Ongole: శ్మశాన భూమిని కబ్జా చేసిన వైకాపా నేత

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు హస్తగతం చేసుకోవాల్సిందే అన్నట్లు ఉంది అధికార పార్టీ నాయకుల తీరు.

Updated : 21 Nov 2022 08:22 IST

శవాలు పూడ్చిన స్థలం దున్ని మరీ సాగు
ప్రకాశం జిల్లాలో రూ.5 కోట్ల విలువైన భూమిపై పడగ

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు హస్తగతం చేసుకోవాల్సిందే అన్నట్లు ఉంది అధికార పార్టీ నాయకుల తీరు. గిరిజనులకు శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాన్నీ వదల్లేదు. ఏకంగా 100కు పైగా శవాలను పూడ్చిన స్థలం దున్నేసి మరీ పంటలు వేయడం చూసి స్థానికులు మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలో తాజాగా చోటుచేసుకున్న ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

పాతసింగరాయకొండలోని మల్లికార్జుననగర్‌, బాలిరెడ్డినగర్‌లలో వెయ్యికి పైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరిలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరిపేందుకు స్థలం లేక అవస్థలు పడేవారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో 2017లో సర్వే నంబరు 105లో 4.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి ఆ స్థలంలోనే ఖననం చేస్తున్నారు. పదహారో నంబరు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ భూమి మార్కెట్‌ విలువ ఎకరా రూ.కోటికి పైగానే ఉంటుంది. దీంతో సింగరాయకొండకు చెందిన వైకాపా నాయకుడు చాన్‌బాషా ఎలాగైనా దాన్ని కొట్టేయాలని నకిలీ పట్టా సృష్టించారు. ఆ భూమి తనదంటూ ప్రచారం ప్రారంభించారు. దీంతో గిరిజనులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కబ్జాదారు రెండు నెలల క్రితం ఆ స్థలంలో ఉన్న 100కు పైగా సమాధులను తవ్వేసి చదును చేసి మినుము పంట వేశారు. ఈ నెల 14న బాలిరెడ్డినగర్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్లిన స్థానికులు అక్కడి పంటను చూసి కంగుతిన్నారు. ఖననం చేయకుండా కబ్జాదారు అడ్డుకోవడంతో వారంతా పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. వారు వచ్చి దగ్గరుండి అంత్యక్రియలు చేయించారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాలతో ఆక్రమణదారునిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఒంగోలు అట్రాసిటీ కేసుల విచారణాధికారి జి.రామకృష్ణ తెలిపారు. విచారణ ముగిసిన వెంటనే నిందితుణ్ని అదుపులోకి తీసుకుంటామని సింగరాయకొండ సీఐ రంగనాథ్‌ చెప్పారు. అయితే నాయకుల ఒత్తిడితో పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అది ప్రభుత్వ భూమే: తహసీల్దార్‌ ఉష

‘గిరిజనులు శ్మశాన వాటికగా వినియోగిస్తున్న స్థలం రెవెన్యూ దస్త్రాల్లో ప్రభుత్వ భూమిగా ఉంది. ఎవరికీ పట్టాలు ఇవ్వలేదు. చాన్‌బాషా అనే వ్యక్తి షేక్‌ సుల్తాన్‌బీ పేరుతో నకిలీ పట్టా పుట్టించి ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేశారు. నకిలీపత్రాలతో కోర్టునూ ఆశ్రయించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో శ్మశానవాటికకు ఆ భూమి కేటాయించేందుకు కృషి చేస్తాం.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని