సంక్షిప్త వార్తలు (16)

వెంకటగిరి సంస్థానానికి చెందిన రాజ కుటుంబీకులు వెలుగోటి మదన గోపాలకృష్ణ యాచేంద్ర (90) బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. వెంకటగిరి పట్టణంలోని గురుకుల పాఠశాల, ఎన్జీవో కాలనీ, అగ్నిమాపక కేంద్రం, తెలుగుగంగ కార్యాలయం, బాలికోన్నత పాఠశాల భవనాలకు ఆయనే స్థలదాత.

Updated : 25 Nov 2022 06:38 IST

వెంకటగిరి రాజ కుటుంబీకుడు గోపాలకృష్ణ యాచేంద్ర కన్నుమూత

వెంకటగిరి, న్యూస్‌టుడే: వెంకటగిరి సంస్థానానికి చెందిన రాజ కుటుంబీకులు వెలుగోటి మదన గోపాలకృష్ణ యాచేంద్ర (90) బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. వెంకటగిరి పట్టణంలోని గురుకుల పాఠశాల, ఎన్జీవో కాలనీ, అగ్నిమాపక కేంద్రం, తెలుగుగంగ కార్యాలయం, బాలికోన్నత పాఠశాల భవనాలకు ఆయనే స్థలదాత. వీరి కుమారుడు ఏపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ మేనేజర్‌ సత్య ప్రసాద్‌ యాచేంద్రను పలువురు ప్రముఖలు పరామర్శించి సంతాపం తెలిపారు. రాజ కుటుంబీకులు డాక్టర్‌ సాయికృష్ణ యాచేంద్ర, కుమార రాజా రాంప్రసాద్‌ యాచేంద్ర, యువరాజా సర్వజ్ఞ కుమార యాచేంద్ర హైదరాబాద్‌కు వెళ్లి పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు.


ఆర్‌అండ్‌బీ ఇన్‌ఛార్జి సీఈగా ఎస్‌ఈ మాధవి సుకన్య

ఈనాడు, అమరావతి: ఆర్‌అండ్‌బీ నెల్లూరు జిల్లా ఎస్‌ఈ ఎన్‌.మాధవి సుకన్యను ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ (సీఈ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పదోన్నతులు కల్పించే సమయంలో తనకు అవకాశం ఇవ్వలేదంటూ గతంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమెకు సీఈగా పోస్టింగు ఇవ్వాలంటూ హైకోర్టు గత నెలలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమెకు సీఈగా పోస్టింగు ఇచ్చినట్లు తెలిసింది. ఆమెకు బిల్డింగ్స్‌, నాబార్డ్‌ విభాగాల సీఈగా బాధ్యతలనిచ్చారు. ఇప్పటివరకు ఆ విభాగాలు చూసిన పి.సి.రమేశ్‌కుమార్‌కు క్వాలిటీ కంట్రోల్‌ సీఈగా మార్పు చేశారు. అక్కడ ఉన్న జి.వెంకటేశ్వరరావును ఏపీ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)కి డిప్యుటేషన్‌పై పంపారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ వేర్వేరు ఉత్తర్వులిచ్చారు.


‘స్వాతి’ బలరామ్‌కు లోక్‌నాయక్‌ సాహిత్య పురస్కారం

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే: లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాదికి ‘స్వాతి’ వ్యవస్థాపక సంపాదకుడు వేమూరి బలరామ్‌కు ప్రదానం చేయనున్నట్లు లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గురువారం విశాఖలో తెలిపారు. జనవరి 18న ఈ పురస్కారం అందిస్తామన్నారు. ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు హాజరవుతారన్నారు. జీవన సాఫల్య పురస్కారాలను సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ కూచిభట్ల ఆనంద్‌, కె.ఎల్‌.యూనివర్సిటీ(విజయవాడ) ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ, జీఎస్‌ఎల్‌ మెడికల్‌ హాస్పిటల్‌ (రాజమహేంద్రవరం) వ్యవస్థాపకుడు డాక్టర్‌ గన్ని భాస్కరరావు, సీనియర్‌ సినీ నటీమణులు జయప్రద, జయసుధకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


రొయ్యల రైతులకు అరువు ఇవ్వలేం

దాణా, ఇతర ఉత్పత్తులమ్మే డీలర్ల నిర్ణయం

ఈనాడు, అమరావతి: రొయ్యల రైతులపై మరో పిడుగు పడింది. దాణా, ఇతర ఉత్పత్తులను అరువుపై ఇవ్వరాదని అమ్మకందారులు నిర్ణయించారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి కొన్ని నెలల పాటు దీన్ని అమలు చేయనున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం వీరేశ్వరస్వామి ఆక్వా డీలర్ల సంఘం ఈ మేరకు రైతులకు సందేశాలు పంపింది. రొయ్యలను కొనుగోలు చేయకపోవడం, ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వివరించింది.


సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం

అన్నవరం, న్యూస్‌టుడే: కార్తిక మాసంలో అన్నవరం సత్యదేవునికి రికార్డు స్థాయిలో రూ.19.94 కోట్లు ఆదాయం సమకూరింది. వ్రతాలు, ప్రసాద విక్రయాలు, హుండీల ద్వారా అత్యధిక ఆదాయం వచ్చింది. సుమారు 20 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని అంచనా.


2018లోపు దాఖలైన కేసులను సత్వరం పరిష్కరించాలి: హైకోర్టు

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 2018లోపు దాఖలై పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30లోగా ఈ కేసుల విచారణకు చర్యలు చేపట్టాలని న్యాయమూర్తులను ఆదేశించింది. ప్రాధాన్య క్రమంలో రోజువారీ విచారణలు జరిపి సత్వరం ఈ కేసులను పరిష్కరించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తులను కోరింది. కొత్తగా దాఖలవుతున్న కేసులతో సమానంగా పాత వాటిని పరిష్కరించాలని సూచించింది. కేసుల పరిష్కారంలో కింది స్థాయి న్యాయమూర్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తులు  ఎప్పటికప్పుడు సూచనలు అందించాలని తెలిపింది. ఈ ఉత్తర్వులను విధిగా అమలు చేయాలని, ఉల్లంఘన జరిగితే హైకోర్టు కఠినంగా వ్యవహరిస్తుందని అందులో పేర్కొంది.


పీ15బీ శ్రేణిలో రెండో నౌక నేవీకి అప్పగింత

విశాఖపట్నం (సింధియా), న్యూస్‌టుడే: ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో స్వీయ రక్షణ పరిజ్ఞానంతో నిర్మించిన పీ15బీ శ్రేణికి చెందిన రెండో నౌక ‘మార్ముగావ్‌’ను భారత నౌకాదళానికి అప్పగించినట్లు నౌకాదళ వర్గాలు గురువారం తెలిపాయి. 75% పైగా ఆయుధాలు, సెన్సర్లను సొంతంగా అమర్చుకున్న ఈ నౌకకు సంబంధించిన అధికారిక పత్రాలను ముంబయిలో నౌకాదళానికి మజగాన్‌ డాక్‌ లిమిటెడ్‌ అధికారులు అప్పగించారు.


కరకట్టవద్ద ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ

ఈనాడు, చెన్నై: సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణా నది తీరం కరకట్ట వద్ద ఇసుక తవ్వకాలు, పర్యావరణ ఉల్లంఘనలపై నివేదిక సమర్పించాలని సంయుక్త కమిటీని జాతీయ హరిత ట్రైబ్యునల్‌్ దక్షిణాది బెంచ్‌ (చెన్నై) ఆదేశించింది. దీనికి డిసెంబరు 14వ తేదీ వరకు గడువు విధించింది. గతేడాది జూన్‌ 12న ‘ఈనాడు’లో ‘కరకట్ట వెంట ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి’ శీర్షికతో వచ్చిన వార్త ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టింది. ఇందులో వచ్చిన అభ్యంతరాలపై కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజినీర్‌ ద్వారా నివేదిక ఇప్పించాలని ఆదేశించింది.


ఏఎంఆర్‌పై నేడు, రేపు సదస్సు

ఈనాడు, అమరావతి: దేశానికి పెను సవాలుగా మారిన యాంటీ మైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్ర, శనివారాల్లో విజయవాడలో ప్రత్యేక సదస్సు జరగనుంది. వైద్యారోగ్య, ఔషధ నియంత్రణ, పశు సంవర్ధక, మత్స్య శాఖలు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొనే ఈ సదస్సును ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏషియన్‌ బయోటెక్‌ అసోసియేషన్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా, వరల్డ్‌ యానిమల్‌ ప్రొటెక్షన్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కొందరు శాస్త్రవేత్తలు వర్చువల్‌ ద్వారా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. యాంటీబయాటిక్స్‌ వాడకంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుండటాన్నే ఏఎంఆర్‌గా పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఎంఆర్‌ కారణంగా ఏటా ఏడు లక్షల మందికిపైగా చనిపోతున్నారు. వీటి నియంత్రణకు ప్రభుత్వ శాఖలు, సంబంధిత సంస్థలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సదస్సులో చర్చిస్తారు. అనంతరం కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తారు.


డీఈడీ విద్యార్థులకు పరీక్షలు

ఈనాడు, అమరావతి: డీఈడీ-2020-22 బ్యాచ్‌ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు డిసెంబరు 12 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. 2019-21 బ్యాచ్‌లో అనుత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చని వెల్లడించారు. డీఈడీ-2021-23 బ్యాచ్‌ రెగ్యులర్‌ విద్యార్థులకు జనవరి 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. భాష పండితు(ఎల్‌పీటీ)లకు థియరీ పరీక్షలను జనవరి 23 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.


ఒప్పంద బోధన పోస్టుల క్రమబద్ధీకరణపై 27న సమావేశం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఒప్పంద బోధన సిబ్బంది పోస్టులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో ఈనెల 27 విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఒప్పంద లెక్చరర్లు, ఉపాధ్యాయుల సమాఖ్య అధ్యక్షుడు బీజే గాంధీ తెలిపారు. ఈ విషయమై ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.


సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుకు వినతి

ఈనాడు, అమరావతి: రెండో విడత(2020) నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికైన 12 వేల మంది సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేయాలని సంబంధిత ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జానీ పాషా ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలపై గురువారం ఆయన రాష్ట్ర సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రేడ్‌-5 పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు అవసరమైన కంప్యూటర్‌ నైపుణ్య పరీక్ష (సీపీటీ) మరోసారి నిర్వహించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న ఎనర్జీ అసిస్టెంట్లకు తగిన భద్రత కల్పించాలని విన్నవించారు.


రెగ్యులర్‌ పదోన్నతులు కల్పించండి

నీటిపారుదల శాఖ హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం నీటిపారుదల శాఖ రెగ్యులర్‌ పదోన్నతులపై దృష్టిసారించి అందరికీ న్యాయం చేయాలని ఆ శాఖ హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం గౌరవ అధ్యక్షుడు సి.మహేందర్‌, అధ్యక్షుడు ఏఎస్‌ఎన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.


రైతుబజార్లలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపు

ఈనాడు, అమరావతి: రైతు బజార్లలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను 23% పెంచుతూ వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోని రైతు బజార్ల ఎస్టేట్‌ అధికారులకు రూ.26 వేలు, సూపర్‌ వైజర్లకు రూ.18,500, సెక్యూరిటీ గార్డులకు రూ.15 వేల చొప్పున నిర్ణయించారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోని రైతు బజార్లలో పనిచేసే ఎస్టేట్‌ అధికారులకు రూ.24వేలు, సూపర్‌వైజర్లకు రూ.15,000, సెక్యూరిటీ గార్డులకు రూ.15వేలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఆ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలి: ఎస్టీయూ

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల సమయంలో సస్పెండ్‌ చేసిన ఉపాధ్యాయులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ప్రధాన కార్యదర్శి తిమ్మన్న కోరారు. పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు రామలింగానికి వినతిపత్రం సమర్పించారు. నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లె ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసి, ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయిందని, హైకోర్టు సైతం ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పోస్టుల హేతుబద్ధీకరణపైనా స్పష్టత ఇవ్వాలని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన చోట అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.


ఎస్‌ఎస్‌ఏలో డిప్యుటేషన్‌పై ఖాళీల భర్తీ

ఈనాడు, అమరావతి: సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) రాష్ట్ర కార్యాలయంలో 16 ఖాళీలను డిప్యుటేషన్‌పై భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హుల నుంచి జిల్లాల్లో దరఖాస్తులు స్వీకరించి, 15 రోజుల్లో రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఎస్‌ఎస్‌ఏ ఆదేశించింది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts