‘సలహాల’రావులకు అంతెక్కడ?

తమకు కావాల్సిన వారికి పునరావాసం కల్పించేందుకే ప్రభుత్వం సలహాదారుల్ని నియమిస్తోంది.. అనుకూలంగా పనిచేసిన కొందరికి ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ఈ పదవుల్ని కట్టబెట్టి సంతృప్తి పరుస్తోంది.. ఒక్కొక్కరికి జీతాలు, భత్యాల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేస్తోంది.

Published : 25 Nov 2022 05:40 IST

ప్రభుత్వానికి కావాల్సిన వారి పునరావాసానికే పదవులు  
‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చలో ఆందోళన వ్యక్తంచేసిన నిపుణులు

ఈటీవీ, అమరావతి: తమకు కావాల్సిన వారికి పునరావాసం కల్పించేందుకే ప్రభుత్వం సలహాదారుల్ని నియమిస్తోంది.. అనుకూలంగా పనిచేసిన కొందరికి ఉద్యోగ విరమణ చేసిన వెంటనే ఈ పదవుల్ని కట్టబెట్టి సంతృప్తి పరుస్తోంది.. ఒక్కొక్కరికి జీతాలు, భత్యాల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. రోడ్లు వేయడానికి, కనీసం వాటి మరమ్మతులకు కూడా నిధుల్లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూనే 50 మందికి పైగా సలహాదారుల్ని నియమించింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసినా, మీకు అధికారుల కొరత ఉందా? అని ప్రశ్నించినా?.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదు. ‘సలహాల’రావులకు అంతెక్కడ? అనే అంశంపై గురువారం ‘ఈటీవీ- ప్రతిధ్వని’లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.


సంతృప్తి పరిచేందుకే పదవులు
-ఎంవీఎస్‌ ప్రసాద్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, హైదరాబాద్‌

ప్రజాసంక్షేమం కోసం కొందరి సలహాలు అవసరం ఉంటుంది. నార్ల తాతారావు, నోరి దత్తాత్రేయ వంటి నిపుణుల సేవలు పొందడంలో ఎలాంటి అభ్యంతరం, ఆక్షేపణ ఉండదు. సంతృప్తి పరిచేందుకు అన్నట్లుగా ప్రతివారిని సలహాదారుగా పెట్టుకోవడం సరైన పద్ధతికాదు. వారికి ఏటా రూ.కోట్లు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఈ మొత్తంతో నీటివనరులను అభివృద్ధి చేయవచ్చు. పాఠశాలల నిర్మాణం, ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచవచ్చు. ఎక్కువ మంది సలహాదారులను నెత్తినపెట్టుకుని ఏళ్ల తరబడి కొనసాగించడం కంటే, నిర్దేశిత పనికి నిపుణుల సేవలు తీసుకుంటే మేలు. నా 40 ఏళ్ల సర్వీసులో ఇంత సంఖ్యను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఎందుకు పెట్టారనేది అసంబద్ధంగా ఉంది. సలహాదారుల సేవల వల్ల ఉపయోగం లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి చెబితే వాళ్ల హోదాల్లో మార్పులు, ఇతరత్రా చర్యలు ఉంటున్న ఉదంతాలున్నాయి.


సమాంతర వ్యవస్థలా సలహాదారులు
-టి.లక్ష్మీనారాయణ, సామాజిక రాజకీయ విశ్లేషకులు, విజయవాడ

ఎక్కువ మంది సలహాదారుల్ని నియమించడం ద్వారా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. చాలా మందికి కార్యాలయాలు కూడా లేవు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి. సలహాదారుగా పనిచేసిన 11 నెలల్లో తాను ఒక్కరోజు కూడా సీఎంను కలవలేదని, ఎవరూ సలహాలు అడగలేదని, ఏ సలహా ఇవ్వలేదని గతంలో రాజీనామా చేసిన రామచంద్రమూర్తి బహిరంగంగా వ్యాఖ్యానించడమే రాష్ట్రంలో సలహాదారుల పరిస్థితికి నిదర్శనం. సీఎం ఎవరి సలహాలు తీసుకోవడంలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాటే సీఎం వినడంలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సలహాదారులపై చేస్తోన్న ఖర్చు గురించి ఓ సామాజిక కార్యకర్త ఆర్‌టీఐ ద్వారా వివరాల కోసం ప్రయత్నించినా స్పష్టమైన సమాధానం రాలేదు. పెన్నానదిపై గేట్లు కొట్టుకుపోయాయి. పులిచింతల వద్ద గేట్లు కొట్టుకుపోయాయి. మరమ్మతులు చేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని