విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లోనూ మార్పులు తీసుకొస్తున్నామని, విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.

Published : 25 Nov 2022 05:40 IST

పాలీటెక్‌ ఫెస్ట్‌ ప్రారంభ సభలో మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: విద్యార్థులకు చదువుతోపాటు నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్‌లోనూ మార్పులు తీసుకొస్తున్నామని, విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. విజయవాడలో 3 రోజులపాటు జరగనున్న పాలీటెక్‌ ఫెస్ట్‌ను గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘పాలిటెక్నిక్‌ విద్యార్థులు విభిన్న ప్రయోగాత్మక ప్రాజెక్టులను ఆవిష్కరించడం అభినందనీయం. బ్లూటూత్‌ టెక్నాలజీ ద్వారా జ్యోతిని వెలిగించడం అధునాతన సాంకేతికతకు అద్దం పడుతోంది. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలి. లేదంటే జీవితంలో ఏమీ సాధించలేరు’ అని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు మల్లాది విష్ణు, ఉపాధి, శిక్షణశాఖ డైరెక్టర్‌ లావణ్య వేణి పాల్గొన్నారు.

విద్యార్థుల కార్యక్రమంలో జగన్‌ భజన..: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన పాలిటెక్‌ ఫెస్ట్‌లో ‘మన జనం మెచ్చిన వారసుడు.. మాటతప్పని.. మడమ తిప్పని జగనన్న.. ప్రవేశపెట్టేను జగనన్న నవరత్నాలు’ అంటూ సీఎం జగన్‌ను పొగుడుతూ ప్రదర్శించిన సంప్రదాయ నృత్యంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల చేత కూచిపూడి నృత్య రూపకంతో జగన్‌ను పొగుడుతూ ప్రదర్శన చేయించారు. విద్యార్థులు తమ నృత్యంలో నవరత్నాల ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నృత్య రూపకాన్ని అన్ని వేదికలపైనా ప్రదర్శించాలని అనుకుంటున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని