రేపు గడిచేదెలా!

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మరిన్ని ప్రయత్నాలు సాగిస్తోంది. రుణం లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు. ఖజానా నుంచి చెల్లింపులకూ కష్టంగా ఉంది.

Updated : 25 Nov 2022 12:27 IST

ఇప్పటికే రుణ పరిమితి దాటేశాం
అదనంగా ఇతర రుణాలూ..
అప్పు పుట్టకుంటే గడిచేదెట్లా?
కేంద్రం అనుమతుల కోసం ప్రయత్నాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం మరిన్ని ప్రయత్నాలు సాగిస్తోంది. రుణం లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు. ఖజానా నుంచి చెల్లింపులకూ కష్టంగా ఉంది. జీతాలు, పెన్షన్లకు రుణాలపైనే ఆధారపడవలసి వస్తోంది. ప్రతి నెలా సగటున రూ. 6,000 కోట్ల వరకు బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకుంటున్న రాష్ట్రం నవంబరులో పరిమితిని దాటేసింది. తక్షణమే రుణాలు పొందే పరిస్థితులు లేకపోవడంతో సర్దుబాటుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రతి రాష్ట్రం తన స్థూల ఉత్పత్తిలో 4 శాతం మేర ఆ ఏడాది రుణాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుంది. ఏ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే రుణమైనా ఆ పరిమితికి లోబడి ఉండాలి.  డిసెంబరు నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 43,803 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ పరిమితి నవంబరు 1తోనే తీరిపోయింది. అదే రోజున రెండు విడతలుగా రూ. 700 కోట్లు, రూ.713 కోట్లు వివిధ కాల పరిమితుల్లో రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో రాష్ట్రం రుణం తీసుకుంది. తర్వాత మూడు వారాల పాటు అక్కడ రుణం సమీకరించే పరిస్థితులు లేకుండా పోయింది.


రూ.10,000 కోట్లకు ప్రతిపాదనలు..

ఏ నెలలో ఏ తేదీ నాటికి ఎంత రుణం అవసరమవుతుందో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరులో రిజర్వు బ్యాంకుకు తెలియజేసింది. ఆ ప్రకారం అక్టోబరు 3 నుంచి డిసెంబరు నెలాఖరు వరకు రూ.10,000 కోట్లు అవసరం. అక్టోబరు 3న రూ. 2,000 కోట్లు, నవంబరు 1న రూ. 2,000 కోట్లు, నవంబరు 7న రూ. 1,000 కోట్లు, నవంబరు 29న 2,000 కోట్లు అవసరమని పేర్కొంది. డిసెంబరు నెలలో మొత్తం (6, 13, 20 తేదీల్లో) రూ. 3,000 కోట్లు అవసరమని సమాచారం ఇచ్చింది. రాష్ట్ర ప్రతిపాదనల ప్రకారం నవంబరు నెలలో ఇప్పటికే రూ. 3,000 కోట్ల రుణం అవసరం. నవంబరు 1న రూ. 1,413 కోట్లు తీసుకున్న ప్రభుత్వం ఈ నెలలో అంతటితో సరిపెట్టింది. పరిమితి దాటిపోయి రుణం పుట్టించే అవకాశం లేకపోవడమే కారణమని తెలుస్తోంది. కేంద్రం నుంచి అదనపు పరిమితుల కోసం సాగుతున్న ప్రయత్నాలు ఎంతవరకు కొలిక్కి వచ్చాయో తెలీదు. నవంబరు 29, డిసెంబరు 6 తేదీల్లో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో అప్పు అవసరమవుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. నవంబరు నెల జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే రుణ సమీకరణ చేయాల్సిన పరిస్థితి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని