Guntur: గుంటూరులో కూల్చివేతల కలకలం

ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత ఘటన మరవకముందే గుంటూరు నగరంలో ఇళ్ల కూల్చివేత చర్చకు దారితీసింది.

Updated : 24 Nov 2022 09:30 IST

చంద్రయ్య కాలనీలో రోడ్డు విస్తరణ పేరిట ఇళ్ల తొలగింపు
నోటీసివ్వకుండా నోటి మాటగా చెప్పి ఉదయమే కూల్చివేత
కాళ్లావేళ్లా పడినా కనికరించని అధికారులు
పరిహారమిచ్చి ప్రత్యామ్నాయం చూపాలంటున్న బాధితులు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే - నగరంపాలెం: ఇప్పటంలో ఇళ్లు కూల్చివేత ఘటన మరవకముందే గుంటూరు నగరంలో ఇళ్ల కూల్చివేత చర్చకు దారితీసింది. స్థానిక శ్రీనగర్‌కాలనీలోని చంద్రయ్యనగర్‌లో రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లను అధికారులు కూల్చడం కలకలం రేపింది. ముందస్తు నోటీసులు లేకుండా, తగినంత సమయం ఇవ్వకుండా ఉన్నపళంగా ఇళ్లను కూల్చితే తాము ఎక్కడికి వెళ్లాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి అధికారులు వచ్చి ఇళ్లను కూల్చేస్తామని చెప్పి, బుధవారం ఉదయాన్నే పొక్లెయిన్లు తెచ్చి కూలగొట్టారని వాపోతున్నారు.సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని, పరిహారం గురించి తేల్చకుండా కట్టుబట్టలతో ఎక్కడికెళ్లాలని  కన్నీటిపర్యంతమవుతున్నారు.

గుంటూరు నగరంలో చంద్రయ్యనగర్‌ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటైంది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన బీ-ఫారం స్థలాల్లో చాలామంది పేదలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. 2015లో కృష్ణా పుష్కరాల సమయంలో రహదారుల విస్తరణలో భాగంగా అమరావతి రోడ్డు నుంచి ఠాగూర్‌ విగ్రహం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థానికులకు నోటీసులు ఇచ్చారు. శ్రీనగర్‌కాలనీ వైపు నిర్మాణాలు కొట్టేసిన నగరపాలక సంస్థ వాటికి పరిహారం, స్థలాలకు బాండ్లు ఇచ్చింది. చంద్రయ్యనగర్‌ వైపు రోడ్డు విస్తరణపై కొందరు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు విస్తరణ పనులు చేపట్టారు. మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ అధికారులు వచ్చి ఇళ్లు తొలగిస్తామని, సామగ్రి తీసుకెళ్లిపోవాలని నోటిమాటగా చెప్పారని బాధితులు అంటున్నారు. బుధవారం ఉదయాన్నే పొక్లెయిన్లు, జేసీబీలతో వచ్చి కూల్చివేతలు ప్రారంభించారు. అరవై ఏళ్లకు పైగా నివాసం ఉంటున్నామని.. ఒక్క పూటలో ఖాళీ చేయమంటే ఎలా అని, కొంత సమయమివ్వాలని వారు కోరినా యంత్రాంగం పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలంటూ కూల్చివేతలు కొనసాగించారు. సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని నివాసితులు వాపోయారు. ఉన్నపళంగా ఇల్లు కూల్చేస్తే తాము రోడ్డున పడతామని, ఎక్కడివెళ్లాలని జమయ్మ అనే మహిళ పొక్లెయిన్‌ తొట్టెలో కూర్చుని నిరసన తెలిపారు. బడ్డీకొట్టు పెట్టుకుని జీవించే తమకు గూడు లేకుండా చేయవద్దని వేడుకున్నారు. స్థానికులు అడ్డుతగలడంతో అధికారులు జయమ్మ ఇల్లు కూల్చకుండానే వెనుదిరిగారు. కొందరి ప్రహరీలు, మరుగుదొడ్లు కూల్చేశారు. చంద్రయ్యనగర్‌లో పది ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలు కూల్చివేయగానే స్థానికులు, తెదేపా నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. 

వేదన మిగిల్చిన యంత్రాంగం

గత ప్రభుత్వ హయాంలో ప్రధాన రహదారికి కుడివైపు ఉన్న స్థలాలను విస్తరణలో భాగంగా తొలగించి, వారికి పరిహారం ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. తమకు నోటీసులు ఇవ్వకుండా, పరిహారం ప్రకటించకుండా అధికారులు హడావుడిగా ఇళ్లు, ప్రహరీలను కూల్చివేసి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. బీ-ఫారం స్థలాలు అయినందున మా వేదనను పట్టించుకోకుండా కూల్చేశారని వాపోయారు. కొన్నేళ్లుగా నీటిపన్ను, ఇంటిపన్ను చెల్లిస్తున్నా ఇప్పుడు పరిహారం రాదని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. తామంతా చిరువ్యాపారులమేనని, నగరానికి దూరంగా ఎక్కడో ఇళ్లస్థలాలు ఇస్తే తమ జీవనోపాధి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల్లో పరిహారం ఇస్తాం

‘అమరావతి రోడ్డు నుంచి డొంకరోడ్డు అరండల్‌పేట పదో లైను చివర ఠాగూర్‌ విగ్రహం వరకు విస్తరణ చేయాలని 2015లో నిర్ణయించారు. అప్పట్లో నోటీసులిచ్చి విస్తరణ చేపట్టాం. కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. శంకర్‌విలాస్‌ వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాల్సి వస్తే ప్రత్యామ్నాయ మార్గం ఇదే. అందుకే ఇప్పుడు విస్తరిస్తున్నాం. దీనిలో భాగంగా చంద్రయ్యనగర్‌లో 51 ఇళ్ల నిర్మాణాలు తొలగించాలని గుర్తించాం. ఇందులో 23 మందికి బీ-ఫారాలు, 18 మంది వద్ద స్వాధీన ఒప్పందాలు ఉన్నాయి. 10 మంది వద్ద ఎలాంటి కాగితాల్లేవు. బీ-ఫారాలున్న 28 మందికి నిర్మాణాలు కోల్పోతున్నంత వరకు లెక్కించి పరిహారం అందిస్తాం. స్వాధీన ఒప్పందాలున్నవారికి పరిహారం బీ-ఫారాలు పొందినవారికి ఇవ్వాలా? ప్రస్తుతం పొజిషన్‌లో ఉన్నవారికి ఇవ్వాలా అనేది కౌన్సిల్‌ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బుధవారం కొట్టేసిన 10 ఇళ్ల నిర్మాణాలకు రెండు రోజుల్లో పరిహారం చెక్కులు ఇస్తాం’ అని నగరపాలకసంస్థ వర్గాలు తెలిపాయి.


హఠాత్తుగా ఖాళీ చేయమంటే ఎలా?

30 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం. మంగళవారం రాత్రి అధికారులు వచ్చి తక్షణమే ఇళ్లు ఖాళీ చేయాలన్నారు. అద్దె ఇంటికి రూ.5 వేలు, కరెంట్‌ బిల్లులు కట్టుకునే పరిస్థితి లేదు. నగరంలోనే ఒక సెంటు భూమి ఇస్తే గుడిసె వేసుకొని బతుకుతాం.

- కత్తి జయమ్మ, చంద్రయ్యనగర్‌


పరిహారం ఇచ్చాకే విస్తరణ చేపట్టాలి

నగరపాలకసంస్థ అధికారులు మంగళవారం నోటిమాటగా చెప్పి బుధవారం ఉదయాన్నే జేసీబీలతో వచ్చి పేదల ఇళ్లు కూల్చడం దారుణం. ఇక్కడ నివసిస్తున్నవారంతా చిన్నచిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్లే. కనీస సమయం ఇవ్వకుండా పరిహారం తేల్చకుండా ఇక్కడి నుంచి పంపించేయాలని చూడటం దుర్మార్గం. అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించారు. పేదలకు పరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే రోడ్డు విస్తరణ చేపట్టాలి. లేకపోతే బాధితులతో కలిసి అధికారులను అడ్డుకుంటాం.

- మద్దిరాల మ్యానీ, మాజీ కార్పొరేటర్‌, గుంటూరు


హఠాత్తుగా వచ్చి ఇల్లు కూల్చేస్తామన్నారు

60 ఏళ్లుగా శ్రీనగర్‌లోని చంద్రయ్యనగర్‌లో నివాసం ఉంటున్నాం. నా ఇద్దరు కుమారులు ఒకరు హైదరాబాద్‌లో, మరొకరు గుంటూరులో ఉంటున్నారు. భర్త మరణించడంతో ఒంటరిగా బతుకుతున్నా. బుధవారం ఉదయం హఠాత్తుగా అధికారులు వచ్చి ఇల్లు కూల్చివేయాలని చెప్పారు. ఒంటరిగా బతుకుతున్నానని, జాలి చూపాలని వేడుకున్నా కరుణించలేదు. మా ఇంటి మరుగుదొడ్డి కూల్చివేశారు. గురువారం ఉదయం ఇల్లు కూల్చేస్తామని చెప్పి వెళ్లారు. 68 ఏళ్ల వయసులో నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలి?

- భాస్కరమ్మ, చంద్రయ్యనగర్‌

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts