CM Jagan: ఇక ఎమ్మెల్యేల వంతు

అధికార వైకాపాలో జిల్లా అధ్యక్షుల మార్పుతో.. ఇక తర్వాత వంతు అసెంబ్లీ అభ్యర్థులదేనన్న చర్చ మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో పనితీరు బాగోని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, సర్వేల్లో ప్రతికూల ఫలితాలున్నవారిని ఎంపిక చేసి.. కొందరి స్థానంలో కొత్తవారిని అభ్యర్థులుగా తీసుకొస్తారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది.

Updated : 25 Nov 2022 08:22 IST

వైకాపా ఎమ్మెల్యేల్లో ఆందోళన పెంచుతున్న సీఎం హెచ్చరికలు
ఒకవైపు సర్వేలు.. మరోవైపు ఐప్యాక్‌ నిఘా

ఈనాడు, అమరావతి: అధికార వైకాపాలో జిల్లా అధ్యక్షుల మార్పుతో.. ఇక తర్వాత వంతు అసెంబ్లీ అభ్యర్థులదేనన్న చర్చ మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో పనితీరు బాగోని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, సర్వేల్లో ప్రతికూల ఫలితాలున్నవారిని ఎంపిక చేసి.. కొందరి స్థానంలో కొత్తవారిని అభ్యర్థులుగా తీసుకొస్తారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. పార్టీ సొంతంగా సర్వే చేయడంతో పాటు.. ఐప్యాక్‌ సైతం అన్ని నియోజకవర్గాల్లో నిఘాపెట్టి సర్వేలు చేసింది. వాటి ఫలితాల ఆధారంగానే టికెట్లు ఇస్తారన్న చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో నియోజకవర్గాలకు పార్టీ పర్యవేక్షకుల నియామకంపై సీఎం గత మూడు రోజులుగా సమీక్షిస్తుండటంతో ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ మొదలైంది. ‘పనితీరు మెరుగుపరచుకోకపోతే మీ స్థానంలో కొత్త ఇన్‌ఛార్జులను నియమిస్తా’ అని సీఎం జగన్‌ సెప్టెంబరులోనే ఎమ్మెల్యేలకు అల్టిమేటం జారీచేశారు. జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది.

త్రిశంకుస్వర్గంలో ఎమ్మెల్యేలు: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసిన ముఖ్యమంత్రి.. గతంలోనే హెచ్చరించారు. సెప్టెంబరు 28న నిర్వహించిన సమీక్షలో అప్పటివరకూ గ్రామాలకు వెళ్లని 27 మంది పేర్లనూ వెల్లడించారు. మిగిలినవారి పనితీరుపైనా నివేదికలు తెప్పిస్తున్నామని వెల్లడించారు. ఒక్కో ఎమ్మెల్యేను ఇద్దరేసి ఐప్యాక్‌ ప్రతినిధులు పరిశీలించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్‌ నివేదికలతోపాటు, ప్రైవేటు సంస్థలతోనూ సర్వేలు చేయించి, వాటి ఆధారంగా వైకాపా అధిష్ఠానం అంచనా వేసిందంటున్నారు. మూడు రోజులుగా విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలతో సీఎం ఈ వ్యవహారాలపై చర్చించినట్లు తెలిసింది. వాస్తవానికి 175 మంది పర్యవేక్షకుల జాబితాను గత నెల్లోనే సిద్ధం చేశారు. కానీ, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వీరి నియామకం ఉండాలని సీఎం స్పష్టం చేశారంటున్నారు. త్వరలో పర్యవేక్షకులను ప్రకటిస్తారు. ‘ఉన్న నిఘాలతోనే తలబొప్పి కడుతుంటే ఇప్పుడు కొత్తగా పర్యవేక్షకులను నియమిస్తున్నారు.. వీళ్లంతా ఏం చేస్తారు?’ అని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రే సంక్షేమ పథకాలు ఇచ్చేస్తుంటే, కింద ప్రజలతో మాకు సంబంధాలు లేకుండాపోతున్నాయి. వాటిని చక్కబెట్టుకోవడానికే సమయం చాలట్లేదు’ అని మరో ఎమ్మెల్యే తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts