సర్వేతో సమస్యకు పరిష్కారం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం బిల్లుపాడులో వృద్ధురాలి ఇంటి స్థలం సమస్యకు అధికారులు శుక్రవారం పరిష్కారం చూపారు.

Published : 26 Nov 2022 04:41 IST

చేజర్ల, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం బిల్లుపాడులో వృద్ధురాలి ఇంటి స్థలం సమస్యకు అధికారులు శుక్రవారం పరిష్కారం చూపారు. గతంలో లక్ష్మమ్మకు ఇందిరమ్మ కాలనీ కింద మూడు సెంట్ల భూమిని మంజూరు చేశారు. ఈ ప్రదేశంలో తాజాగా జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. లక్ష్మమ్మ ఇంటి పక్కనే ఆమె చెల్లెలు కోడలైన రాజేశ్వరికి తొమ్మిది అంకణాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ నివేశన పత్రం అందజేశారు. 40ఏళ్లుగా తన స్వాధీనంలో ఉన్న స్థలంలో ఇతరులు ప్రవేశించటానికి లేదని లక్ష్మమ్మ, ప్రభుత్వం ఇచ్చింది కనుక ఆ భూమిపై తనకే హక్కు ఉందటూ రాజేశ్వరి రెండు నెలలుగా తగాదా పడుతున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరి ఆమె బంధువులు లక్ష్మమ్మపై దాడి చేసి ఆమె ఇంటిని కూల్చివేశారు. ఈ విషయమై బాధితురాలు చేజర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం తహసీల్దారు శివకృష్ణయ్య తన సిబ్బందితో బిల్లుపాడుకు వెళ్లి ఇంటి స్థలాలను సర్వే చేయించారు. వివాదాస్పద భూమికి పక్కన ఖాళీగా ఉన్న స్థలాలను కలిపి ఇద్దరికి మంజూరు చేసిన మేరకు స్థలాన్ని చూపి హద్దులు ఏర్పాటు చేశారు. ఇక మీదట హద్దులు, స్థలాల విషయంలో గొడవ పడకుండా హామీ పత్రాలు తీసుకున్నారు. మరోవైపు లక్ష్మమ్మపై దాడి ఘటనపై సంగం సీఐ రవినాయక్‌ శుక్రవారం విచారణ జరిపారు. దాడికి పాల్పడిన అయిదుగురిపై కేసు సమోదు చేశామని ఆయన వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని