Honeytrap: వైకాపా నాయకురాలి హనీట్రాప్‌.. వీడియోలు, ఫొటోలు చూసి అవాక్కైన పోలీసులు!

సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయం పెంచుకోవడం... యువతులతో ఫోన్లు చేయించి, వలపు వల విసిరి డబ్బు గుంజడం... ఇదీ విజయవాడలోని ఓ వైకాపా నాయకురాలి నిర్వాకం.

Updated : 24 Nov 2022 07:29 IST

ఈనాడు, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పురుషులతో పరిచయం పెంచుకోవడం... యువతులతో ఫోన్లు చేయించి, వలపు వల విసిరి డబ్బు గుంజడం... ఇదీ విజయవాడలోని ఓ వైకాపా నాయకురాలి నిర్వాకం. ఈ వ్యవహారంలో నిందితురాలు పరసా సాయితోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని పోలీసులు చెప్పడం గమనార్హం. సెంట్రల్‌ డివిజన్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా, పటమట సీఐ కాశీ విశ్వనాథ్‌ బుధవారం రాత్రి వివరాలు వెల్లడించారు.

నగరంలోని పటమట తోటవారి వీధికి చెందిన పరసా సాయి.. పటమట రైతుబజారులో కూరగాయల దుకాణం, హైస్కూల్‌ రోడ్డులో దుస్తుల దుకాణం నిర్వహిస్తోంది. తన దుకాణాలకు వచ్చే వారిలో ఆర్థికంగా వెనుకబడిన యువతులను లక్ష్యంగా చేసుకుని కొందరికి మద్యం అలవాటు చేసింది. వారు మత్తులో ఉన్నప్పుడు, దుస్తులు మార్చుకునే సమయంలో నగ్న చిత్రాల్ని రహస్యంగా సేకరించి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది. వారి ఫొటోలను విటులకు చూపి బేరాలు కుదుర్చుకునేది. పటమటకు చెందిన ఇద్దరు యువతుల చేత సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిపించి, ఓ యువకుడితో సంభాషణలు నడిపించి ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో గవర్నర్‌పేటలోని ఓ హోటల్‌కు అతడిని రప్పించారు.

ఆ యువకుడు, యువతి ఏకాంతంగా ఉండగా సాయితోపాటు మరో ముగ్గురు వచ్చి అతన్ని బెదిరించారు. వ్యవహారం బయటకు పొక్కకుండా ఉండేందుకు రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అతను దశల వారీగా రూ.1.90 లక్షలు చెల్లించాడు. మరో పదివేలు ఇవ్వాలని వేధించడంతో యువకుడు పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పటమట పోలీసులు బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సాయికి సహకరిస్తున్న మరో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితురాలిని విచారించగా తనకు సహకరించిన వారి పేర్లు చెప్పినట్లు తెలిపింది. వారిలో కొందరు వైకాపా నాయకులు పేర్లు ఉన్నాయని సమాచారం. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సంశయిస్తున్నట్లు తెలిసింది.

నిందితురాలు సాయి గత ఏడాది వైకాపాలో చేరారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లోని వీడియోలు, చిత్రాలు చూసి పోలీసులే అవాక్కయ్యారని తెలిసింది. కొందరు యువతులతో నిందితురాలు సన్నిహితంగా ఉన్న వీడియోలూ ఫోన్‌లో ఉన్నాయి. సాయిపై పటమట స్టేషన్‌లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి. తన బంధువుల అబ్బాయిని కిడ్నాప్‌ చేయించి డబ్బులివ్వాలని బెదిరించినందుకు... తన దగ్గర పని చేస్తున్న వ్యక్తిని తాగిన మత్తులో చితకబాదినందుకు ఆమెపై పోలీసులు కేసులు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని