Narsapuram: నల్లదుస్తులతో వస్తే అనుమతి లేదు

నరసాపురంలో సోమవారం నిర్వహించిన సీఎం సభ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నల్ల దుస్తులు ధరించిన వారిని లోపలికి రానివ్వలేదు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను, నల్ల చున్నీలు ధరించిన యువతులు, మహిళలనూ అనుమతించలేదు. 

Updated : 22 Nov 2022 09:13 IST

సీఎం సభ వద్ద పోలీసుల అత్యుత్సాహం

ఈనాడు డిజిటల్‌, భీమవరం: నరసాపురంలో సోమవారం నిర్వహించిన సీఎం సభ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నల్ల దుస్తులు ధరించిన వారిని లోపలికి రానివ్వలేదు. బురఖాలు వేసుకున్న ముస్లిం మహిళలను, నల్ల చున్నీలు ధరించిన యువతులు, మహిళలనూ అనుమతించలేదు. చున్నీలు తీసేసి వెళ్లాలని పోలీసులు చెప్పడంతో కొందరు నిరాకరించి వెనుదిరిగారు. సోమవారం ఉదయం వర్షం కురవడంతో నలుపు రంగు రెయిన్‌కోట్లు వేసుకువచ్చినవారినీ అవి తీసి పక్కనపెట్టి, లోపలికి వెళ్లాలని ఆదేశించారు. సభ మరికొద్దిసేపట్లో మొదలవుతుందనగా సీపీఐ నరసాపురం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు బురఖా వేసుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని, గాజులు వేసుకుని ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

హాజరుపై పక్కా లెక్క

నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలందర్నీ సభకు తరలించారు. పాలకొల్లు నుంచే 50 బస్సుల్లో మహిళా సంఘాల వారిని తీసుకొచ్చారు. తప్పనిసరిగా రావాలని, రాకపోతే రుణాలు మంజూరు కావని ఏపీఎంలు బెదిరించడంతో వచ్చామని పలువురు చెప్పారు. గ్రూపుల వివరాలు, సభ్యుల పేర్లున్న రిజిస్టర్లు తీసుకుని అందరూ వచ్చారో లేదోనని పరిశీలించారు. వెళ్లేటప్పుడూ అందరూ ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లిపోయారా అని ఆరా తీశారు.  

ఇదేం ఖర్మరా బాబోయ్‌..

సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే నరసాపురంలో దుకాణాలు మూసేశారు. కార్తిక మాసం చివరి సోమవారం గుడికి వెళ్లనివ్వకుండా పోలీసులు ఆంక్షలు పెట్టారని పలువురు వాపోయారు. ఉదయం 8 గంటల నుంచే రహదారులపై తిరగనివ్వకపోవడంతో ఇదేం ఖర్మరా బాబోయ్‌ అని ప్రజలు అసహనం ప్రకటించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలించిన మహిళలతో సభా ప్రాంగణం నిండిపోయింది. చాలా మంది నిలబడలేక వెళ్లిపోయేందుకు ప్రయత్నించినా అధికారులు అడ్డుకున్నారు. దీంతో బారికేడ్ల కింద నుంచి దూరి జనం బయటికి వెళ్లారు.


ఉద్యోగులకు జన సమీకరణ బాధ్యత

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: నరసాపురంలో ముఖ్యమంత్రి బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. వివిధ శాఖల అధికారులు, సచివాలయాల ఉద్యోగులకు ఈ బాధ్యత అప్పగించారు. వాలంటీర్ల సహకారంతో క్షేత్రస్థాయి ఉద్యోగులు అన్ని గ్రామాల నుంచి ప్రజలను విద్యా సంస్థల బస్సుల్లో తీసుకెళ్లారు. వారికి అవసరమైన ఆహారాన్ని పొట్లాలుగా కట్టడం, పంపిణీ చేయడం వంటి పనులన్నీ డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, ఆరోగ్య, ఐసీడీఎస్‌వంటి శాఖల ఉద్యోగులే పర్యవేక్షించారు.  జిల్లావ్యాప్తంగా 1200 బడి బస్సులు ఉండగా 600 బస్సుల్లో ప్రజలను తరలించినట్లు అంచనా. ఈ క్రమంలో ఎక్కువ బస్సులున్న పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల బస్సులను సభకు తరలించేలా ప్రభుత్వం రవాణాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల నుంచి 100 ఆర్టీసీ బస్సులను సీఎం సభకు మళ్లించారు. దీంతో పలు మార్గాల్లో ప్రయాణికులకు గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు.


తెదేపా, భాజపా నాయకుల గృహ నిర్బంధం

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: సీఎం పర్యటన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు చేస్తారనే సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా తెదేపా, భాజపా నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అత్తిలి, వీరవాసరం, భీమవరం, నరసాపురాల్లో ఈ పార్టీల నాయకుల్లో కొందరిని ఆదివారం అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మరికొందరిని సోమవారం ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మను పోలీస్‌స్టేషన్‌ నుంచి సోమవారం తెల్లవారుజామున పంపించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరంలో  50 మంది నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. నరసాపురంలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, తెలుగు యువత నాయకులు పార్టీ కార్యాలయం నుంచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. భీమవరం, అత్తిలిలో తెలుగు యువత, విద్యార్థి విభాగాల ప్రతినిధులను గృహనిర్బంధంలో ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని