నెల్లూరు కోర్టులో ఆధారాల చోరీ.. కేసు సీబీఐ చేతికి

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నమోదైన కేసు వ్యవహారంలో కీలక మలుపు. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి ఆధారాల చోరీపై దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

Updated : 25 Nov 2022 07:16 IST

హైకోర్టు కీలక నిర్ణయం
చోరీ అయిన పత్రాల ఫోర్జరీ కేసులో మంత్రి కాకాణి నిందితుడు

ఈనాడు, అమరావతి: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నమోదైన కేసు వ్యవహారంలో కీలక మలుపు. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి ఆధారాల చోరీపై దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, వాటిని త్వరితంగా విచారించాలని, హైకోర్టులూ పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు.. అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ కేసులో స్పష్టం చేసిందని గుర్తు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసులకు ప్రాధాన్యమిస్తున్నందున నెల్లూరులోని సంబంధిత కోర్టు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. కేసు ఆధారాలను భద్రపరచడంపై మరింత జాగ్రత్త వహించాల్సిందని పేర్కొంది. తగిన ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచకపోతే ప్రజాప్రతినిధులపై కేసులు వీగిపోయే ప్రమాదముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కేసు ప్రధానమైనదిగా భావిస్తున్నామంది. నేరగాళ్లను చట్టం ముందు నిలబెట్టి శిక్షించేందుకు సరైన సమయంలో నిర్దుష్ట చర్యలు తీసుకోకపోతే సామాన్యులకు న్యాయ వ్యవస్థపై విశ్వాసం పోతుందని తెలిపింది. పలుకుబడి ఉన్నవారు నిందితులుగా ఉన్న ఈ కేసు ఆధారాల చోరీలో ఎవరి పాత్ర ఉందనేది తేల్చాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాది రతంగపాణిరెడ్డి, సీబీఐ న్యాయవాది తదితరులు తెలిపారని గుర్తు చేసింది. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. చోరీ విషయంలో నెల్లూరు చిన్నబజారు స్టేషన్‌లో నమోదు చేసిన కేసు ఫైళ్లను సీబీఐకి అప్పగించాలని, దర్యాప్తులో సహకరించాలని నెల్లూరు ఎస్పీని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐ అధికారికీ సూచించింది.

* తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. దీనిపై ఆధారాలున్నాయంటూ పత్రాలను విడుదల చేశారు. అవి ఫోర్జరీవని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిని ఏ1గా పేర్కొంటూ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో చోరీ అయ్యాయి. ఈ వ్యవహారంపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) నివేదిక ఆధారంగా దీన్ని సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. మంత్రి కాకాణితోపాటు 18 మంది ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారించి తీర్పును వాయిదా వేసింది. దస్త్రాల చోరీపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ గురువారం నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరమని నెల్లూరు పీడీజే అభిప్రాయపడ్డారని ధర్మాసనం గుర్తు చేసింది. చోరీ అయ్యాక దర్యాప్తులో పోలీసులు సరిగా వ్యవహరించలేదని పీడీజే తన నివేదికలో పేర్కొన్నారని తెలిపింది.


సీబీఐ విచారణను స్వాగతిస్తున్నాం: కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు, న్యూస్‌టుడే: తాను ఏ తప్పు చేయనందునే సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలను ధైర్యంగా స్వాగతిస్తున్నానని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తనకు నీతి నిజాయతీ ఉన్నందునే దీనిపై అభ్యంతరం లేదని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు కూడా ఏ మాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా సీబీఐ విచారణకు సిద్ధపడాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని