ధాంధ్రప్రదేశ్‌గా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేంద్ర గణాంకశాఖ ఇటీవల విడుదల చేసిన ‘శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) గణాంక నివేదిక 2020’ ప్రకారం.. 0-4 ఏళ్ల చిన్నారులు దేశంలో సగటున 7.5% ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 5.3% మాత్రమే. 0-14 ఏళ్ల బాలలు దేశంలో సగటున 24.8% ఉంటే.. ఏపీలో 19% మంది ఉన్నారు.

జననాల రేటు కూడా దేశ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువే. అంటే పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది.

రాష్ట్రంలో 14 ఏళ్లు, ఆ లోపు బాలల్లో ఏటా 0.4% తగ్గుదల ఉన్నట్లు కొన్ని సర్వేలు పరిశీలిస్తే తెలుస్తుంది. 2018 నాటి సర్వేలో 19.8%, 2020 సర్వేలో 19% చొప్పున ఉన్నట్లు తేలింది. అంటే రెండేళ్లలో 0.8% తగ్గారు. ఇదే సమయంలో 20-39 ఏళ్ల మధ్య ఉన్న వారి శాతం 0.6% పెరిగింది. పట్టణాల్లో బాలల శాతం మరీ తక్కువగా ఉంది. 0-4 ఏళ్ల వయసు వారు గ్రామాల్లో మొత్తం జనాభాలో 5.4% మంది ఉంటే.. పట్టణాల్లో 5% మంది మాత్రమే. అందులో పట్టణ ప్రాంతాల్లో మగ పిల్లలు 4.9%, ఆడపిల్లలు 5.1% మంది ఉన్నట్లు సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆడ, మగపిల్లలు 5.4% చొప్పున సమానంగా ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత రాష్ట్రానికి వచ్చిన వారు కూడా.. రెండు మూడేళ్లుగా మళ్లీ ఉపాధి వెదుక్కుంటూ వెళ్లిపోయారు. విద్యాసంస్థలు ఏర్పాటు చేసినా.. వసతుల కల్పన లేకపోవడం, ఐటీ పరిశ్రమలు రాకపోవడంతో యువత ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. ఎక్కడైనా విద్యావంతుల్లో 25% నుంచి 30% యువత ఇతర ప్రాంతాలకు వెళ్లడం సహజమే, అయితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. పదోతరగతి చదువుకున్న వారు కూడా ఉపాధి వెదుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు పోతున్నారనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది.

వ్యవసాయం చేసే వారు, కూలీల్లో 80% నుంచి 90% మంది 45 ఏళ్లు పైబడిన వారే.. అక్కడా యువత శాతం తగ్గిపోతోంది.. ఉన్నత చదువులు, ఉద్యోగాలు వెదుక్కుంటూ వలసబాట పడుతున్నారు. అందుకే గ్రామాల్లోనూ పిల్లల శాతం పడిపోతోంది.


జననాలరేటు తగ్గుముఖం?

దేశంలో జనన రేటు 19.5 ఉండగా.. గ్రామాల్లో 21.1, పట్టణాల్లో 16.1 చొప్పున నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో సగటున జనన రేటు 15.7 మాత్రమే ఉంది. గ్రామాల్లో 16.0, పట్టణాల్లో 15.0 చొప్పున ఉంది. ఇది దేశ సగటు కంటే తక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008-10 నాటితో పోలిస్తే 2018-20 మధ్య జనన రేటు 11% తగ్గింది. జనన రేటు అత్యధికంగా బిహార్‌లో 25.5, ఉత్తరప్రదేశ్‌లో 25.1 ఉంది. అత్యల్పంగా కేరళలో 13.2, తమిళనాడులో 13.8 ఉందని సర్వేలో గుర్తించారు.


పరిశ్రమలు రాక, ఉద్యోగాలు దొరక్క

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన ఎండమావిగా తయారైంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అభివృద్ధి పడిపోయింది. దీంతో చాలామంది యువత వలస బాట పడుతున్నారు. వీరంతా పెళ్లిళ్లు చేసుకుని అక్కడే స్థిరపడుతున్నారు.. జననాలరేటు తగ్గడానికి ఇదీ ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఉన్నత చదువుల కోసం విదేశాల వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలో ఉంటే ఉద్యోగాలు కష్టమే అనే భావన యువతలో పెరుగుతోందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.


అమరావతి ఆపేయడంతో

అమరావతి అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇక్కడే వ్యాపారాలు, ఉపాధి చూసుకోవచ్చనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు కూడా అప్పట్లో తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. విదేశాల నుంచి కొందరు ఉద్యోగాలు మానుకుని వచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రకటన చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి తల్లకిందులైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారితోపాటు.. వ్యాపారాలు ప్రారంభించిన వారి ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ఇక్కడే ఉంటే తమతోపాటు పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందనే ఆలోచనతో.. చాలామంది మళ్లీ వెనక్కు వెళ్లిపోయారు. పిల్లల శాతం తగ్గడానికి ఇవన్నీ కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.


ఇలాగే ఉంటే గ్రామాల్లో వృద్ధులే

కొన్ని జిల్లాల్లోని గ్రామాల్లో అంతా వృద్ధులే కనిపిస్తున్నారు. పిల్లల్ని తీసుకుని వారి తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. వినియోగశక్తి పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. భవిష్యత్తు పరిణామాలను గుర్తెరిగి పరిస్థితి చక్కదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.


చదువులు, ఉద్యోగాల కోసం కొంతమంది ఊరొదిలిపోతున్నారు. ఇంకా ఎవరైనా కుర్రోళ్లు ఉంటే ఇక్కడ పనులు దొరక్క వాటిని వెదుక్కుంటూ ఎటో పోతున్నారు.. వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుని అక్కడే ఉంటారు. ఇక పిల్లలెక్కడి నుంచి వస్తారు? మేమేమైనా తయారు చేస్తామా? 

- బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో అంగన్‌వాడీ కార్యకర్త వ్యాఖ్య ఇది


ఉపాధి కల్పన పెంచాలి

- ఎంసీ దాస్‌, ఆర్థికరంగ నిపుణులు, విజయవాడ

రాష్ట్రమైనా, దేశమైనా అక్కడి యువతే వాటి శక్తి. వారు లేకుంటే ఆర్థికవ్యవస్థ పైనా ప్రభావం పడుతుంది. ఉత్పాదకత తగ్గుతుంది. అందుకే వృద్ధుల సంఖ్య అధికంగా ఉన్న దేశాలకు యువతను ఆహ్వానిస్తున్నారు. పిల్లల శాతం తగ్గుతుందంటే యువ జనాభా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడమే కారణం. కొందరు విదేశాలకూ వెళ్తున్నారు. ఈ కారణాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. దూరదృష్టితో వ్యవహరించాలి. యువతను ఇక్కడే నిలిపి ఉంచేలా జీవన పరిస్థితులను మెరుగు పరచాలి. ఉపాధి కల్పన పెంచాలి. రాజనీతిజ్ఞులు ముందు తరాల గురించి ఆలోచిస్తారు. రాజకీయ నేతలు రాబోయే ఎన్నికల కోణంలోనే పనిచేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని