అమరావతిలో ఆర్థికశాఖకు భద్రత

రాష్ట్ర సచివాలయంలో ఆర్థికశాఖ విభాగానికి పోలీసు భద్రత కల్పించారు. ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌.. ముగ్గురు నిరంతరం అధికారులకు పహారా కాస్తున్నారు. ఏళ్లుగా బకాయిపడ్డ బిల్లుల కోసం వచ్చే వారి నుంచి రక్షణకు ఈ ఏర్పాట్లు చేశారు.

Published : 25 Nov 2022 04:50 IST

బకాయి బిల్లుల కోసం వచ్చే వారి నుంచి రక్షణకే

ఈనాడు, అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ఆర్థికశాఖ విభాగానికి పోలీసు భద్రత కల్పించారు. ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌.. ముగ్గురు నిరంతరం అధికారులకు పహారా కాస్తున్నారు. ఏళ్లుగా బకాయిపడ్డ బిల్లుల కోసం వచ్చే వారి నుంచి రక్షణకు ఈ ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రంలో రూ.కోటి నుంచి రూ.వందల కోట్ల బిల్లుల వరకు ఏళ్ల తరబడి పెండింగులో ఉన్నాయి. ఆ బకాయిలు అందక ఇప్పటికే అనేక మంది చిన్న, పెద్ద గుత్తేదారులు, సరఫరాదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఒకటి రెండు చోట్లయితే ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. వీరికి బిల్లులు చెల్లించాలంటే ఆర్థికశాఖలో దస్త్రం కదలడమే ముఖ్యం. అందుకే.. కొన్ని నెలలుగా సచివాలయం రెండో బ్లాకులోని మొదటి అంతస్తులో ఉన్న ఆర్థికశాఖ కార్యాలయానికి పెద్దఎత్తున బాధితులు వస్తున్నారు. వీరిని చూసి ఆర్థికశాఖ అధికారులు అప్పులోళ్లను చూసి భయపడ్డట్లు హడలిపోతున్నారు. బిల్లుల కోసం వచ్చే వారు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణలను కలిసేందుకు గంటల తరబడి కార్యాలయం బయట వేచి చూస్తుంటారు. అంతసేపు నిరీక్షించినా అధికారులు కరుణించకపోవడంతో ఒకానొక దశలో ఓపిక నశించి తలుపులు తోసుకొని అధికారుల వద్దకు వెళ్తున్నారు. బిల్లుల కోసం నిలదీస్తున్నారు. ఆవేదన చెప్పుకొంటూ, వాదనకు దిగుతూ.. ఛాంబర్ల నుంచి ఎంతకూ బయటకు రావడం లేదు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువవుతుండటంతో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

ఉన్నతాధికారుల నుంచి అనుమతి

సాధారణంగా సచివాలయం లోనికి ప్రవేశించేందుకు అనుమతి తప్పనిసరి. ఆధార్‌ కార్డు చూపించి, పని వివరించి, ఏ కార్యాలయానికి వెళ్లనున్నారో తెలియజేసి, పోలీసు అనుమతి తీసుకోవాలి. సాధారణ ప్రజలు మధ్యాహ్నం 3 గంటల నుంచి అధికారులను కలిసేందుకు అనుమతి ఇస్తుంటారు. ఆర్థికశాఖ వద్ద పరిస్థితి అదుపు తప్పడంతో ఉన్నతాధికారుల పేషీ నుంచి అనుమతి ఉంటేనే సందర్శకులను అనుమతిస్తున్నారు.

చెల్లింపుల్లో ఓ విధానం లేకనేనా..!

పెండింగు బిల్లులపై ఇప్పటికే హైకోర్టులో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ఐఏఎస్‌ అధికారులూ న్యాయస్థానానికి హాజరైన సందర్భాలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల తర్వాత కూడా బిల్లులు చెల్లింపులు లేక ధిక్కరణ కేసులూ నమోదయ్యాయి. ఏటా రూ.వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నా.. చెల్లింపుల్లో ఒక విధానమంటూ లేకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. నిజానికి బిల్లుల చెల్లింపుల్లో ఫిఫో విధానం (ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌) అనుసరిస్తే క్రమేణా ఎప్పుడో అప్పుడు బిల్లు దక్కుతుందనే నమ్మకం ఉండేది. ఇప్పుడది లేకే పెండింగు బిల్లులు పెరుగుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని