Darshit: ప్రాణం పోయాక స్పందించారు

ఇంటిపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు తీగలను తొలగించాలని ఏళ్లుగా మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. నిబంధనలు ఒప్పుకోవని, తీగలు మార్చాలంటే రుసుం చెల్లించాలని తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధులకు చెబితే తమ సమస్య తీరుతుందనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది.

Updated : 27 Nov 2022 07:46 IST

రాత్రి వేళ.. దర్శిత్‌ ఇంటిపై విద్యుత్తు తీగల తొలగింపు

తాళ్లపూడి, న్యూస్‌టుడే: ఇంటిపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు తీగలను తొలగించాలని ఏళ్లుగా మొరపెట్టుకున్నా అధికారులు వినలేదు. నిబంధనలు ఒప్పుకోవని, తీగలు మార్చాలంటే రుసుం చెల్లించాలని తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధులకు చెబితే తమ సమస్య తీరుతుందనుకుంటే అక్కడా నిరాశే ఎదురైంది. చివరికి ఆ తీగలు మూడేళ్ల చిన్నారి దర్శిత్‌ను బలిగొన్నాయి. పిల్లాడు చనిపోయాక అధికారులు స్పందించి, తీగలు తొలగించారు.. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టకు చెందిన జొన్నకూటి వినోద్‌ పాకపై నుంచి గతంలో 33కేవీ లైన్‌ వేశారు. వద్దని ఎంత మొత్తుకున్నా అధికారులు వినలేదు. ఆ తర్వాత కాలంలో వినోద్‌ అక్కడే ఇంటిని నిర్మించుకున్నారు. తీగలతో ప్రమాదమని, తొలగించాలని అధికారులకు, నాయకులకు వినతిపత్రాలు ఇచ్చారు. 3 నెలల కిందట ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనితకు వివరించినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నెల 12న వినోద్‌ కుమారుడు మూడేళ్ల దర్శిత్‌ ఆ తీగలవల్ల విద్యుదాఘాతానికి గురై మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. దర్శిత్‌ మృతికి అధికారులే బాధ్యులంటూ పలువురు నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు... దర్శిత్‌ చనిపోయాక... 25న రాత్రి 33కేవీ లైన్‌ తీగలను తొలగించారు. తీగలను ముందుగానే తొలగించి ఉంటే... బాలుడి ప్రాణం నిలిచేదని గ్రామస్థులు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు