టెండర్లు వేయండి ప్లీజ్‌!

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వచ్చే ఏడాది విద్యా కానుక కింద అందించనున్న బ్యాగ్‌లు, ఏకరూప దుస్తుల సరఫరాకు గుత్తేదార్లు ముందుకు రావడం లేదు.

Updated : 25 Nov 2022 06:06 IST

విద్యా కానుకకు దూరంగా గుత్తేదార్లు  
బకాయిలిస్తేనే వస్తామంటూ షరతు
బతిమిలాడుతున్న అధికారులు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వచ్చే ఏడాది విద్యా కానుక కింద అందించనున్న బ్యాగ్‌లు, ఏకరూప దుస్తుల సరఫరాకు గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. పాత బిల్లులు చెల్లిస్తేనే టెండర్లు వేస్తామని చెబుతున్నారు. ఇటీవల టెండర్లలో బ్యాగ్‌లకు సంబంధించి ఒక్కరే టెండరు వేయగా.. ఏకరూప దుస్తులకు అయితే ఎవ్వరూ రానేలేదు. ఈ ఏడాది విద్యా కానుకకు సంబంధించి సుమారు రూ. 820 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వం రూ. 170 కోట్లు మాత్రమే విడుదల చేసింది. సుమారు రూ. 650 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కిట్లు సరఫరా పూర్తయినా చెల్లించలేదు. విద్యా కానుక కిట్లు అందించడంలో ఈ ఏడాది తీవ్ర జాప్యం జరిగినందున వచ్చే సంవత్సరం పాఠశాలల పునఃప్రారంభం రోజునే అందించాలని, ఇప్పటి నుంచే టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇప్పుడు గుత్తేదార్లు ముందుకు రాకపోవడంతో అధికారుల్లో అయోమయం నెలకొంది. బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నా వారు ఆసక్తి చూపడం లేదు.

గుత్తేదార్లపై చర్యలు కష్టమే..

గుత్తేదార్లు ఏకరూప దుస్తులు, ఇతరత్రా సామగ్రిని సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఈ సంవత్సరం జులై నుంచి సెప్టెంబరు వరకు విద్యా కానుకను అందిస్తూనే ఉన్నారు. ఏకరూప దుస్తుల సరఫరాలో మరింత జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం సకాలంలో సరఫరా చేయనందున గుత్తేదార్లపై చర్యలు తీసుకునే అధికారం సమగ్ర శిక్ష అభియాన్‌కు ఉంది. కానీ, ఈ ఏడాది టెండర్ల ప్రక్రియలోనే జాప్యం జరిగిందని అధికారులు తేల్చేస్తున్నారు. బ్యాగ్‌లు విద్యార్థులకు అందించిన పక్షం రోజుల్లోనే చినిగిపోయినా చర్యలు తీసుకోలేకపోతున్నారు. టెండర్ల సమయంలో అధికారులు చెప్పిన నాణ్యత ప్రమాణాల ప్రకారమే సరఫరా చేశామని గుత్తేదార్లు బుకాయిస్తున్నారు. దీంతో అధికారులు మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ముగ్గురు ఉద్యోగులపై ఆరోపణలు

బ్యాగ్‌ల నాణ్యత ప్రమాణాల నిర్ణయంలో గుత్తేదార్లతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలతో సమగ్ర శిక్ష అభియాన్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. రెండురోజులుగా దస్త్రాలు పరిశీలించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts