మూడో తరగతిలోనూ మాతృభాష చదవలేకపోతున్నారు!

తెలంగాణ, ఏపీలలో మూడో తరగతి విద్యార్థులు కూడా తెలుగును తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. ఈ విషయంలో ఏకంగా 52 శాతం మంది కనీస ప్రమాణాలు చేరుకోలేదు. మొత్తం విద్యార్థుల్లో 19 శాతం మంది ఒక్క పదమూ సరిగా పలకలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 26 Nov 2022 05:47 IST

తెలుగు రాష్ట్రాల్లో 52 శాతం మంది విద్యార్థుల పరిస్థితి ఇదీ
19% మంది ఒక్క తెలుగు పదమూ చదవలేకపోయారు
ఎన్‌సీఈఆర్‌టీ సర్వేలో వెల్లడి

ఈనాడు,  హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీలలో మూడో తరగతి విద్యార్థులు కూడా తెలుగును తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. ఈ విషయంలో ఏకంగా 52 శాతం మంది కనీస ప్రమాణాలు చేరుకోలేదు. మొత్తం విద్యార్థుల్లో 19 శాతం మంది ఒక్క పదమూ సరిగా పలకలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గణితంలో ఏపీలో 47 శాతం, తెలంగాణలో 49 శాతం మంది కనీస ప్రమాణాలను అందుకోలేకపోయారు. ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషన్‌ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) పేరిట అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాల్ని అమలు చేస్తోంది. తెలంగాణలో ‘తొలిమెట్టు’ పేరుతో ఆగస్టు 15న దీనికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా మౌఖికంగా, రాతపూర్వకంగా పరిశీలించారు. మొత్తం 20 మాతృభాషల్లో, గణితంలో 3వ తరగతి విద్యార్థుల పరిస్థితిపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) తాజాగా నివేదికను విడుదల చేసింది. సర్వేలో భాగంగా ప్రతి రాష్ట్రంలో కొందరు విద్యార్థులను కలిసి నివేదిక రూపొందించారు. దేశంలోని 10 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 3వ తరగతి విద్యార్థులు 86 వేల మందికి సంబంధించిన అధ్యయన నివేదిక ఇది. తెలుగు రాష్ట్రాల్లో 183 పాఠశాలల్లోని 1,583 మంది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.

అబ్బాయిల కంటే మెరుగ్గా అమ్మాయిలు

ప్రపంచస్థాయి ప్రమాణాల ప్రకారం నిమిషంలో 8 పదాలలోపు మాత్రమే చదవగలిగిన వారిలో కనీస ప్రాథమిక పరిజ్ఞానం లేదని అర్థం. 9-26 మధ్య పదాలను తప్పులు లేకుండా చదివితే ప్రపంచ కనీస ప్రమాణాలను పాక్షికంగా అందుకున్నట్లు లెక్క. 27-50 మధ్య పదాలు చదవగలిగితే ప్రపంచ కనీస సామర్థ్యాలను కలిగి ఉన్నారని లెక్క. ఈ ప్రకారం ఏపీ, తెలంగాణలలో సగటున 52 శాతం మందిలో కనీస అభ్యసన సామర్థ్యాలు లేవని స్పష్టమైంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా వరకు మెరుగ్గా ఉన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ అమలు తర్వాత ఏమేర మార్పు వస్తుందో వేచిచూడాలి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు