తలో రూ.లక్ష కట్టండి

సంజాయిషీ (షోకాజ్‌) నోటీసు అందుకున్న విషయాన్ని దాచిపెట్టి హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు పొందినందుకు ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated : 25 Nov 2022 06:36 IST

14 మంది ‘ఇప్పటం’ పిటిషనర్లకు హైకోర్టు ఆదేశం
వాస్తవాల్ని దాచిపెట్టి ఉత్తర్వులు పొందారని ఆగ్రహం

ఈనాడు, అమరావతి: సంజాయిషీ (షోకాజ్‌) నోటీసు అందుకున్న విషయాన్ని దాచిపెట్టి హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు పొందినందుకు ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున ఖర్చులను చెల్లించాలని ఆదేశించింది. ఆ సొమ్మును ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. వాస్తవాలను దాచి కోర్టుల నుంచి అనుకూలమైన ఉత్తర్వులు పొందడం న్యాయ విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనంది. కోర్టుతో ఆటలాడొద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. రహదారి విస్తరణ పేరుతో తమ ఇళ్లు, ప్రహరీలను అధికారులు కూల్చి వేస్తున్నారని, నిలువరించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన రైతులు బెల్లంకొండ వెంకటనారాయణ, మరో 13 మంది ఈనెల 4న హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పిటిషనర్లు 11 మంది గురువారం హైకోర్టులో హాజరయ్యారు. ముగ్గురు వ్యక్తిగత కారణాలతో రాలేదు. పిటిషనర్లు చిన్న రైతులని, దయ చూపాలని న్యాయవాది కోరగా.. న్యాయమూర్తి స్పందిస్తూ జాలి చూపితే తప్పుడు సంకేతం వెళ్తుందని, క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయడం లేదని స్పష్టం చేశారు.


పిల్‌ వేసిన పిటిషనర్లకు రూ.లక్ష ‘ఖర్చులు’ విధింపు

ఈనాడు, అమరావతి: ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) పేరుతో కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేసిన కారణంగా ముగ్గురు పిటిషనర్లకు హైకోర్టు రూ.లక్ష ఖర్చులు విధించింది. నాలుగు నెలల్లో ఆ సొమ్మును ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులులతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ తీర్పు ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం, మర్రిపూడి గ్రామ పరిధిలో బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఏర్పాటును సవాలు చేస్తూ జి.కొత్తూరు, మర్రిపూడి గ్రామాలకు చెందిన రైతులు జి.సుధాకర్‌, కె.అమ్మన్నచౌదరి, పి.వీరభద్రరావు హైకోర్టులో పిల్‌ వేశారు. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. పిటిషనర్ల తీరును తప్పుపట్టింది. ఖర్చులు విధిస్తామని తేల్చిచెప్పింది. రూ.లక్ష ఖర్చులు విధిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని