పేర్నినాని మనుషులు చంపేస్తామని బెదిరిస్తున్నారు

మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే పేర్నినాని మనుషులు తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ భార్యాభర్తలు శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఉన్న మల్లికార్జున థియేటర్‌ సమీపాన గల దుకాణ సముదాయం వద్దకు చేరుకున్నారు.

Published : 26 Nov 2022 04:41 IST

సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జంట

తాడేపల్లి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే పేర్నినాని మనుషులు తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ భార్యాభర్తలు శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఉన్న మల్లికార్జున థియేటర్‌ సమీపాన గల దుకాణ సముదాయం వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా అక్కడే నిలిపివేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... పెనమలూరుకు చెందిన జ్ఞానేంద్ర, అనూషలు ఈనెల 24న సీఎంను కలిసి తమ సమస్యను వివరించేందుకు వచ్చారు. వీరిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, నాలుగు రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో వెనుతిరిగి వెళ్లిన జంట.. సొంత ఇల్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండులో తలదాచుకుంది..అయితే తమను పేర్ని నానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు బెదిరించారని వారు ఆరోపించారు. పేర్ని నాని పేరు బయటకు చెప్పి అల్లరి చేస్తే చంపేస్తామంటూ బెదిరించారని వాపోయారు. ‘2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. భర్త తరఫు బంధువులు తమను కలవనివ్వకుండా చంపుతామని బెదిరిస్తున్నారు’ అని అనూష వాపోయారు. తన తండ్రికి 24 ఎకరాలు భూమి ఉందని, అవనిగడ్డ, మోపిదేవి, పెడనల్లో భూములు ఉండటంతో వాటిని తన బాబాయ్‌లు ఆక్రమించి తమకు కాకుండా చేసి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి సమస్య పరిష్కరించాలని వస్తే తమను పోలీసులు కలవనివ్వడం లేదని తెలిపారు. తాము సీఎం నివాసం వైపు వస్తున్నామన్న సమాచారం తెలుసుకున్న సీఐ సాంబశివరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని తమని నిలిపేశారని వారు చెప్పారు. ‘సమస్య ఉంటే రాసివ్వండి, అధికారులకు పంపుతామని పోలీసులు రెండు రోజులుగా చెబుతున్నారు. సమస్య పరిష్కారం కాలేదు. మా సమస్య సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లే వరకు ఇక్కడే ఉంటాం’ అని వారు భీష్మించారు. పోలీసులు వారి వద్ద కాపలాగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని