విద్యుత్తు బిల్లులు కుంగదీస్తున్నాయ్‌

ధాన్యం అమ్మిన తర్వాత సొమ్మును వెంటనే ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకొంటున్న ప్రభుత్వం... అదే తీరున రొయ్యల్ని కూడా కొనుగోలు చేసి డబ్బును తన అవసరాలకు వినియోగించుకునే దుర్మార్గపు ఆలోచన చేస్తోందని ఆక్వా రైతులు ధ్వజమెత్తారు.

Published : 25 Nov 2022 04:50 IST

ఆక్వా సదస్సులో రైతుల ఆందోళన

ఈనాడు, అమరావతి: ధాన్యం అమ్మిన తర్వాత సొమ్మును వెంటనే ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకొంటున్న ప్రభుత్వం... అదే తీరున రొయ్యల్ని కూడా కొనుగోలు చేసి డబ్బును తన అవసరాలకు వినియోగించుకునే దుర్మార్గపు ఆలోచన చేస్తోందని ఆక్వా రైతులు ధ్వజమెత్తారు. ‘రొయ్యకు రేటు లేదు, కొనుగోలూ చేయడం లేదు. వంద కౌంట్‌ ఉందంటే 60 కౌంట్‌ కావాలని వ్యాపారులు చెబుతున్నారు. 60 కౌంట్‌ ఉందని చెబితే వంద కౌంట్‌ ఉంటే కొంటామంటూ తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. పెరిగిన విద్యుత్తు బిల్లులు రైతుల్ని కుంగదీస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మూడు టన్నుల రొయ్యలు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్న చిన్న రైతు ఒకరు వ్యాపారిని ఆశ్రయిస్తే... 60 కౌంట్‌కు రూ.225 చొప్పున తీసుకుంటామని, రెండు నెలల తర్వాత డబ్బు ఇస్తామంటున్నారు’ అని వాపోయారు. గురువారం మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సుకు హాజరైన రైతులు... తమ కష్టాలను తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి తెచ్చారు.


జే ట్యాక్స్‌ కోసమే దాణా ధరల పెంపు

ఆక్వాలో ‘నాడు-నేడు’ పెట్టి.. తెదేపా హయాంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఏం జరుగుతోందో చెప్పండి. దాణా టన్ను రూ.60వేల నుంచి రూ.90వేలకు పెరిగింది. సోయా, రైస్‌బ్రాన్‌ ధరలు తగ్గినా దాణా ధర తగ్గడం లేదు. జే ట్యాక్స్‌ కోసమే ఈ ధరల్ని పెంచారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి రొయ్యల్ని కొనిపిస్తామని సమావేశం పెట్టారు. తర్వాత రోజే వంద కౌంట్‌ కిలో రూ.240 నుంచి పడిపోవడం మొదలైంది.

-రావూరి రాధాకృష్ణ నాయుడు, నెల్లూరు


ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది

సీడ్‌, ఫీడ్‌ చట్టాల పేరుతో ప్రభుత్వం వ్యాపారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. రొయ్య మేత తినాలంటే కిలోకు రూ.5 వైకాపా నేతలకు సమర్పించాల్సిన పరిస్థితి ఉంది. వంద కౌంట్‌ రొయ్యల ధరను కిలోకు రూ.240 చొప్పున మొదట ఎందుకు ప్రకటించారు? తర్వాత రూ.210కి ఎందుకు తగ్గించారు. దమ్ముంటే అదే ధరకైనా కొనిపించాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూక్ష్మసేద్యం తీసేసింది. సూక్ష్మపోషకాలూ లేవు.

-సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి


మీటరు తప్పు తిరిగిందని రూ.2 లక్షలు కట్టాలంటున్నారు

విద్యుత్తు బిల్లులు ఎంతొస్తున్నాయో, ఎందుకేస్తున్నారో అంతుపట్టడం లేదు. రెండేళ్ల కిందట మీటరు తప్పుగా తిరిగిందంటూ రూ.2 లక్షలు కట్టాలంటున్నారు. ఆ లెక్కలేంటో చెప్పడం లేదు. రైతులకు విద్యుత్తు ఛార్జీలే ప్రధాన సమస్యగా తయారయ్యాయి. యూనిట్‌ రూ.1.50 చొప్పున కొన్నాళ్లు ఇచ్చి మురిపించి తర్వాత మానేశారు. లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైనా మరమ్మతు చేయించే పరిస్థితి లేదు. సోయా రేటు టన్ను రూ.70 వేల నుంచి రూ.40వేలకు దిగొచ్చినా.. దాణా ధర మాత్రం పెరుగుతూనే ఉంది.

-కొల్లూరు సత్యనారాయణ, గుడివాడ, కృష్ణా జిల్లా


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts