ప్రభుత్వాల ఇనుప పాదాల నుంచి ప్రజలను రక్షించేదే రాజ్యాంగం

‘నిస్సహాయులు, నిరుపేదలు, అణగారిన వర్గాల విషయంలో అధికార దుర్వినియోగం జరిగి.. ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవం ఇచ్చిన ప్రజాయుధమే రాజ్యాంగం. ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది. మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టింది రాజ్యాంగమే.

Updated : 27 Nov 2022 05:47 IST

2023 ఏప్రిల్‌లో అంబేడ్కర్‌ మహా విగ్రహావిష్కరణ
రాజ్యాంగ దినోత్సవ సభలో సీఎం జగన్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: ‘నిస్సహాయులు, నిరుపేదలు, అణగారిన వర్గాల విషయంలో అధికార దుర్వినియోగం జరిగి.. ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవం ఇచ్చిన ప్రజాయుధమే రాజ్యాంగం. ఈ రాజ్యాంగం సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసింది. మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టింది రాజ్యాంగమే. 140 కోట్ల మంది ప్రజలకు క్రమశిక్షణ నేర్పే రూల్‌ బుక్‌ ఇది’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పేదరికం, సామాజిక ఆర్థిక తారతమ్యాల నుంచి బయటపడేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలనే సంకల్పం నుంచి అనేక పథకాలు పుట్టాయని, రాజ్యాంగంలో చెప్పిన గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసి దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదేనని చెప్పారు. 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తొలుత గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్యాంగంలోని ప్రవేశికను అందరితో చదివించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు గవర్నర్‌, సీఎం పుష్పాంజలి ఘటించారు. సభలో సీఎం మాట్లాడుతూ.. మహనీయుడు అంబేడ్కర్‌ ఈ రాజ్యాంగం రచించి ఇతర ప్రపంచ దేశాలతో భారత్‌ పోటీ పడేందుకు, ప్రగతి పథంలో పరుగెత్తేందుకు ఆస్కారం కల్పించారని పేర్కొన్నారు. అంబేడ్కర్‌ మహా విగ్రహాన్ని 2023 ఏప్రిల్‌లో విజయవాడలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాజధానికి కేటాయించిన భూముల్ని పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని వాదించే దుర్మార్గం భారతదేశంలో మొలకెత్తుతుందని రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజు ఊహించి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాదాలతో తమ ప్రభుత్వం  యుద్ధం చేస్తోందని తెలిపారు. 35 నెలల పాలన కాలంలో నేరుగా బటన్‌ నొక్కి ప్రజల ఖాతాల్లోకి రూ.1,76,517 కోట్లు జమ చేశామని, ఇతరత్రా కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.3,18,037 కోట్లు అందించామని చెప్పారు. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 79శాతం నిధులు చేరాయని వెల్లడించారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చి సామాజిక న్యాయం కల్పించామని సీఎం పేర్కొన్నారు.

వేదకాలం నుంచే ప్రజాస్వామ్యం: గవర్నర్‌

‘సామాన్యుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా సమాన హక్కులు పొందేలా మన రాజ్యాంగం అమలవుతోంది. రాజ్యాంగ రూపకర్తల కృషిని ఎవరూ మరిచిపోరు’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. వేదకాలం నుంచే భారత దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, ఇందుకు చారిత్రక, ఆధ్యాత్మిక ఆధారాలున్నాయని తెలిపారు. ఈ ఏడాది మనం రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రజాస్వామ్యానికే భారత్‌ తల్లి అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర కాలం నాటి చీకటి పరిస్థితులను గవర్నర్‌ గుర్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని