కనిగిరిపై పోలీసుల దృష్టి

సంకల్ప సిద్ధి మార్ట్‌ గొలుసుకట్టు మోసం వ్యవహారంలో భూముల క్రయ, విక్రయాలపై విజయవాడ పోలీసులు దృష్టి సారించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 150 ఎకరాల మేర కొనుగోలు చేసినట్లు తేలింది.

Updated : 26 Nov 2022 05:33 IST

అక్కడే మూడు బృందాల దర్యాప్తు
150 ఎకరాల మేర భూముల క్రయవిక్రయాలు
సంకల్ప సిద్ధి మార్ట్‌ గొలుసుకట్టు మోసం వ్యవహారం

ఈనాడు - అమరావతి: సంకల్ప సిద్ధి మార్ట్‌ గొలుసుకట్టు మోసం వ్యవహారంలో భూముల క్రయ, విక్రయాలపై విజయవాడ పోలీసులు దృష్టి సారించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో 150 ఎకరాల మేర కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా మూడు దర్యాప్తు బృందాలు కనిగిరిలోనే తిష్ఠ వేశాయి. రూ.వందల కోట్లలో వేలాది మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసి, మోసానికి పాల్పడిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. ప్లాట్లు, ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పేరుతో ఎక్కువ మందిని సంస్థ మోసం చేసినట్లు గుర్తించారు.

క్యాష్‌బ్యాక్‌తో ఊరించడంతో ఎగబడ్డారు

రూ. 2.25 లక్షలు వెచ్చించి 35 ఎర్రచందనం మొక్కలు కొనుగోలు చేస్తే.. 15 ఏళ్ల తర్వాత ఆ మొక్కలను తీసుకుని రూ. 1.75 కోట్లు చెల్లిస్తామన్నది ఓ పథకం. సెంటు భూమిని రూ.5 లక్షలకు కొంటే.. 300 రోజుల్లో రూ. 2.5 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. ఏడాది తర్వాత భూమిని అప్పగిస్తామని సంస్థ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ పథకంలో ఎక్కువ మంది డిపాజిట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా కనిగిరి ప్రాంతంలో ఎంత భూమిని కొన్నారు? ఎవరి నుంచి కొనుగోలు చేశారు? ఎంత మొత్తం చెల్లించారు? తదితర వివరాలను రాబట్టారు. సంకల్ప సిద్ధి సంస్థకు కనిగిరి మండలం పట్టాభిరామపురంలో 150 ఎకరాలను విక్రయించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా ప్రశ్నించారు. అమ్మిన వారినే అక్కడ ఏజెంట్లుగా నియమించారు నిర్వాహకులు గుత్తా వేణుగోపాలకృష్ణ, కిరణ్‌లు. కనిగిరిలో రూ. కోటి వరకు వివిధ వర్గాల నుంచి డిపాజిట్లు వచ్చాయి. ఎకరా రూ.5 లక్షలు కూడా విలువ చేయని అక్కడి భూములను ఎక్కువ మొత్తానికి అంటగట్టేశారు. 100, 200 శాతం క్యాష్‌బ్యాక్‌ పేర్లతో ఊరించడంతో ఎక్కువ మంది ఎగబడ్డారు. ఇలా ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో పెద్ద సంఖ్యలో మోసపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎక్కడా వివరాలు వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు