అధికారిక అరాచకం

సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అధికార పార్టీ దెబ్బకు ఠారెత్తి పోతున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించాలంటే భయం..భయంగా గడపాల్సి వస్తోంది.

Published : 26 Nov 2022 05:22 IST

అన్యాయంపై ప్రశ్నించాలంటేనే భయం
ఈటీవీ ప్రతిధ్వని చర్చలో వక్తలు

ఈటీవీ, అమరావతి: సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అధికార పార్టీ దెబ్బకు ఠారెత్తి పోతున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించాలంటే భయం..భయంగా గడపాల్సి వస్తోంది. భద్రత కల్పించాల్సిన వ్యవస్థలు అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నాయి. రాష్ట్రంలో అనధికారికంగా సాగుతున్న అధికారిక అరాచక పర్వంపై శుక్రవారం ‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.


రాజ్యహింస కొనసాగుతోంది

ముప్పాళ్ల సుబ్బారావు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షుడు, పౌరహక్కుల సంఘం

ప్రజాస్వామ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. రాష్ట్రంలో ఆ హక్కులను పాలకులు హరించేస్తున్నారు. మేం నియంతలా పనిచేస్తాం తప్ప ప్రజాస్వామ్యయుతంగా పాలన చేయమనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఏసీబీ, జేసీబీ, పీసీబీ, సీఐడీ, పోలీసులతో మాట్లాడే వారి గొంతునొక్కి భయకంపితులను చేస్తున్నారు. టీచర్లు తమ బాధలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే నిర్బంధించారు. తరగతి గదిలోనూ టీచర్ల పక్కన పోలీసులను కూర్చోబెట్టి భయానక వాతావరణం కల్పించారు. పోలవరం ప్రాజెక్టు చూస్తామంటే గృహ నిర్బంధం చేశారు. ఎవరైనా ఆందోళన చేస్తామంటే హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు. అధికార పార్టీ వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే వారిని స్టేషన్లలో ఉంచి అవతల వారిని పిలిపించి ఫిర్యాదుదారుపైనా ఫిర్యాదు ఇవ్వమంటున్నారు. ప్రభుత్వంపై విమర్శిస్తే సీఐడీ సుమోటోగా కేసులు తీసుకుని.. నోటీసులు ఇచ్చి పిలిపించుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి  వేధిస్తున్నారు. అదే అధికార పార్టీకి చెందిన వ్యక్తులు న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై పోస్టింగులు పెట్టినా వారిపై ఎలాంటి చర్యలు ఉండడం లేదు. రక్షణ యంత్రాంగం భక్షకులుగా మారి ప్రజలను భయపెడుతున్నారు. ప్రశ్నిస్తే తమ సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో? ఏ తరహా దాడులు చేస్తారో? ఏ ఆస్తులు ధ్వంసం చేయిస్తారో? అనే భయం ప్రజల్లో నెలకొంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో ఓ డాక్టరు కరోనా కిట్‌ ఇవ్వలేదని అన్నందుకు అతన్ని పిచ్చివాడిగా చిత్రీకరించారు. మాస్క్‌ పెట్టుకోలేదని చీరాలలో ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు. ఇసుక ర్యాంపులు అక్రమంగా తరలిస్తున్నారని తూ.గో జిల్లా సీతానగరంలో ఓ వ్యక్తి ప్రశ్నిస్తే అతనికి శిరోముండనం చేశారు. కర్నూలులో ఓ ముస్లిం కుటుంబం రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దేశంలో ఎక్కడా జరగని విధంగా అధికార పార్టీ ఎమ్మెల్సీ ఓ వ్యక్తిని చంపి  మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన ఘటన కాకినాడలో జరిగింది.


వ్యవస్థలతోనే ప్రజలకు అవస్థలు

బీశెట్టి బాబ్జీ, రాష్ట్ర అధ్యక్షుడు, లోక్‌సత్తా

ఎన్నికల్లో పోటీ చేస్తే బెదిరింపులు ఎలా ఉంటాయనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశాం. మద్యం, గనులు, భూములు, ఇసుక ఇలా అన్నింటిలోనూ అంతులేని అక్రమాలు. సహజవనరుల దోపిడీకి అంతు లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా ప్రకారం మద్య నిషేధం జరగలేదు సరికదా కుటీర పరిశ్రమలా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలే ప్రజలకు అవస్థలు కలిగిస్తున్నాయి. కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులు, భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. తమ భూములు లాక్కుంటారని ఎవరైనా ఆవేదన వ్యక్తం చేస్తే ఆ భూములను 22-ఏలో ఉంచుతున్నారు. రెవెన్యూ రికార్డులు టాంపరింగ్‌ చేసి భూములు లాక్కుంటున్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం వల్లే కొంతవరకైనా ప్రభుత్వ దుశ్చర్యలను అడ్డుకోవడం సాధ్యమవుతోంది. ప్రతిపక్ష నేతగా తనకు రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం లేదని విమర్శించిన జగన్‌మోహనరెడ్డికి ఇప్పుడు పోలీసులు అత్యంత నమ్మకస్తులుగా పనిచేస్తుండడం అత్యంత ఆందోళన కలిగిస్తోన్న అంశం. అధికార పార్టీ నేతలు, వారి అండదండలతో ఎదురవుతున్న వేధింపులపై ముఖ్యమంత్రికి మొరపెట్టుకోవడానికి బాధితులు తరలివస్తున్నా తీవ్రతను ప్రభుత్వం గుర్తించడం లేదు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు