మాస్టర్‌ ప్లాన్‌ సవరణలకు ససేమిరా

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఆర్‌-5 జోన్‌ ఏర్పాటును అమరావతి రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు.

Updated : 24 Nov 2022 10:47 IST

రాజధానిలో ప్రతిపాదిత ఆర్‌-5 జోన్‌ను ముక్తకంఠంతో వ్యతిరేకించిన రైతులు
ముగిసిన అభిప్రాయ సేకరణ

ఈనాడు, అమరావతి: రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో ప్రతిపాదించిన ఆర్‌-5 జోన్‌ ఏర్పాటును అమరావతి రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. బృహత్‌ ప్రణాళికలో మార్పు, చేర్పులు చేయడాన్ని అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. 9 రోజులుగా సాగిన ప్రజాభిప్రాయ సేకరణ బుధవారంతో ముగిసింది. గత నెలలో మాస్టర్‌ ప్లాన్‌లో చేసిన మార్పులపై ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసి, రైతుల నుంచి అభ్యంతరాలు ఆహ్వానించింది. ఇందుకోసం అధికారులు గతనెల 28 నుంచి ఈనెల 11 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ నెల 14 నుంచి విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో వారి వాంగ్మూలాలను సేకరించారు. 5,744 మంది అభ్యంతరాలపై పత్రాలు ఇవ్వగా..  4 వేల మందికిపైగా అధికారుల ఎదుట అభిప్రాయాలు తెలిపారు.

వచ్చిన అభ్యంతరాలు ఇవీ..

* ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల వరకు మాస్టర్‌ ప్లాన్‌ను మార్చడానికి వీల్లేదు. ఆ తర్వాత కూడా రైతుల అంగీకరిస్తేనే సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది మేం సమ్మతి తెలపకుండానే ఎలా మారుస్తారు? పైగా పంచాయతీ ప్రత్యేకాధికారులకు ప్లాన్‌కు సంబంధించి ఎటువంటి హక్కులు, అధికారాలు ఉండవు. ఈ నేపథ్యంలో ప్రతిపాదనల ఆధారంగా సీఆర్డీఏ ఎలా నిర్ణయం తీసుకుంటుంది?

* రాజధానిలోని నిరుపేదల ఇళ్ల కోసమని మాస్టర్‌ ప్లాన్‌లోనే స్థలాలు రిజర్వు చేసి ఉంచారు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలోని నిరుపేదలను గాలికొదిలేసి, ఇతర ప్రాంతాల వారికి కేటాయిస్తామనడం ఎంత వరకు సమంజసం? గత ప్రభుత్వ హయాంలో దాదాపు పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా పడావుపెడుతున్నారు.

* గతంలో పరిశ్రమలకు కేటాయించిన ప్రాంతాన్ని ఇప్పుడు నివాస స్థలాలకు ఎలా కేటాయిస్తారు? ప్రభుత్వ చర్య కారణంగా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి.

మాకు ఆత్మహత్యలే శరణ్యం

పలువురు రైతులు, మహిళలు సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా సీఆర్డీఏ వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జోన్‌ను తీసుకురావాల్సిన అవసరమేంటని నిలదీశారు. రాజధానిలో ఉండే వారికి, వలస వచ్చే వారికి సెంటు చొప్పున స్థలాలు ఇస్తామనడం వలసలను ప్రోత్సహిస్తున్నట్లు కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ మీరు ముందుకే సాగితే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని