ఓ ముఖ్య కార్యదర్శి నడకోపాఖ్యానం.. ప్రవీణ్‌ప్రకాశ్‌ రూటే సెపరేటు

జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమాలో మైళ్లకు మైళ్లు వాహ్యాళిగా నడుస్తూ.. తనతోపాటు ఇతరులనూ బలవంతంగా నడిపిస్తుండే సుత్తి వీరభద్రరావు ‘గుండు పాండురంగారావు’ పాత్ర గుర్తుండే ఉంటుంది చాలామందికి.. రాష్ట్ర సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తీరు కూడా ఇలాగే ఉంది.

Updated : 26 Nov 2022 03:37 IST

నడుస్తూనే.. దస్త్రాలపై అధికారులతో చర్చలు!
ప్రవీణ్‌ప్రకాశ్‌ రూటే సెపరేటు

ఈనాడు, అమరావతి: జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమాలో మైళ్లకు మైళ్లు వాహ్యాళిగా నడుస్తూ.. తనతోపాటు ఇతరులనూ బలవంతంగా నడిపిస్తుండే సుత్తి వీరభద్రరావు ‘గుండు పాండురంగారావు’ పాత్ర గుర్తుండే ఉంటుంది చాలామందికి.. రాష్ట్ర సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తీరు కూడా ఇలాగే ఉంది. కొత్తగా వచ్చిన ఆ ముఖ్య కార్యదర్శి సచివాలయంలోని తన ఛాంబర్‌లో కంటే పార్కులోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. అక్కడే నడుస్తూ.. వివిధ దస్త్రాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తుంటారు. ఆయన ధోరణి చూసి అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోతున్నారు. రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌ప్రకాశ్‌ వ్యవహారమిది. ఏదైనా సమీక్ష ఉన్నపుడు, దస్త్రాలకు సంబంధించి చర్చించడానికి అధికారులు ఆయన కోసం సచివాలయం అయిదో బ్లాక్‌లో ఛాంబర్‌కు వెళితే అక్కడ కనిపించరు! పక్కనే ఉండే పార్కులో నడుస్తూ ఉంటారు. అధికారులూ ఆయనతోపాటు నడుస్తూనే తమ దస్త్రాల గురించి చర్చిస్తుంటారు. పెద్దగా నడక అలవాటులేనివారు ఆయనతోపాటు నడవలేక ఆపసోపాలు పడుతుంటారు. ఆయన నుంచి పిలుపు వచ్చిందంటే తప్పకుండా నడకకు సిద్ధమై వెళ్లాల్సిందేనని భావిస్తున్నారు. నడవలేమని చెబితే.. ఆయనకు ఎక్కడ కోపం వస్తుందోననే భయంతో నోటికి కాకుండా కాళ్లకు మాత్రమే పని చెబుతూ.. మారుమాట్లాడకుండా తమ పని పూర్తి చేసుకుని వెళ్తుంటారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో సచివాలయంలో కంటే ఎక్కువగా పార్కులోనే నడుస్తూ కనిపిస్తుంటారు. ఇంతక్రితం సాధారణ పరిపాలన విభాగంలో ఉన్నప్పుడూ ఆయన ఇలాగే సచివాలయం ఆవరణలో ఎక్కువగా నడుస్తూనే విధులు నిర్వర్తిస్తుండేవారు. నడక ఆరోగ్యానికి మంచిదనే ఆయన ఉద్దేశం మంచిదేకానీ.. నడుస్తూనే పనిచేసే ఈ ‘వాక్‌’థాన్‌ ఏమిటో అర్థంకాక సిబ్బందికి కాళ్లు తడబడుతున్నాయి! సచివాలయంలో ఇప్పుడు ఇదొక నడకోపాఖ్యానం అయింది!

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు