ఏపీ కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డి?

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని నియమించనున్నట్టు సమాచారం. ఈ ఉత్తర్వులు శనివారం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

Updated : 26 Nov 2022 06:33 IST

30న సమీర్‌శర్మ పదవీ విరమణ
ఆయనకు కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ పోస్టు?

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని నియమించనున్నట్టు సమాచారం. ఈ ఉత్తర్వులు శనివారం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ  ఈ నెల 30న పదవీవిరమణ చేస్తున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త ప్రధానకార్యదర్శిగా జవహర్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తారు. 2024 జూన్‌ వరకు ఆయనకు సర్వీసు ఉంది. అంటే మరో ఏడాదిన్నరపాటు ఆయన సీఎస్‌ పోస్టులో కొనసాగే అవకాశం ఉంది. సీఎస్‌గా పదవీవిరమణ అనంతరం సమీర్‌శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమించనున్నట్టు తెలిసింది. దాంతో పాటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌షిప్‌, ఎక్స్‌లెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఐఎల్‌ఈ అండ్‌ జీ) వైస్‌ఛైర్మన్‌ పోస్టులోనూ ఆయనను ఇన్‌ఛార్జిగా నియమించనున్నట్టు సమాచారం. కొత్త సీఎస్‌గా నియమితులవనున్న జవహర్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1990 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన కంటే సీనియర్లయిన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ (1987), పూనం మాలకొండయ్య (1988), కరికాల్‌ వలెవన్‌ (1989) సీఎస్‌ పోస్టును ఆశించినా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం... జవహర్‌రెడ్డివైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జవహర్‌రెడ్డికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కోరిక మేరకే... తితిదే ఈవోగా నియమించారు. ఆ పోస్టులో కొనసాగిస్తూనే, సీఎంఓకి తీసుకొచ్చారు. కొన్ని నెలలపాటు ఆయన రెండు బాధ్యతల్నీ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం సీఎంఓ వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా సీఎస్‌ పోస్టులో నియమించాలన్న ప్రతిపాదనను ఒక దశలో పరిశీలించినట్లు తెలిసింది.

విధేయంగా ఉంటే... పదవీవిరమణ తర్వాతా కీలక పోస్టులు!

వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు నలుగురు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. వారిలో ఒక్క ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్ప... మిగతా ముగ్గురూ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అత్యంత విధేయంగా మెలిగారు. అసలు సీఎస్‌ పోస్టు అంటూ ఒకటి ఉందా... అన్న అనుమానం వచ్చేలా, సొంత నిర్ణయాలేమీ తీసుకోకుండా ముఖ్యమంత్రి కార్యాలయం ఏది చెబితే దానికి తలాడిస్తూ వచ్చారు. ఆ విధేయతకు బహుమానంగా.. సర్వీసు ముగిశాక కూడా కొన్ని నెలల కొనసాగింపుతో పాటు, పదవీవిరమణ తర్వాత కీలక పోస్టులూ దక్కాయి. నీలంసాహ్నిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌గాను, ఆదిత్యనాథ్‌దాస్‌ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగాను నియమించారు. సమీర్‌శర్మ 2021 అక్టోబరు 10న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2021 నవంబరు 30న పదవీవిరమణ చేయాల్సి ఉండగా, సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రం మొదట ఆరు నెలల పాటు పొడిగింపునిచ్చింది. సీఎం మరోసారి లేఖ రాయడంతో రెండోసారి మరో ఆరు నెలలు పొడిగింపునిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని