రోడ్డు విస్తరణలో నష్టపోతున్నవారికి న్యాయం చేస్తాం

గుంటూరు డొంకరోడ్డులోని చంద్రయ్యనగర్‌లో రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో స్థలాలు, భవన నిర్మాణాలు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి వెల్లడించారు.

Published : 25 Nov 2022 04:50 IST

అంగీకరించిన వారి ఇళ్ల వద్దే కూల్చివేతలు
మిగతావారు అపోహతోనే అడ్డుకున్నారు
జీఎంసీ కమిషనర్‌ కీర్తి చేకూరి

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే - గుంటూరు నగర పాలక సంస్థ, నెహ్రూనగర్‌: గుంటూరు డొంకరోడ్డులోని చంద్రయ్యనగర్‌లో రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో స్థలాలు, భవన నిర్మాణాలు కోల్పోతున్న వారికి న్యాయం చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం చంద్రయ్యనగర్‌ వద్ద ఇళ్లు, ప్రహరీలు కూల్చివేసిన ఘటనపై గురువారం కమిషనర్‌ కీర్తి విలేకర్లతో మాట్లాడారు. ‘2012లోనే శ్రీనగర్‌- డొంకరోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఒకవైపు పూర్తిచేశాం. మరోవైపు పనులు పలు కారణాలతో నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ ఇబ్బందుల దృష్ట్యా అప్పటి ప్రణాళిక ప్రకారమే విస్తరణ చేపట్టాం. అరండల్‌పేట వంతెన నిర్మాణం చేపడితే డొంకరోడ్డు రహదారి ప్రత్యామ్నాయం కానుంది. డొంకరోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు పెరుగుతాయని గుర్తించి రహదారి అభివృద్ధి ప్రణాళిక ప్రకారం 60 అడుగులుగా విస్తరిస్తున్నాం. నోటీసులు, పరిహారం ఇవ్వకుండా తొలగించారనేది అవాస్తవం. విస్తరణ పనుల్లో భాగంగానే స్థానికులతో రెండు నెలలుగా సమావేశాలు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించడంతో ఆమోదించారు. అంగీకరించిన పది మంది నిర్మాణాలే బుధవారం తొలగించాం. మిగిలినవారు అపోహతోనే అడ్డుకున్నారు. వారికి సమాచారం ఇచ్చాకే తొలగిస్తాం. విస్తరణలో 61 మందికి సంబంధించిన స్థలాలు, నిర్మాణాలు తొలగించాల్సి వస్తోంది. వీటిలో 10 ఖాళీ స్థలాలు, 23 బీ-ఫాం స్థలాలు, ఆరుగురివి స్వాధీన అగ్రిమెంట్‌ స్థలాలు. బీ-ఫాం స్థలాల్లో ఉన్న నిర్మాణాలకు పరిహారం ఇస్తున్నాం. స్వాధీన స్థలాల్లో ఉన్నవారిలో అర్హులకు జగనన్నకాలనీలో ఇళ్లస్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. నగరంలోని రహదారుల విస్తరణలో స్థలాలు, నిర్మాణాలు కోల్పోతున్నవారిలో అర్హులకు టీడీఆర్‌ బాండ్లు, పరిహారం అందజేశాం’ అని కమిషనర్‌ వివరించారు. స్థానికుల నుంచి బుధవారం తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి కూల్చివేతలు నిలిపివేశారు. గురువారం రహదారి విస్తరణలో భాగంగా గుంతలను సరిచేయించారు. శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు.


కట్టడం చేతకాకున్నా.. కూల్చడానికి ముందుంటారు: సీపీఎం

ఇళ్ల నిర్మాణంలో నత్తనడక నడుస్తున్న జగన్‌ ప్రభుత్వం ఇళ్లు కూల్చడానికి బుల్డోజర్‌తో మాత్రం ముందే వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. గుంటూరు చంద్రయ్యనగర్‌లో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలను సీపీఎం నేతలు నళినీకాంత్‌, భావన్నారాయణ తదితరులతో కలిసి ఆయన పరామర్శించారు. బాబూరావు మాట్లాడుతూ.. పేదవాళ్లు, బీ ఫారం పట్టాలున్న వారికి నోటీసులు ఇవ్వరా? వారికి హక్కు లేదా? బీ ఫారాన్ని ప్రభుత్వమే గుర్తించకపోతే ఎందుకు పట్టాలిచ్చినట్లని ప్రశ్నించారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ కడితే కొండపై బీ ఫారాలున్నవారికి కూడా నష్టపరిహారం చెల్లించారని, గుంటూరులో ఎందుకు ఇవ్వరని నిలదీశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని