పట్టణ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్‌

నగరాలు, పట్టణాల్లో సమస్యలను గుర్తించి, సత్వరం పరిష్కరించేందుకు, మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నెల రోజుల వ్యవధిలో ప్రత్యేక యాప్‌ తీసుకురానుంది.

Published : 26 Nov 2022 06:09 IST

నెల రోజుల్లో అందుబాటులోకి...  
పురపాలక శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ఈనాడు, అమరావతి: నగరాలు, పట్టణాల్లో సమస్యలను గుర్తించి, సత్వరం పరిష్కరించేందుకు, మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నెల రోజుల వ్యవధిలో ప్రత్యేక యాప్‌ తీసుకురానుంది. రోడ్లపై గుంతలు, వాటి మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిదీపాల నిర్వహణ, ప్రజా మరుగుదొడ్ల ఏర్పాటు, ట్రాఫిక్‌ కూడళ్ల నిర్వహణవంటి అంశాలపై యాప్‌ ద్వారా రియల్‌టైంలో అధికారులు పర్యవేక్షించనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సందర్భంగా ప్రత్యేక యాప్‌ గురించి అధికారులు సీఎంకు వివరించారు. వార్డు కార్యదర్శులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజలు ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి పరిష్కరించే వరకు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

గ్రామాల్లోనూ తేవాలని ఆదేశం

సమస్యల గుర్తింపు, సత్వర పరిష్కారానికి ఉద్దేశించిన ప్రత్యేక యాప్‌ను గ్రామాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘యాప్‌ ద్వారా గుర్తించిన సమస్యలను పరిష్కరించే వ్యవస్థ బలోపేతం కావాలి. నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. వర్షాకాలంతోపాటు అన్ని కాలాల్లోనూ రహదారులు బాగుండేలా ఆధునిక సాంకేతికతపైనా దృష్టి పెట్టాలి. దీర్ఘకాలం మన్నే పద్ధతిలో రహదారులను నిర్మించేలా చూడాలి’ అని సీఎం స్పష్టంచేశారు. ‘పట్టణ ప్రణాళికతోసహా ఇతర అన్ని విభాగాల్లోనూ ప్రజలకు సత్వరం సేవలందేలా, నిర్ణీత గడువులోగా అనుమతులిచ్చేలా ఇప్పుడున్న సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లలో మార్పులు చేయడంపైనా పరిశీలించాలి. అవినీతి రహిత సేవల లక్ష్యంగా మార్పులు తీసుకురావాలి’ అని అధికారులతో జగన్‌ అన్నారు.

వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి ప్లాంటుకు ఆమోదం

వ్యర్థాల నుంచి విద్యుదుత్పుత్తి చేసే ప్లాంటును రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసే ప్రతిపాదనకు సీఎం జగన్‌ ఆమోదించారు. 28 పట్టణ స్థానిక సంస్థల నుంచి సేకరించే వ్యర్థాలతో 7.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. సమీక్ష సమావేశంలో పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని