బస్సు నడుపుతుండగా గుండెనొప్పి.. 42 మంది అయ్యప్ప స్వాములను కాపాడి మరణించిన డ్రైవర్‌

గుండెలో తీవ్రమైన నొప్పి... భరించలేని బాధ... అయినా తట్టుకుంటూ బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లారా డ్రైవర్‌. 42 మంది అయ్యప్ప స్వాములకు ఎలాంటి ప్రమాదమూ సంభవించకుండా కాపాడారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు.

Updated : 25 Nov 2022 12:11 IST

బిట్రగుంట, న్యూస్‌టుడే: గుండెలో తీవ్రమైన నొప్పి... భరించలేని బాధ... అయినా తట్టుకుంటూ బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లారా డ్రైవర్‌. 42 మంది అయ్యప్ప స్వాములకు ఎలాంటి ప్రమాదమూ సంభవించకుండా కాపాడారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన 42మంది అయ్యప్ప స్వాములు ఈ నెల 16న ఓ ప్రైవేటుట్రావెల్స్‌ బస్సులో శబరిమల వెళ్లారు. అక్కడి నుంచి బయలుదేరి గురువారం సాయంత్రం బోగోలు మండలంలోని కడనూతల చెరువు ప్రాంతానికి చేరుకునేసరికి బస్సు డ్రైవర్‌ భాస్కర్‌రావు(38)కు గుండెలో నొప్పి వచ్చింది. అయినా భరిస్తూ బస్సును కొంతదూరం పోనిచ్చారు. ఫ్లైఓవర్‌ పైకి వెళ్లాక భరించలేక పోయారు.

బస్సును రోడ్డు పక్కన ఆపి, వెనుక సీటులో పడుకుని సేదతీరేందుకు ప్రయత్నిస్తుండగా బస్సులోని స్వాములు గుర్తించారు. వారు భాస్కర్‌రావును పలకరించేలోపే ఆయన చనిపోయారు. ఓ పక్క నీ ప్రాణాలు పోతున్నా మమ్మల్ని కాపాడావా స్వామీ అంటూ... వారు కంటతడి పెట్టారు. భాస్కర్‌రావు మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం, ఎ.కోడూరుకు అంబులెన్స్‌లో పంపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts