Andhra News: ‘కీలకపాత్ర’ సీఎంవోదే

నాటి విశాఖ భూ కుంభకోణంలో ఎన్నో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) జోక్యంతోనే రూ.కోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి.

Updated : 26 Nov 2022 07:22 IST

విశాఖ భూకుంభకోణం గుట్టు విప్పిన సిట్‌
ఎన్వోసీల జారీకి అడుగడుగునా ముఖ్యమంత్రి కార్యాలయం మద్దతు
ప్రభుత్వ భూమి కేటాయింపులు, విక్రయాలు అన్నీ మూడేళ్లలోనే
రూ.60 కోట్ల ప్రభుత్వ భూమి దళారుల హస్తగతం
అమ్మకాలకు అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన సిఫార్సు  
ఆధారాలతో తేల్చి చెప్పిన ప్రత్యేక దర్యాప్తు బృందం

ఈనాడు, అమరావతి: నాటి విశాఖ భూ కుంభకోణంలో ఎన్నో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) జోక్యంతోనే రూ.కోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) జారీ చేయించడంలో దాని పాత్ర ఎంతో కీలకంగా మారిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చి చెప్పింది. ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు వీలు కల్పించే ఫైళ్లపై సిఫార్సు చేస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతకాలు చేయడం, తర్వాత ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయంతో ఎన్వోసీల జారీ చకచకా సాగిపోయింది. నిరంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తూ, అనుమతులు ఇప్పించే క్రమంలో సీఎంవో ప్రత్యేక శ్రద్ధ వహించింది. జిల్లా అధికారులు కాదూ, కూడదన్నా అనుమతులు మంజూరయ్యాయంటే పై స్థాయి ఒత్తిడి ఏ స్థాయిలో పని చేసిందో అర్థమవుతోంది.

ఒక నిబంధన లేదు.. నియమం లేదు.. పద్ధతి లేదు.. చట్టం లేదు. అసలు డీ ఫాం భూములు ఇచ్చినట్లు అధికారికంగా నిర్ధారించే రికార్డే లేదు. ఒరిజనల్‌ డీ ఫాం పట్టాలు లేవు. అవి నకిలీ పట్టాలు మొర్రో అంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు నివేదికలు పంపినా వాటికీ దిక్కు లేదు. ఉన్నతస్థాయి ప్రమేయంతోనే ఆ భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేశారు.

2006లో పదెకరాల వ్యవసాయ భూమి కేటాయించి 2008లో అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇచ్చేశారంటే ఏ చట్టం విస్తుపోదు? స్వాతంత్య్ర సమరయోధులకు భూమి కేటాయించినా.. ఆ భూములను కోట్లాది రూపాయలకు అమ్ముకున్నా..  వారి వారసులు ఇప్పటికీ నిరుపేదల్లానే బతుకుతున్నారంటే చిత్రంగా కనిపించదూ! డీఫాం పట్టా లేకపోయినా వాటి నకళ్లతో దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైన లబ్ధిదారులు.. సీఎంవోలో దరఖాస్తులివ్వగానే అక్కడి నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలొచ్చి ఉరుకులు పరుగులమీద ఎన్వోసీలు జారీ అయ్యారంటే ఆశ్చర్యం కలగదూ! ఇలాంటి చిత్రవిచిత్రాల మధ్య నాటి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతో చేతులు మారిన భూములు అచ్చంగా 25.79 ఎకరాలు. అదీ మారుమూల పల్లెలో కాదు ప్రస్తుతం విశాఖ నగరంలో భాగమైన భీమునిపట్నం మండలం కాపులుప్పాడలో..


మూడేళ్లలోనే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

సాధారణంగా ప్రభుత్వ భూమి ఎవరికైనా కేటాయిస్తే, డీ ఫాం పట్టా ఇస్తే వాటిని అమ్ముకోవడానికి కొన్నేళ్లు ఆగాలి. విశాఖ కుంభకోణంలో 2006లో కాపులుప్పాడ వద్ద 10 ఎకరాల భూమి స్వాతంత్య్ర సమరయోధుడి భార్య పేరుతో కేటాయించి.. మూడేళ్లయినా నిండకుండానే అమ్మేసుకున్నారు. దాదాపు రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఎంత సులభంగా కేటాయించేశారో, అడ్డగోలుగా అమ్ముకోవడానికి ఎలా అనుమతిచ్చారో చూస్తే విస్తుపోవాల్సిందే. ఈ వ్యవహారంలో నాటి అధికారులు, ప్రభుత్వ స్థాయిలో అనధికారుల పాత్రపై విచారణ చేయించాలని సిట్‌ సిఫారసు చేసింది. అప్పటి రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి వెంకటసుబ్బయ్య తప్పుడు నోట్‌ పెట్టినట్లు అనుమానం వ్యక్తం చేసింది. తద్వారా రూ.కోట్ల విలువైన భూమి ఎసైన్‌మెంట్‌కు దోహదపడ్డారని పేర్కొంది. సరైన క్రిమినల్‌ విచారణ జరిపితే తెరవెనుక వ్యక్తులను బయటకు తేవచ్చని సూచించింది. ఇందులో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబం కాకుండా దళారులే లాభపడ్డారని తేల్చి చెప్పింది.

ఈ కేసులో స్వాతంత్య్ర సమరయోధుడు రంగూరి అప్పారావు భార్య రంగూరి మీనాక్షి పేరుతో రెండుచోట్ల విడివిడిగా 2.99 ఎకరాలు, 7.01 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపుల ప్రతిపాదనను అనేకసార్లు జేసీలు తిరస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఎసైన్‌మెంట్‌ కింద విశాఖలో వ్యవసాయ భూమి కేటాయించకూడదన్న నిబంధనను ప్రస్తావిస్తూ కలెక్టర్‌ అప్పారావు ఆ దరఖాస్తును రెండుసార్లు తిరస్కరించారు. ఆమె పేరుతో నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వినతిపత్రం అందింది. మంత్రి కలెక్టర్‌కు పంపారు. జిల్లా కలెక్టర్‌ తిరస్కరించినా ప్రత్యేక కేసుగా ప్రభుత్వం పరిగణించి ఆమెకు భూమి కేటాయించింది. 2006 జూన్‌ 4న పట్టా, జూన్‌ 8న పట్టాదారు పాసుపుస్తకం కూడా ఇచ్చేశారు. మీనాక్షి పేరుతో కేటాయించిన పదెకరాల భూమిని అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముందే తెల్లకాగితాలపై వారి సంతకాలు తీసుకున్నారని హైదరాబాద్‌లోని ఏసీబీ ఏసీపీ సంపత్‌కు లేఖ వెళ్లింది.

ఈ భూమి అమ్ముకుంటానంటూ 2007 ఏప్రిల్‌ నెలలో మీనాక్షి పేరుతో సీఎంవోకు దరఖాస్తు అందింది. దాన్ని అప్పటి జిల్లా కలెక్టర్‌కు పంపారు. ‘మీనాక్షి పరిస్థితి దయనీయంగా ఉంది. వైద్య ఖర్చులు కూడా భరించలేని స్థితిలో.. చిట్టివలసలో ఉండే మూడో కుమారుడైన విశ్వేశ్వరరావు వద్ద ఉంటున్నారు’ అని తమ పరిశీలనలో తేలిందని భీమునిపట్నం తహసీల్దారు నివేదించారు.

స్వాతంత్య్ర సమరయోధులు పదేళ్ల తర్వాత భూమి అమ్ముకునేందుకు అర్హత ఉంటుందని.. అయితే భూకేటాయింపు జరిగి ఏడాది మాత్రమే గడిచిందని కలెక్టర్‌ 2007 నవంబరు 29న సీసీఎల్‌ఏకు నివేదించారు.

ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ భూమి అమ్మకానికి అనుమతివ్వాలని నిర్ణయించినట్లు 2007 జులై 25న ప్రభుత్వం మెమో ఇచ్చింది.  ప్రభుత్వం ఈ భూమి అమ్మకానికి అనుమతిచ్చిందని, భీమునిపట్నం సబ్‌రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలివ్వాలని జులై 30న మామపల్లి లక్ష్మి, భాస్కరరావు, విశ్వేశ్వరరావు, రత్నం అనే వ్యక్తులు కలెక్టర్‌ను కోరారు. దీంతో కలెక్టర్‌ ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, అమ్ముకునేందుకు వీలు కల్పించారు. మీనాక్షి 2008 మార్చిలో చనిపోగా ఆమె వారసులు అదే ఏడాది ఆగస్టులో పట్టాదారు పాసుపుస్తకాలు సంపాదించారు. ఆ భూములను కొవ్వూరు వెంకట సత్యనారాయణరెడ్డి, మంతెన నాగమణి మూడెకరాల చొప్పున, పెన్మత్స సత్యనారాయణరాజు, ఇందుకూరి కృష్ణంరాజు రెండెకరాల చొప్పున కొన్నారు. ఆ భూములు తమవంటూ కడప జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడ బోర్డులు పెట్టారని సిట్‌     గుర్తించింది. రూ.60 కోట్ల విలువైన భూమిని అమ్మిన రంగూరి మీనాక్షి వారసులు.. ఇప్పటికీ చిన్నచిన్న పనులు చేస్తూ బతుకు బండి లాగుతున్నారని తేల్చింది. దీన్ని బట్టి చూస్తే అసలు  లబ్ధిదారులు వేరేనని గుర్తించింది. ప్రభుత్వ  నిబంధనలు సడలించడం ద్వారా 80 ఏళ్ల మీనాక్షికి 10 ఎకరాల ఎసైన్డ్‌ భూమి కేటాయింపు, అమ్మకం వ్యవహారమంతా పూర్తిగా బయటి వ్యక్తులే నడిపించారని సిట్‌ తేల్చింది.

నకిలీపట్టాలని అనుమానించినా.. భూమి అమ్మకాలకు అనుమతి

అదే కాపులుప్పాడలో మరో అయిదెకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. నకిలీ పట్టాను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతోనే ఎన్వోసీలు జారీ అయ్యాయని సిట్‌ తేల్చింది. విశ్రాంత సైనికోద్యోగి అయిన తన భర్త తిరుమలశెట్టి మోహన్‌బాబుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇచ్చిందని, ఆయన చనిపోయినందున ఆ భూమి అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇవ్వాలంటూ తిరుమలశెట్టి శివకామేశ్వరి పేరుతో జిల్లా అధికారులకు దరఖాస్తు అందింది. జిల్లా అధికారులు అది నకిలీ పట్టాగా అనుమానించి ససేమిరా అన్నారు. సీఎంవో జోక్యం చేసుకుని దస్త్రాన్ని కదిపింది. నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ఈ భూములు అమ్ముకునే ఫైలుకు అనుమతిస్తూ సిఫార్సు చేయగా ప్రభుత్వస్థాయిలో మెమో జారీ అయింది. సిట్‌ నివేదిక ప్రకారం కీలకాంశాలివీ.

ప్రభుత్వం ఈ భూమిని 1992లో కేటాయించిందని, తన భర్త 2003లో చనిపోయారని, తాను ఆ భూమి అమ్ముకునేందుకు అనుమతివ్వాలని శివకామేశ్వరి 2006లో జేసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సర్వే నంబరులో డీ ఫాం పట్టా ఇచ్చినట్లు తమ వద్ద ఎలాంటి రికార్డు దొరకలేదని ఎమ్మార్వో పేర్కొన్నారు. 10(1) అడంగల్‌లో మాత్రం ఆ పేరుతో నమోదై ఉందన్నారు. అయినా దరఖాస్తు రిజిస్టర్‌లో పేరు లేనందున తాము ఎన్వోసీ జారీ చేయలేమంటూ నాటి జేసీ తిరస్కరించారు. శివకామేశ్వరి హైకోర్టును ఆశ్రయించగా పునఃపరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శివకామేశ్వరి స్వయంగా లేదా న్యాయవాది సాయంతో వచ్చి వారి దగ్గరున్న డాక్యుమెంట్లు తమకు చూపించాలని అప్పటి జేసీ మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. ఆమె హాజరుకాలేకపోతే అందుబాటులో ఉన్న రికార్డు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. నోటీసివ్వడానికి వెళితే శివకామేశ్వరి ఆ చిరునామాలో లేరని మండల రెవెన్యూ అధికారి తెలియజేశారు. పిటిషనర్‌ జేసీ ముందు హాజరు కాలేదు. తన దగ్గరున్న డీ ఫాం పట్టా చూపించలేదు. దీంతో ఎన్వోసీ జారీకి నిరాకరిస్తున్నట్లుగా సమాచారాన్ని జేసీ.. శివకామేశ్వరి చిరునామాకు రిజిస్టర్‌ పోస్టులో పంపారు. అక్కడ ఆమె లేరని ఆ పత్రం తిరుగు టపాలో వచ్చేసింది. తర్వాత దరఖాస్తుదారు నాటి సీఎంవోలో మళ్లీ వినతిపత్రం ఇచ్చారు. అప్పటి నుంచి సీఎంవోకూ జిల్లా కలెక్టరేట్‌ మధ్య అనేకసార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి. ఈ భూమికి సంబంధించి ఎన్వోసీ జారీ చేసేందుకు జిల్లా అధికారులు అనేకసార్లు తిరస్కరించినా ప్రత్యేకంగా రెవెన్యూ ఉన్నతాధికారులు హైదరాబాద్‌ రప్పించి మరీ చర్చించారు. తర్వాత ప్రభుత్వమే ఆ భూమి అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇచ్చేసింది. 2008 ఏప్రిల్‌ 26న ప్రభుత్వం మెమో జారీ చేయగా, జిల్లా కలెక్టర్‌ మే 21న ఎన్వోసీ ఇచ్చేశారు. తదనుగుణంగా 22ఏ రిజిస్టర్‌ నుంచి ఆ భూములను తొలగించారు. ఈ భూమిని రుద్రరాజు రామకృష్ణంరాజు, పరిమి విజయలక్ష్మి, బుద్ధరాజు మెహర్‌ప్రసాద్‌, అల్లూరి రామకృష్ణవర్మలు కొనుగోలు చేశారు.

అనేక అనుమానాలున్నా..

మాజీ సైనికోద్యోగి పేరుతో మోహన్‌బాబుకు 1992లో భూమి ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. అప్పటికి ఆయన సైనికోద్యోగిగానే ఉన్నారు. ఎసైన్‌ చేశారని చెబుతున్న ఫసలీ సంవత్సరం 1402లో సంబంధిత రికార్డుల్లో ఆయన పేరు లేదు. దరఖాస్తు రిజిస్టర్‌లో కూడా ఆధారాలు లభించలేదు. అసలు డీ పట్టా అందుబాటులో లేదు. తమ వద్ద ఉందని వారు చెబుతున్న పట్టా ప్రతిపై ఉన్న ఎమ్మార్వో సంతకం, అప్పటి భీమునిపట్నం ఎమ్మార్వో సంతకంతో పోలి లేదు. ఆ భూమి కొండపోరంబోకుగా రికార్డులో నమోదై ఉంది. ఎవరికైనా ఆ భూమి ఎసైన్‌ చేస్తే ఎమ్మార్వో దాన్ని కొండపోరంబోకు నుంచి వేరు చేసి చూపాలి. అలా చేసిన దాఖలాల్లేవు. ఈ కారణాలన్నింటితో అసలు ఆ భూమి ఎసైన్‌ చేశారన్న విషయంలోనే అనుమానాలున్నాయని సిట్‌ తేల్చింది. అయినా సరే.. ఆ భూమి అమ్ముకునేందుకు వీలుగా ఎన్వోసీ జారీ చేయడంలో నాటి సీఎంవో, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలకంగా వ్యవహరించారని తేల్చింది.


కేటాయింపులపైనా అనుమానాలే.. అయినా అమ్మేసుకోమన్నారు!

దే కాపులుప్పాడలో ఏకంగా 10.79 ఎకరాలను అమ్ముకోవడానికి నాటి సీఎంవో ప్రత్యేక జోక్యంతో నిరభ్యంతర పత్రాలు జారీ అయ్యాయి. వెంకటేశ్వర్లు, తోకాడ రాములు, బ్రహ్మయ్యలకు మాజీ సైనికోద్యోగుల కోటాలో కేటాయించిన భూములను ఎన్వోసీ లేకుండా తాను కొన్నానని, ఇప్పుడు వాటిని విక్రయించుకునేందుకు నిరభ్యంతర పత్రం ఇప్పించాలని కాళీ ప్రసాదరావు అనే వ్యక్తి 2009 జులై 9న సీఎంవోలో వినతిపత్రం అందించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖ కలెక్టర్‌ను ఆదేశించింది. భీమునిపట్నం తహసీల్దార్‌, విశాఖపట్నం ఆర్డీవో విచారించి ఆ ముగ్గురికీ భూమిని ఎసైన్‌ చేసినట్లుగా రికార్డుల్లో ఆధారాలు లభించలేదని, అవి నకిలీ పట్టాలు కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఎన్వోసీ జారీకి ప్రభుత్వమే మెమో ఇచ్చింది..

జిల్లా యంత్రాంగం రికార్డులు లేవంటున్నా రెవెన్యూ ఉన్నతాధికారుల సాయంతో దస్త్రం నడిపించారు. కాళీ ప్రసాదరావుకు భూములను విక్రయించుకునేందుకు ఎన్వోసీ జారీ చేయాలని 2010 మే 21న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కలెక్టర్‌కు మెమో పంపింది. దీంతో కాళీ ప్రసాదరావుకు ఎన్వోసీ జారీ చేస్తూ, ఆ భూములను 22ఎ నుంచి తొలగిస్తూ జూన్‌ 7న విశాఖ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2010 జులై నుంచి 2013 ఫిబ్రవరి మధ్య కాళీ ప్రసాదరావు ఈ భూములను ఏడుగురికి విక్రయించారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన మెమోను తిరిగి పరిశీలించాలని 2013 జులై 26న అప్పటి విశాఖ కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ‘ఆ ముగ్గురికీ (వెంకటేశ్వర్లు, రాములు, బ్రహ్మయ్య) మాజీ సైనికోద్యోగుల కోటాలో భూమిని ఎసైన్‌ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఆధారాలు లేవు. 1992లో ఎసైన్‌ చేసినట్లు వారు డీ పట్టాలు చూపుతున్నారు’ అని నివేదించారు.

ఉద్యోగ విరమణ చేసిన 46 ఏళ్లకు పట్టాలిచ్చారా!

వెంకటేశ్వర్లు 1962లో, రాములు 1974లో, బ్రహ్మయ్య 1946లో సైన్యం నుంచి బయటకొచ్చారని సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సమాచారమిచ్చినట్లు కలెక్టర్‌ లేఖలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సైన్యం నుంచి బయటకొచ్చాక ఏడాదిలోపు వీరికి భూములు కేటాయించాలి. ఈ కేసులో వెెంకటేశ్వర్లు సైన్యం నుంచి వచ్చిన 30 సంవత్సరాలకు, రాములుకు 18 ఏళ్లకు, బ్రహ్మయ్యకు 46 సంవత్సరాల తర్వాత ప్రభుత్వ భూములు ఇచ్చినట్లు వారి దగ్గరున్న డీ పట్టాలు చూపిస్తుండటం గమనార్హం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు