అవే పనులు.. మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు

కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

Published : 26 Nov 2022 02:59 IST

కాకినాడ, న్యూస్‌టుడే: కాకినాడ యాంకరేజి పోర్టు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయితే, సాగరమాల ప్రాజెక్టు కింద మంజూరైన ఈ పనులకు రెండుసార్లు శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక్కడ రూ.91.185 కోట్లతో పనులు చేపట్టడానికి పరిపాలనామోదం ఇచ్చారు. దీనిలో అంచనా విలువ రూ.73.42 కోట్లుగా పేర్కొన్నారు. ఒప్పంద విలువ రూ.73.34 కోట్లుగా చూపారు. రూ.73.42 కోట్ల పనులకు ఈనెల 3న కాకినాడ యాంకరేజి పోర్టులో ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించారు. తర్వాత ఏమైందోగానీ.. శుక్రవారం అవే పనులకు ఇదే యాంకరేజి పోర్టులో రాష్ట్ర మంత్రులు గుడివాడ అమరనాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, కలెక్టర్‌ కృతికాశుక్లా శంకుస్థాపన చేశారు. మళ్లీ శంకుస్థాపనలపై కాకినాడ పోర్టు అధికారులను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. ఈనెల 3న డ్రెడ్జింగ్‌ పనులకు శంకుస్థాపన జరిగిందని, శుక్రవారం మిగతా పనులకు శంకుస్థాపన చేశారని చెప్పారు. కానీ ఈ నెల 3న శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పరిశీలిస్తే.. రూ.73.42 కోట్లతో యాంకరేజి పోర్టులో అభివృద్ధి పనులకే అని ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని